రైతుల చెంతకే బ్యాంక్!
రైతు సేవలో పేరూరు ఏపీజీబీ
గ్రామాల్లోకి వెళ్లి పంట రుణాలు
పంట రుణాలు తీసుకోవాలన్నా.. రెన్యూవల్ చేయాలన్నా.. గంటల తరబడి బ్యాంక్‌ల వద్ద రైతులు పడిగాపులు పడాల్సిందే. బ్యాంక్ లావాదేవీలు అర్థం కాని ఇలాంటి తరుణంలోనే పలువురు రైతులు మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ విధానానికి రామగిరి మండలంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, పేరూరు శాఖ ఉద్యోగులు స్వస్తి పలికారు. రోజుల తరబడి బ్యాంక్‌ల వద్ద రైతులు పడిగాపులు పడకుండా.. వారి సమయాన్ని, డబ్బును ఆదా చేసే సరికొత్త పంథాకు శ్రీకారం చుట్టారు.
- రామగిరి (రాప్తాడు)
ఆర్థిక లావాదేవీలకు కేంద్రబిందువుగా ఉన్న బ్యాంక్‌లలో ఏ చిన్న పొరబాటు జరిగినా.. ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయోనన్న ఆందోళన ఉద్యోగులను వేధిస్తూ ఉంటుంది. ఈ తరహా ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వర్తిస్తున్న బ్యాంక్ ఉద్యోగులు.. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయి ఖాతాదారుల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ చిందులు వేస్తుంటారు. అయితే పేరూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ శాఖ ఉద్యోగులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
రైతుల ఇంటి వద్దకే
పంట రుణాలు, రెన్యూవల్స్ సమయంలో బ్యాంక్‌ల చుట్టూ రోజుల తరబడి రైతులు తిరగాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో పొలాల్లో పనులు వదులుకుని, డబ్బు వృథా చేసుకోవాల్సి వస్తోంది. ఇది జిల్లాలో ఏ బ్యాంకు వద్దనైనా ఖాతాదారులకు నిత్యం ఎదురయ్యే సమస్యే. అయితే ఏపీజీబీ పేరూరు శాఖలో రైతులు వేచి ఉండాల్సిన పనిలేదు. అంతేకాక పంట కాలంలో బ్యాంక్ అధికారులే నేరుగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రుణాలు మంజూరు, రెన్యూవల్ చేయడం లాంటి పనులు చేస్తున్నారు. ఒకవేళ ఈ విషయం తెలియక ఎవరైనా రైతులు బ్యాంక్ వద్దకు వస్తే.. సగౌరంగా వారిని కూర్చొబెట్టి బ్యాంక్ వద్దకు కాకుండా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందిస్తామంటూ నచ్చచెప్పి పంపుతున్నారు. ఇందుకు సంబంధించి ముందస్తుగానే షెడ్యూల్‌ను ప్రకటించి, ఆ మేరకు గ్రామాల్లో బ్యాంక్ అధికారులు పర్యటిస్తూ పంట రుణాలు రెన్యూవల్ చేస్తున్నారు.
ఐదు గ్రామాల్లో పర్యటిస్తూ..
ఏపీజీబీ పేరూరు శాఖ పరిధిలో ఐదు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని 5,500 మంది రైతులకు రూ. 51 కోట్ల పంట రుణాలను బ్యాంక్ అధికారులు అందజేశారు. ప్రస్తుతం కొత్త రుణాల కింద ఎకరాకు అన్ని బ్యాంక్‌లు రూ. 18 వేలు ఇస్తుండగా... పేరూరులోని ఏపీజీబీ ద్వారా రూ. 21 వేలు ఇస్తున్నారు. వినూత్నమైన సేవలను అందిస్తూ కరువు రైతులకు అండగా నిలిచిన బ్యాంక్ మేనేజర్ జూడాస్, ఫీల్డ్ ఆఫీసర్ సంజీయరాయుడుని ఈ సందర్భంగా పలువురు రైతులు అభినందిస్తున్నారు.
దళారుల బెడద తప్పింది
బ్యాంకు అధికారులు ఇంటివద్దకే వచ్చి రుణాలు రెన్యూవల్ చేస్తుండడంతో రైతులకు దళారుల బెడద తప్పింది. మా గ్రామాల్లోకే వచ్చి రైతులకు రుణాలు ఇస్తున్నారు. దీంతో మా సమయం, డబ్బు ఆదా అవుతోంది.
- సావిత్రమ్మ, మహిళా రైతు, పేరూరు
రైతులు ఇబ్బందులు పడకూడదనే
రైతులు బ్యాంకుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడకూడదనే గ్రామాల్లోకి వెళ్లి వడ్డీ మాత్రమే కట్టించుకుని పంట రుణాలు రెన్యూవల్స్ చేస్తున్నాం. మా సిబ్బంది సహకారంతోనే ఈ విధానం అమలు పరుస్తున్నాం.
- జూడాస్, బ్యాంక్ మేనేజర్