డ్యాషింగ్– డేరింగ్ డీఎస్పీగా పేరుగాంచిన అనుమప షణై రాజకీయ చదరంగంలో పాదం మోపాలని నిర్ణయించారు. ఎక్కడ రాజకీయ నాయకుల వల్ల ఇబ్బందులు పడి ఉద్యోగాన్ని వదిలేసారో అదే కూడ్లిగిలో పార్టీ ఆవిర్భావ సభను జరపాలని కుతూహలంతో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లలో పోటీచేస్తామని ఆమె ప్రకటించారు.
సాక్షి, బళ్లారి: మద్యం మాఫియా, రాజకీయ నేతల అవినీతిపై పోరాడి, చివరికి డీఎస్పీ ఉద్యోగాన్ని త్యజించిన అనుపమ షణై రాజకీయ రంగంలోకి రావాలని నిర్ణయించారు. ఒక కొత్త పార్టీకి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నానని, ప్రజల సహకారం అవసరమని ఆమె ప్రకటించారు. గురువారం కలబుర్గిలో అనుపమ షణై అభిమానుల సంఘం ఆధ్వర్యంలో మహిళా సమావేశం జరగ్గా ఆమె పాల్గొన్నారు. అనుపమ మాట్లాడుతూ తాను నూతన రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. అందుకు మహిళల మద్దతు అవసరమని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీలు ఇస్తున్నారే కాని ఇంతవరకు అమలు చేయడం లేదన్నారు. మహిళల సంక్షేమం గురించి కాంగ్రెస్, బీజేపీలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయని ధ్వజమెత్తారు. తాను నూతనంగా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కర్ణాటకలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 అసెంబ్లీ సీట్లు మహిళలకు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
ఎవరీ అనుపమ? : బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్పీగా 2014 సెప్టెంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన అనుపమ షణై అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించడమే కాకుండా అక్రమ మద్యం వ్యాపారాలపై ఉక్కుపాదం మోపి సంచలనం సృష్టించారు. అక్రమ మద్యం కట్టడిపై అప్పటి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర్ నాయక్‌తో ఆమెకు విభేదాలు ఏర్పడ్డాయి. అక్రమ మద్యం వ్యాపారానికి ప్రభుత్వం సహకరిస్తోందని మండిపడుతూ ఆమె రాజకీయ నాయకులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు గుప్పించేవారు. ఈ నేపథ్యంలో మంత్రి, ప్రభుత్వంతో నడుస్తున్న కోల్డ్‌వార్‌తో 2016లో ఆమె డీఎస్‌పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రభుత్వం ఆమోదిస్తుందా? లేదా? అని ఉత్కంఠ భరితంగా జనం ఎదురు చూశారు. అయితే ఆమె చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.
కూడ్లిగిలోనే పార్టీ ఆవిర్భావ సభ!: రాజీనామా చేసినప్పటి నుంచి ఆమె రాజకీయాల్లోకి వస్తారనే వదంతులు సాగుతున్నాయి. ఆమె బీజేపీలోకి చేరుతారు అని ప్రచారం సాగినా చివరికి ఆమె సొంత పార్టీ ఏర్పాటుకు మొగ్గుచూపడం విశేషం. ఎక్కడైతే ఉద్యోగంలో చేరి అక్రమాలపై పోరాడారో ఆ కూడ్లిగి నుంచే ఆమె రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 1న పార్టీ ఆవిర్భావాన్ని కూడ్లిగిలోనే సభ నిర్వహించి ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇందుకుగాను కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పూర్తిచేయాల్సిన కార్యక్రమాలను చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment