anupama shenoy
-
అనుపమ పొలిటికల్ ఎంట్రీ
-
అనుపమ పొలిటికల్ ఎంట్రీ
సాక్షి, బళ్లారి: పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలి అని పెద్దలంటారు. అదే మాదిరిగా కూడ్లిగిలో డీఎస్పీగా పని చేస్తూ అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించి ప్రభుత్వం, మంత్రిపై వ్యతిరేకతతో చివరకు డీఎస్పీ పదవినే త్యజించిన ఉద్యమ నారి అనుపమ షణై రాజకీయ భేరి మోగించారు. అనుపమ షణై బుధవారం జిల్లాలోని కూడ్లిగిలో అభిమానులు, కార్యకర్తల మధ్య ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటించారు. పార్టీకి భారతీయ జనశక్తి కాంగ్రెస్ పార్టీ అని నామకరణం చేశారు. కేసరి తెలుపు, పచ్చ రంగులతో కూడిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ముందుగా పట్టణంలో మహాత్మాగాంధీ సమాధికి పూజలు నిర్వహించిన అనంతరం పెద్ద ఎత్తున ఊరేగింపుతో పంచాచార్య కళ్యాణ మంటపంలో నూతన పార్టీకి అంకురార్పణ చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పార్టీలపై జనం విసుగు చెందారని, ఈ నేపథ్యంలో కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. కర్ణాటక సమగ్రాభివృద్ధి కోసం పనిచేసే విధంగా ముందుకెళ్తామన్నారు. తమ పార్టీలో నాయకత్వ లక్షణాలు, ప్రజలకు సేవచేసే గుణం కలిగినవారిని చేర్పించుకుని అసెంబ్లీకి వెళ్తామన్నారు. ప్రజల మద్దతు తప్పకుండా లభిస్తుందని, తాము 80 లేదా అంతకన్నా ఎక్కువ సీట్లలో పోటీచేసి ప్రజల మద్దతు కోరతామని చెప్పారు. -
ఉద్యమ నారి.. రాజకీయ భేరి
డ్యాషింగ్– డేరింగ్ డీఎస్పీగా పేరుగాంచిన అనుమప షణై రాజకీయ చదరంగంలో పాదం మోపాలని నిర్ణయించారు. ఎక్కడ రాజకీయ నాయకుల వల్ల ఇబ్బందులు పడి ఉద్యోగాన్ని వదిలేసారో అదే కూడ్లిగిలో పార్టీ ఆవిర్భావ సభను జరపాలని కుతూహలంతో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లలో పోటీచేస్తామని ఆమె ప్రకటించారు. సాక్షి, బళ్లారి: మద్యం మాఫియా, రాజకీయ నేతల అవినీతిపై పోరాడి, చివరికి డీఎస్పీ ఉద్యోగాన్ని త్యజించిన అనుపమ షణై రాజకీయ రంగంలోకి రావాలని నిర్ణయించారు. ఒక కొత్త పార్టీకి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నానని, ప్రజల సహకారం అవసరమని ఆమె ప్రకటించారు. గురువారం కలబుర్గిలో అనుపమ షణై అభిమానుల సంఘం ఆధ్వర్యంలో మహిళా సమావేశం జరగ్గా ఆమె పాల్గొన్నారు. అనుపమ మాట్లాడుతూ తాను నూతన రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. అందుకు మహిళల మద్దతు అవసరమని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీలు ఇస్తున్నారే కాని ఇంతవరకు అమలు చేయడం లేదన్నారు. మహిళల సంక్షేమం గురించి కాంగ్రెస్, బీజేపీలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయని ధ్వజమెత్తారు. తాను నూతనంగా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కర్ణాటకలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 అసెంబ్లీ సీట్లు మహిళలకు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఎవరీ అనుపమ? : బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్పీగా 2014 సెప్టెంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన అనుపమ షణై అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించడమే కాకుండా అక్రమ మద్యం వ్యాపారాలపై ఉక్కుపాదం మోపి సంచలనం సృష్టించారు. అక్రమ మద్యం కట్టడిపై అప్పటి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర్ నాయక్‌తో ఆమెకు విభేదాలు ఏర్పడ్డాయి. అక్రమ మద్యం వ్యాపారానికి ప్రభుత్వం సహకరిస్తోందని మండిపడుతూ ఆమె రాజకీయ నాయకులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు గుప్పించేవారు. ఈ నేపథ్యంలో