apnadal party
-
ఆ అడుగుల్లో భాగమేనా? వెనక్కి తగ్గిన పల్లవి పటేల్ పార్టీ
వచ్చే ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన అప్నా దళ్ (కెమెరవాడి) తన నిర్ణయాన్ని మార్చుకుంది. పార్టీ అభ్యర్థుల సవరించిన జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి రామ్ సనేహి పటేల్ ఒక ప్రకటనలో ప్రకటించారు. ‘ఇండియా’ కూటమికి చెందిన అప్నా దళ్ (కామెరవాడి) కౌశంబి, ఫుల్పూర్, మీర్జాపూర్ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అయితే తరువాత పార్టీ నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ స్థానాల నుండి తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఆ పార్టీ గతంలో 2022 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఇంతకుముందు వారి సహకారం ఉన్నప్పటికీ, 2024 ఎన్నికలకు అప్నా దళ్ (కెమెరవాడి)తో పొత్తు ఉండదని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. దీంతో అప్నా దళ్ (కెమెరవాడి) త్వరలో అభ్యర్థుల కొత్త జాబితాను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. కాగా రెండు రోజుల క్రితం ఆ పార్టీ ముఖ్య నాయకురాలు పల్లవి పటేల్.. తమ పార్టీ ‘ఇండియా’ కూటమిలో ఉండాలా వద్దా అనేది కాంగ్రెస్ నిర్ణయించుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేలో చేరే అవకాశంపై సంకేతాలు ఇచ్చారు. బీజేపీ నుంచి ఏదైనా ఆఫర్ వస్తే తమ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందని పల్లవి పటేల్ చెప్పారు. పార్టీ ప్రకటించిన స్థానాల విషయంలో నిర్ణయాన్ని మార్చుకోవడం ఇందులో భాగమేనా అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
అక్కా.. వచ్చేస్తున్నా! ఎన్డీఏ వైపు పల్లవి పటేల్
లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ‘ఇండియా’ కూటమికి షాకిస్తూ అప్నా దళ్ (కామెరవాడి) నాయకురాలు, సిరతు ఎమ్మెల్యే పల్లవి పటేల్ ( Pallavi Patel ) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇక పొత్తుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బిహార్‌లో ‘ఇండియా’ కూటమికి నితీష్ కుమార్ ఇచ్చిన షాకే ఉత్తరప్రదేశ్‌లోని అప్నా దళ్-కామెరవాడి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. "ప్రస్తుతం ఎన్డీఏతో చర్చలు లేవు. ఒకవేళ ఆఫర్ వస్తే తమ పార్టీ పరిశీలిస్తుంది" అని డాక్టర్ పల్లవి పటేల్ చెప్పారు. మరోవైపు అప్నా దళ్ (కామెరవాడి) ఉత్తరప్రదేశ్‌లోని మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఒక రోజు తర్వాత సమాజ్‌వాదీ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కృష్ణ పటేల్ నేతృత్వంలోని పార్టీతో పొత్తు లేదని తెలిపింది. “అప్నాదళ్ (కె), సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తు 2022 అసెంబ్లీ ఎన్నికల కోసమే కానీ, 2024 ఎన్నికల కోసం కాదు” అని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. పల్లవి పటేల్ సోదరి, అప్నా దళ్ (సోనేలాల్) అధినేత్రి అనుప్రియా పటేల్ ( Anupriya Patel ) ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. అప్నా దళ్ (కే) ప్రకటించిన మూడు స్థానాల్లో మీర్జాపూర్ స్థానం నుండి అనుప్రియా పటేల్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఫుల్పూర్, కౌశంబి లోక్‌సభ స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం మూడు స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. -
ఆ గట్టున తల్లి.. ఈ గట్టున కూతురు!
