ఎస్పీ నన్ను వేధించారు: మాజీ మహిళా డీఎస్పీ
సీనియర్లు తనను వేధింపులకు గురిచేశారంటూ కర్ణాటకలోని కుదిల్గి మాజీ డీఎస్పీ అనుపమా షెనాయ్ కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె కమిషన్కు ఏడు పేజీల లేఖ రాశారు. జిల్లా ఎస్పీ ఆర్. చేతన్ తనను వేధిస్తున్నారని తెలిపారు. సరిగ్గా తాను రాజీనామా చేసిన జూన్ 4వ తేదీనే ఆమె ఈ లేఖను పంపారు. తన సమీప బంధువులతో ఈ లేఖను పంపినట్లు తెలిసింది.
తన కింద పనిచేసేవాళ్లు అసలు సహకరించేవారు కారని, తన రాజీనామాకు కూడా ఎస్పీయే కారణమని ఆమె ఆరోపించారు. తాను 19 రోజుల సెలవులో వెళ్లినపుడు పోలీసు స్టేషన్లోని రహస్య డాక్యుమెంట్లను ఎస్పీ విడుదల చేశారని, వాటివల్ల తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని అన్నారు. సెలవు నుంచి తిరిగొచ్చిన తర్వాత చిన్న చిన్న కారణాలకే తనపై పలు మెమోలు జారీచేశారన్నారు. తాను సెలవు పెడితే.. ఆ లేఖను ఎస్పీ మెడికల్ బోర్డుకు పంపారని చెప్పారు. ఈ వ్యవహారంపై పోలీసులకు బదులు మహిళా కమిషనే విచారణ జరపాలని కోరారు. అయితే తాను షెనాయ్ విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని ఎస్పీ చేతన్ తెలిపారు. తాను ఆమెను వేధించాలనుకుంటే ఆమెపై సీనియర్లకు వ్యతిరేకంగా నివేదిక పంపేవాడినని అన్నారు.