మంత్రి, ప్రభుత్వంతో నడుస్తున్న కోల్డ్‌వార్‌తో 2016లో ఆమె డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రభుత్వం ఆమోదిస్తుందా? లేదా? అని ఉత్కంఠ భరితంగా జనం ఎదురు చూశారు. అయితే ఆమె చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. కూడ్లిగిలోనే పార్టీ ఆవిర్భావ సభ!: రాజీనామా చేసినప్పటి నుంచి ఆమె రాజకీయాల్లోకి వస్తారనే వదంతులు సాగుతున్నాయి. ఆమె బీజేపీలోకి చేరుతారు అని ప్రచారం సాగినా చివరికి ఆమె సొంత పార్టీ ఏర్పాటుకు మొగ్గుచూపడం విశేషం. ఎక్కడైతే ఉద్యోగంలో చేరి అక్రమాలపై పోరాడారో ఆ కూడ్లిగి నుంచే ఆమె రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 1న పార్టీ ఆవిర్భావాన్ని కూడ్లిగిలోనే సభ నిర్వహించి ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇందుకుగాను కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పూర్తిచేయాల్సిన కార్యక్రమాలను చేపడుతున్నారు. -
ఈ రెండింటికి బలయ్యాను: అనుపమ
బెంగళూరు: అవినీతి రాజకీయాలకు, వ్యవస్థలోని లోపాలకు తాను బలయ్యానని మాజీ డీఎస్పీ అనుపమ షెనాయ్ అన్నారు. కర్ణాటక మహిళ కమిషన్ ఎదుట హాజరై అనుపమ తన వాదనలు వినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘మొత్తం సమాజం, వ్యవస్థ అంతటా పురుషాధిక్యమే. పురుష భావజాలం ప్రకారం వ్యవస్థ నడుస్తోంది. వ్యవస్థకు, అవినీతి రాజకీయాలకు నేను బలయ్యాను’ అని అన్నారు. మంత్రి తన విధుల్లో జోక్యం చేసుకుంటూ, ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ బళ్లారి జిల్లా కుద్లిగి డీఎస్పీ అనుపమ ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ ఒత్తిడితో బళ్లారి ఎస్పీ చేతన్ తనను వేధిస్తున్నారంటూ కర్ణాటక మహిళ కమిషన్‌కు అనుపమ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మహిళ కమిషన్ ఎదుట హాజరై అనుపమ తాను ఎదుర్కొన్న సమస్యలను ఏకరవు పెట్టారు. పురుషాధిక్య వ్యవస్థలో మహిళ ఉద్యోగుల సమస్యలకు పరిష్కారమార్గాలు వెతకాలని కోరారు. డీఎస్పీ ఉద్యోగం తనకు ఎలాంటి మానసిక ప్రశాంతత ఇవ్వలేదని, ప్రస్తుతం తాను ప్రశాంతంగా ఉన్నానని అన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ కేసును ఈ నెల 16కు వాయిదా వేసినట్టు మహిళ కమిషన్ చీఫ్ మంజుల మానస చెప్పారు. -
ఎస్పీ నన్ను వేధించారు: మాజీ మహిళా డీఎస్పీ
సీనియర్లు తనను వేధింపులకు గురిచేశారంటూ కర్ణాటకలోని కుదిల్గి మాజీ డీఎస్పీ అనుపమా షెనాయ్ కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె కమిషన్‌కు ఏడు పేజీల లేఖ రాశారు. జిల్లా ఎస్పీ ఆర్. చేతన్ తనను వేధిస్తున్నారని తెలిపారు. సరిగ్గా తాను రాజీనామా చేసిన జూన్ 4వ తేదీనే ఆమె ఈ లేఖను పంపారు. తన సమీప బంధువులతో ఈ లేఖను పంపినట్లు తెలిసింది. తన కింద పనిచేసేవాళ్లు అసలు సహకరించేవారు కారని, తన రాజీనామాకు కూడా ఎస్పీయే కారణమని ఆమె ఆరోపించారు. తాను 19 రోజుల సెలవులో వెళ్లినపుడు పోలీసు స్టేషన్‌లోని రహస్య డాక్యుమెంట్లను ఎస్పీ విడుదల చేశారని, వాటివల్ల తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని అన్నారు. సెలవు నుంచి తిరిగొచ్చిన తర్వాత చిన్న చిన్న కారణాలకే తనపై పలు మెమోలు జారీచేశారన్నారు. తాను సెలవు పెడితే.. ఆ లేఖను ఎస్పీ మెడికల్ బోర్డుకు పంపారని చెప్పారు. ఈ వ్యవహారంపై పోలీసులకు బదులు మహిళా కమిషనే విచారణ జరపాలని కోరారు. అయితే తాను షెనాయ్ విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని ఎస్పీ చేతన్ తెలిపారు. తాను ఆమెను వేధించాలనుకుంటే ఆమెపై సీనియర్లకు వ్యతిరేకంగా నివేదిక పంపేవాడినని అన్నారు. -
అనుపమ రాజీనామాలో ట్విస్ట్