‘ఇండియా’ కూటమికి మిత్రపక్షమైన అప్నా దళ్ (కామెరవాడి) ఉత్తరప్రదేశ్‌లో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఫుల్పూర్, మీర్జాపూర్, కౌశాంబి మూడు స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. “అప్నా దళ్ (కె) కేంద్ర కార్యవర్గ సమావేశం జాతీయ అధ్యక్షురాలు కృష్ణ పటేల్ ఆధ్వర్యంలో జరిగింది. ఇండియా కూటమిలో భాగంగా మూడు స్థానాల్లో పోటీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు' అని కేంద్ర కార్యాలయ కార్యదర్శి రామ్ సనేహి పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు సీట్ల పంపకాన్ని నిర్ణయించుకున్నాయి, దాని ప్రకారం కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయగా, సమాజ్‌వాదీ పార్టీ 63 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టనుంది. సమాజ్‌వాదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కి భదోహి సీటును ఇచ్చింది. అక్కడ లలితేష్ త్రిపాఠిని అభ్యర్థిగా నిలిపింది. అప్నాదళ్ (కె) సీట్లను ప్రకటించడంపై సమాజ్‌వాదీ పార్టీ నేతలను ప్రశ్నించగా.. దాని గురించి తమకు తెలియదన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో అప్నా దళ్ (సోనీలాల్) నాయకురాలు అనుప్రియ పటేల్ (Anupriya Patel) సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్ చరిత్ర నిషాద్పై పోటీ చేసి 2,32,008 ఓట్ల తేడాతో గెలిచారు. అప్నా దళ్ (సోనీలాల్) ఎన్డీఏ మిత్రపక్షంగా ఉంది. అనుప్రియా పటేల్ మోదీ ప్రభుత్వంలో వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనుప్రియ అప్నా దళ్ (సోనేలాల్) పార్టీని స్థాపించిన సోనే లాల్ పటేల్ కుమార్తె. రాబోయే ఎన్నికల్లో మీర్జాపూర్లో అప్నా దళ్ (సోనేలాల్) వర్సెస్ అప్నా దళ్ (కామెరావాడి) మధ్య పోటీ జరుగుతుందని భావిస్తున్నారు. -
బీజేపీ పెద్దలకు అఖిలేశ్ యాదవ్ గట్టి ఝలక్
-
బీజేపీకి షాకిచ్చేలా.. మాస్టర్ స్ట్రోక్.. మైండ్‌గేమ్!
ఉత్తరప్రదేశ్‌లో ఏదో జరుగుతోంది. నిన్న మొన్నటి దాకా బీజేపీ మంచి స్థితిలో ఉన్నట్లు కనిపించింది. కానీ ఉన్నట్టుండి ఈ వలసలేమిటి? ఒకరివెంట మరొకరు పోటీలుపడి ఓబీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీని ఎందుకు వీడుతున్నారు. బీసీల ప్రయోజనాలను సమాజ్‌వాదీ పార్టీ మాత్రమే కాపాడగలదా? బీజేపీ మునిగిపోయే నౌకా? నాయకగణంలో, జనసామాన్యంలో ఇప్పుడీ అభిప్రాయం బలపడుతోంది. బీజేపీలో ‘ఆల్ ఈజ్ నాట్ వెల్’ అనేది బాగా ప్రబలింది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బృందానికి సరిగ్గా ఇదే కావాలి. అంతా వారనుకున్నట్లే జరుగుతోంది. ఆడించినట్లే రక్తి కడుతోంది. వ్యూహరచనలో, క్షేత్రస్థాయిలో తమకు తిరుగులేదని భావిస్తున్న బీజేపీ పెద్దలకు అఖిలేశ్ ఇచ్చిన గట్టి ఝలక్ ఇది. ఎన్నికల నగారా మోగాక.. అసలుసిసలు ‘సినిమా’ చూపిస్తున్న వైనమిది. ఇదంతా ఈనెల 11న ప్రముఖ ఓబీసీ నేత, మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యతో మొదలైంది. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. మౌర్య మద్దతుదారులైన నలుగురు ఎమ్మెల్యేలు అదే బాట పట్టారు. చిన్న అలజడి మొదలైంది. 12న మరో ఓబీసీ ముఖ్యనేత, మంత్రి దారాసింగ్ చౌహాన్ బీజేపీకి టాటా చెప్పారు. 13న మరో ఓబీసీ నేత ధరమ్‌సింగ్ సైనీ కాషాయదళాన్ని వీడారు. మూడురోజుల్లో ముగ్గురు మంత్రులు... ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీని విడిచి వెళ్లిపోయారు. చిన్న పాయ కాస్తా ముందుకెళ్లిన కొద్దీ నదిగా మారుతున్న దృశ్యం గోచరమవుతోంది. బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్ (సోనేలాల్)కూ సెగ తగిలింది. ఈ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎస్పీ పంచన చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల వేళ కప్పదాట్లు సహజమే అయినా... నలుగురైదుగురు పోతే ఫర్వాలేదు. అలాకాకుండా కీలక ఓబీసీ నేతలు పక్కా ప్రణాళిక ప్రకారం బీజేపీని టార్గెట్ చేస్తూ... కాషాయదళంలో ఓబీసీలను, దళితులను చిన్నచూపు చూస్తున్నారనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ‘బౌన్సర్లు’ వేస్తున్నారు. ఆల్‌రౌండర్ ఆదిత్యనాథ్ యోగి (రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల యూపీ సీఎంను క్రికెట్ పరిభాషలో ఆల్‌రౌండర్‌గా అభివర్ణించారు), జట్టు కెప్టెన్ జేపీ నడ్డా (బీజేపీ అధ్యక్షుడు), కోచ్... అమిత్ షా (ప్రధాన వ్యూహకర్త)లకూ అఖిలేశ్ టీమ్ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉంది. పసిగట్టలేకపోయారా? ఫర్వాలేదనుకున్నారా? ఎన్నికల వేళ ఏ పార్టీ అయినా, ప్రభుత్వమైనా అప్రమత్తంగా ఉంటుంది. అసంతృప్తులు, అనుమానం ఉన్నవారి కదలికలపై నిఘా ఉంటుంది. వారేం చేస్తున్నారు... ఎవరిని కలుస్తున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచుతాయి. అలాంటిది కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉండి, ఐబీ, రాష్ట్ర నిఘా విభాగాలు రాబోయే ఈ వలసల ఉద్యమాన్ని ఎందుకు పసిగట్టలేకపోయాయి. ఒకవేళ కొంత సమాచారం ఉన్నా ఆ పోతే ఒకరిద్దరు పోతారు, దాంతో మనకొచ్చే నష్టమేముందని బీజేపీ అగ్రనేతలు తేలిగ్గా తీసుకున్నారా? ఈ స్థాయి ప్రణాళికాబద్ధమైన దాడిని ఊహించలేకపోయారా?. ఇప్పుడు నష్టనివారణకు దిగి ఎస్పీ, కాంగ్రెస్‌ల నుంచి ఇద్దరిని చేర్చుకున్నా జరిగిన డ్యామేజీని ఇలాంటివి పూడుస్తాయా? కసికొద్దీ ఇంకా కొంతమందిని లాగినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. చెప్పి... మరీ! ఈనెల 11న మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేయగానే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్‌పవార్ మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు, ఇంకొందరు నేతలు ఎస్పీలోకి వస్తారని ప్రకటించారు. జనవరి 20వ తేదీదాకా బీజేపీలో రోజుకు ఒకటి రెండు వికెట్లు పడుతూనే ఉంటాయని, 20న నాటికి బీజేపీని వీడిన మంత్రులు, ఎమ్మెలేల సంఖ్య 18కి చేరుతుందని ఎస్పీ మిత్రపక్షమైన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాశ్ రాజ్బర్ బుధవారం ప్రకటించారు. 20 దాకా రాజీనామాల పరంపర కొనసాగుతుందని, రోజుకొక మంత్రి, ఎమ్మెల్యే కాషాయపార్టీకి గుడ్‌బై చెబుతారని రాజీనామా చేస్తూ మంత్రి ధరమ్‌సింగ్ గురువారం చెప్పారు. భవిష్యత్తు చేరికలపై ఎస్పీ మాట్లాడకుండా... బయటి వారు మాట్లాడుతుండటం... ఇదంతా ఒక విస్తృత అవగాహనతో జరుగు తోందనేది దానికి అద్దం పడుతోంది. నిజానికి పార్టీ మారేటపుడు ఎవరూ అంత ఆషామాషీగా అడుగు వేయరు. భవిష్యత్తుకు సంబంధించిన స్పష్టమైన భరోసా, తాము కోరిన నియోజకవర్గాల్లో తమ వారికి టికెట్లు ఖరారు చేసుకున్నాకే... బయటపడతారు. రాజీనామా చేస్తారు. అంటే అఖిలేశ్ వీరిందరితో ఎంతోకాలంగా టచ్‌లో ఉన్నట్లే లెక్క. పైగా ఎవరెవరు వస్తే ప్రయోజనం, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వగలం... అనేది బాగా కసరత్తు చేశారు ఎస్పీ చీఫ్. అధికార, బీజేపీ వేగులకు ఉప్పందకుండా ఎంతో జాగ్రత్తగా ఈ డీల్‌ను పూర్తి చేయడం అఖిలేశ్ వయసుతో పాటే రాజకీయ వ్యూహాల్లో ఆరితేరారనే విషయాన్ని చాటిచెబుతోంది. ఇది ఒక ఎత్తైతే... తమ ప్రణాళికను అమలులో పెట్టిన తీరు బీజేపీ చాణక్యులనే నివ్వెరపరుస్తుండొచ్చు. అఖిలేశ్‌ను కలవడం... ఫొటోలు దిగడం, బయటకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు తాము బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం అంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిపోతోంది. వీరి రాజీనామా ప్రకటన వెలువడిందో లేదో నిమిషాల్లో అఖిలేశ్ ట్విట్టర్ హ్యాండిల్ వారు ఎస్పీ చీఫ్‌తో దిగిన ఫొటోలు ప్రత్యక్షమవుతున్నాయి. అంతా కట్టగట్టుకొని ఏ 20 మందో ఒకేసారి బీజేపీని వీడితే... అది ఒక్కరోజుకే టీవీ చానళ్లకు, పత్రికలకు వార్త అవుతుంది. మరుసటి రోజు ఫోకస్ వేరే అంశాలపైకి మళ్లుతుంది. అలాకాకుండా విడతల వారీగా వలసలు చోటుచేసుకుంటే రోజూ మీడియాలో సమాజ్‌వాదీ కవరేజీయే. పత్రికల్లో, టీవీల్లో రోజూ ఎస్పీలో చేరికలపై వార్తలు ఉంటే... ప్రజల్లోకి ఒకరకమైన సానుకూల సందేశం వెళుతుంది. బీజేపీ అధికార, అంగ, అర్థబలాన్ని ఎదుర్కొనగలమా అని లోలోపల సంశయంలో ఉన్న ఎస్పీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోతాయి. వారు ద్విగుణీకృత ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. ప్రజల్లోనూ ఎస్సీకే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే భావన వస్తే... తటస్థ ఓటర్లు కూడా కొంతమేరకు సైకిల్ వైపు మొగ్గే అవకాశాలుంటాయి. అన్నింటికంటే ముఖ్యమైన అంశం... తమకు ఎదురులేదనే భావనలో ఉన్న బీజేపీని ఈ అనూహ్య పరిణామాలు ఆత్మరక్షణలోకి నెట్టేస్తాయి. ఊగిసలాటలో ఉన్న నాయకులు ఎస్సీవైపు చూసేలా ఈ పరిణామాలు ప్రోత్సహిస్తాయి. ఎవరుంటారో... ఎవరు పోతారో తెలియని పరిస్థితుల్లో బీజేపీ సొంత నాయకులనే అనుమాన చూపులు చూసే పరిస్థితి. ఒక్కసారి గనక బీజేపీ అవకాశాలు సన్నగిల్లుతున్నాయనే అభిప్రాయం బలపడితే... మునిగే నౌకలో ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. కమలదళానికి సరైన ప్రత్యామ్నాయంగా ఉన్న ఎస్పీలోకి నాయకులు క్యూ కడతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే అఖిలేశ్ విడతల వారీగా బీజేపీని దెబ్బకొట్టే వ్యూహాన్ని ఎంచుకున్నారు. చక్కటి మైండ్‌గేమ్ ఆడుతున్నారు. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ తదుపరి ఎలాంటి పావులు కదుపుతుందో చూడాలి. – నేషనల్ డెస్క్, సాక్షి -
యూపీలో ‘పొత్తు’ పొడుపులు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ‘పొత్తు’ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ప్రధాన రాజకీయపక్షాలైన బీఎస్సీ, కాంగ్రెస్‌లతో పొత్తు ఉండదని, చిన్నపార్టీలతో జట్టుకడతామని ఇదివరకే ప్రకటించిన సమాజ్‌వాది పార్టీ అధ్యక్షడు అఖిలేష్ యాదవ్ ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే జయంత్ చౌదరి నేతృత్వంలో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ)తో ఒక అవగాహనకు వచ్చిన అఖిలేష్ గతంలో ఎన్డీయేతో ఉన్న సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఓం ప్రకాశ్ రాజ్‌భర్)నూ తమవైపునకు తిప్పేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా బుధవారం అఖిలేష్ లక్నోలో ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఎస్సీ– ఆప్ పొత్తుపై ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి ఉన్నప్పటికీ... భవిష్యత్తు పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయని చెప్పవచ్చు. ఆప్‌కు యూపీలో పెద్దగా బలం లేనప్పటికీ... కేజ్రీవాల్ అండ లభిస్తే నైతికంగా బలం చేకూరినట్లవుతుందనేది పరిశీలకుల అంచనా. మరోవైపు అఖిలేష్ యాదవ్ బుధవారం అప్నాదళ్ (కె) నాయకురాలు కృష్ణ పటేల్‌తో భేటీ అయ్యారు. పొత్తుకు సంబంధించి ఒప్పందం కుదిరిందని ఆమె తెలిపారు. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో పొత్తులో భాగంగా అప్నాదళ్ (కె) 20–25 సీట్లను ఆశిస్తోంది. కృష్ణ పటేల్ కూతురు అనుప్రియా పటేల్‌కు చెందిన అప్నాదళ్(ఎస్) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామి. ఆ పార్టీకి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, అనుప్రియతో కలిపి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. సామాజికంగా వెనుకబడిన వర్గమైన ‘కుర్మీ’లకు ప్రధానంగా అప్నాదళ్ ప్రాతినిధ్యం వహిస్తోంది. తల్లి కృష్ణ పటేల్‌తో పొత్తుపెట్టుకొని... ఆమెకు సముచిత గౌరవమిస్తే కుర్మీ ఓట్లలో చీలిక తేవొచ్చనేది అఖిలేష్ ఎత్తుగడ. యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరి– మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
యోగి ప్రోగ్రామ్‌కు అనుప్రియ డుమ్మా
గోరఖ్‌పూర్: కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ బీజేపీ నేతలకు షాకిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా జిల్లాలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్న కార్యక్రమానికి ఆమె గైర్హాజరయ్యారు. మిత్రపక్షాలను బీజేపీ పట్టించుకోవడం లేదని అనుప్రియ భర్త, అప్నాదళ్ చీఫ్ ఆశిష్ పటేల్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ ఆరోపించిన నేపథ్యంలో అనుప్రియ గైర్హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయమై అప్నాదళ్ నేత అనురాగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుప్రియకు అధికారిక ఆహ్వానం పంపలేదని తెలిపారు. అందువల్లే దియోరియాలో వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి ఆమె రాలేదన్నారు. మరోవైపు ఈ విషయమై దియోరియా బీజేపీ మీడియా ఇన్చార్జ్ సత్యేంద్ర మణి స్పందిస్తూ.. మంత్రి అనుప్రియ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంతో పాటు సిద్ధార్థ్ నగర్లో జరిగిన మరో కార్యక్రమానికి హాజరుకాలేదని వెల్లడించారు. అయితే ఇందుకు కారణం ఏంటో తనకు తెలియదన్నారు. -
తల్లి తరిమేస్తే.. కేంద్రమంత్రి అయ్యారు!
అనుప్రియా పటేల్.. ఈ పేరు కేంద్ర మంత్రివర్గంలో కొత్తగా వినిపించినా, చాలా ప్రముఖంగానే వినిపించింది. నరేంద్రమోదీ కొత్తగా తీసుకున్న 19 మందిలో ఈమె ఒకరు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ 35 ఏళ్ల ఎంపీ.. మంత్రివర్గంలో అతి పిన్న వయస్కురాలు. అయితే.. ఆమె మంత్రి అయినందుకు అనుప్రియ తల్లి మాత్రం అస్సలు సంతోషించడం లేదట. యూపీలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న అప్నాదళ్ అధ్యక్షురాలు కృష్ణా పటేల్ కూతురే అనుప్రియా పటేల్. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న పేరుతో గత సంవత్సరమే తన కూతురిని కృష్ణాపటేల్ ఆరేళ్ల పాటు పార్టీనుంచి బహిష్కరించారు. వాస్తవానికి 2009లో అప్నాదళ్ వ్యవస్థాపకుడు, అనుప్రియ తండ్రి సోనేలాల్ మరణించినప్పటి నుంచి పార్టీ అధ్యక్ష పదవి కోసం తల్లీ కూతుళ్ల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. వచ్చే సంవత్సరం యూపీలో ఎన్నికలు జరగనుండటంతో అనుప్రియను తీసుకోవడం మంచిదని బీజేపీ భావించినట్లు తెలుస్తోంది. ఆమె కుర్మి కులానికి చెందినవారు కావడం.. ఆ కులం యూపీలో రాజకీయంగా పట్టున్న బీసీ కులం కావడం కూడా కలిసొచ్చే అంశాలని భావిస్తున్నారు. కుర్మి కులానికే చెందిన బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు చెక్ పెట్టడానికి ఈమె ఉపయోగపడతారని అనుకుంటున్నారు. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక లేడీ శ్రీరామ్ కాలేజి నుంచి సైకాలజీలో డిగ్రీతో పాటు ఎంబీఏ కూడా చేసిన అనుప్రియా పటేల్ మంచి వక్తగా పేరొందారు. 2012 యూపీ ఎన్నికల్లోనే తొలిసారిగా ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. రెండేళ్ల తర్వాత లోక్‌సభకు ఎన్నికయ్యారు. పార్లమెంటులో కూడా ఆమె తన ప్రశ్నలతో, వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకున్నారు. అప్నాదళ్ పార్టీకి లోక్‌సభలో ఇద్దరే ఎంపీలున్నారు. ఒకరు అనుప్రియ కాగా, మరొకరు హరివంశ్ సింగ్. ఆయన పటేల్ తల్లికి అనుచరుడు. తన కూతురిని మంత్రిగా చేస్తే బీజేపీతో తెగతెంపులు చేసుకుంటామని కూడా ఇటీవలే కృష్ణాపటేల్ బెదిరించినట్లు తెలిసింది.