కటకటాల్లోకి కిరాతకుడు
నార్సింగి,
యువకుడి హత్య.. యువతి కిడ్నాప్, లైంగికదాడి కేసును నార్సింగ్ పోలీసులు ఛేదించారు. ఈ ఘోరానికి పాల్పడిన ఇద్దరు కిరాతకుల్లో ఒకడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
నార్సింగి పోలీసు స్టేషన్లో మంగళవారం రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. రాజేంద్రనగర్ మండలం పీరంచెరువు గ్రామం హిమగిరికాలనీకి చెందిన యువతి (19), భర్తతో కలిసి ఉంటోంది. ఈమెకు అత్తాపూర్ రింగ్‌రోడ్డు మొఘల్కానాల ప్రాంతానికి చెందిన మహ్మద్ అఫ్రోజ్‌తో వివాహేతర సంబంధం ఉంది. తన భర్తతో ఈమెకు తరచూ గొడవ జరుగుతుండేది. ఇదే క్రమంలో గతనెల 18న గొడవ జరుగగా భర్త ఆమెను కొట్టి ఇంటి నుంచి పారిపోయాడు.
వెంటనే ఆ యువతి తన ప్రియుడు అఫ్రోజ్‌కు ఫోన్‌కు చేయగా అతను తన బైక్‌పై వచ్చాడు. ఆమెను చికిత్స నిమిత్తం అదే రాత్రి వట్టేపల్లికి తీసుకెళ్లాడు. చికిత్స అనంతరం రాత్రి ఒంటి గంటకు ఇద్దరూ హిమగిరి కాలనీకి బయలుదేరారు. మార్గం మధ్యలో తప్పతాగి ఉన్న గోపన్‌పల్లికి చెందిన మహ్మద్ మోసియొద్దీన్, సయిద్ ఇద్రీస్ అలియాస్ సమీర్లు బ్లాక్ కలర్ టయోటా కారులో వీరి బైక్‌ను వెంబడించారు. అఫ్రోజ్ యువతి ఇంటి సమీపానికి వచ్చి బైక్‌ను ఆపగానే.. ఇద్రీస్, మోసియొద్దీన్లు కర్రతో దాడి చేశారు. తీవ్రగాయాలు కావడంతో అతను కుప్పకూలాడు.
యువతి అరుస్తున్నా లెక్క చేయకుండా ఇద్దరూ ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేసుకుపోయారు. గోపన్‌పల్లిలోని ఓ షెడ్డులోకి కారును తీసుకెళ్లారు. కారులోనే ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. 19వ తేదీ ఉదయం 7 గంటలకు కారులో బాధితురాలిని తీసుకొని టోలిచౌకీ గెలాక్సీ థియేటర్ వద్దకు వచ్చారు. కారును రోడ్డుపై నిలిపి టిఫిన్ తినేందుకు హాటల్లోకి వెళ్లగానే బాధితురాలు తప్పించుకుంది. నేరుగా నార్సింగ్ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. రక్తపు మడుగులో పడి ఉన్న అఫ్రోజ్‌ను పోలీసులు ఉస్మానియాకు తరలించగా చికి త్స పొందుతూ మృతి చెందాడు.
యువతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోసియొద్దీన్, ఇద్రీస్లను నిందితులగా గుర్తించారు. మంగళవారం నిందితుల్లో ఇద్రీస్‌ను పట్టుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మోసియొద్దీన్ కోసం గాలిస్తున్నారు. వీరిద్దరూ గతంలో మియాపూర్, దుండిగల్ పోలీసు స్టేషన్ల పరిధుల్లో పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు మిస్టరీని ఛేదించడంలో ప్రతిభ కనపర్చిన నార్సింగి ఇన్స్పెక్టర్ ఆనంద్‌రెడ్డి, ఎస్ఐ హఫీజ్‌లను ఏసీపీ అభినందించారు.