బళ్లారి: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్పీ అనుపమ షెనాయ్ రాజీనామా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అనుపమ రాజీనామా విషయలో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. కర్ణాటక మంత్రి పరమేశ్వర్ నాయక్ తన విధుల్లో జోక్యం చేసుకుని ఆటంకం కలిగించారని, తనన బెదిరించారని ఆరోపిస్తూ అనుపమ ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనుపమ రాజీనామాను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించినట్టు వార్తలు వచ్చాయి. అనుపమ తన రాజీనామా లేఖలో మంత్రి పరమేశ్వర్ నాయక్ పేరును ప్రస్తావించడంపై ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి ప్రస్తావన లేకుండా మరో రాజీనామా లేఖ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అనుపమ మంత్రి పేరు ప్రస్తావనకు తీసుకురాకుండా రెండోసారి రాజీనామా లేఖను అందజేసింది. ఈ రాజీనామా లేఖకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. -
నాకు ప్రాణహాని ఉంది: అనుపమ
బెంగళూరు: సంచలన మాజీ పోలీస్ ఉన్నతాధికారిణి, కర్ణాటకలోని బళ్లారి జిల్లా కుడ్లిగి మాజీ డీఎస్పీ అనుపమ షెనాయ్ తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుపమ రాజీనామాను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పింది. కాగా ఎవరి నుంచి ప్రాణహాని ఉంది, బెదిరింపులు ఏమైనా వచ్చాయా అన్న విషయాలను ఆమె వెల్లడించలేదు. కర్ణాటక మంత్రి పరమేశ్వర్ నాయక్‌కు సంబంధించిన సీడీ, ఆడియోలను బెంగళూరులో మీడియా సమక్షంలో విడుదల చేయనున్నట్టు చెప్పారు. అనుపమ రాజీనామా వ్యవహారం కర్ణాటకలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. మంత్రి పరమేశ్వర్ నాయక్ తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ ఆమె రాజీనామా చేశారు. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఆయన రాసలీలల వీడియో తన దగ్గర ఉందని, దాన్ని బయటపెడతానని ఆమె హెచ్చరించారు. కొన్ని రోజులు అజ్ఞాతంలో గడిపన అనుపమ రెండు రోజుల క్రితం కుడ్లిగి వచ్చారు. కాగా అనుపమ రాజీనామాను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించినందుకు బళ్లారి జిల్లాలో నిరసనలు వ్యక్తమయ్యాయి. -
మంత్రి రాసలీలల వీడియో నా దగ్గరుంది: అనుపమ
కర్ణాటకలోని బళ్లారి జిల్లా కుదిల్గి డీఎస్పీగా రాజీనామా చేసిన అనుపమా షెనాయ్ ఆటం బాంబు పేల్చారు. ఐదు రోజుల పాటు ఎక్కడున్నారో కూడా తెలియని ఆమె.. గురువారం ఉదయం తిరిగొచ్చారు. కార్మిక శాఖ మంత్రి పరమేశ్వర నాయక్ తనను బెదిరించినప్పటి ఆడియో టేప్ తన వద్ద ఉం దని ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆయనగారి రాసలీలల వీడియో కూడా ఉందని, మంత్రి ఆయన పదవి నుంచి తప్పుకొంటే తప్ప తన రాజీనామా ఉపసంహరించుకునేది లేదని స్పష్టం చేశారు. ఆడియో, వీడియోలను తగిన సమయంలో బయట పెడతానని చెప్పారు. అవినీతిపరులపై న్యాయపోరాటం చేస్తానన్నారు. నాకు ఫేస్బుక్ అకౌంటే లేదు ఈనెల 4వ తేదీన రాజీనామా చేసిన షెనాయ్ పేరుమీద వచ్చిన ఫేస్బుక్ పోస్టులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రాజకీయ దుమారం లేపాయి. కానీ, అసలు తనకు ఫేస్బుక్ అకౌంటే లేదని అనుపమా షెనాయ్ గురువారం వెల్లడించారు. తాను రాజీనామా చేయడానికి రాజకీయ ఒత్తిడి ఏమాత్రం కారణం కాదని, వ్యక్తిగత కారణాలతోనే తప్పుకొన్నానని అన్నారు. కొందరు వ్యక్తులు తన రాజీనామాను తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నారు. తన సోదరుడు అచ్యుత్ షెనాయ్‌తో కలిసి ఆమె పోలీసు క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఆమె ఎస్పీ లేదా మరే ఇతర అధికారులతో మాట్లాడలేదని, క్వార్టర్స్ లోపలే తలుపులకు గడియ పెట్టుకుని ఉన్నారని తెలిసింది.