నిద్రలేమిని గుర్తించే ఆప్నియా యాప్
వాషింగ్టన్: నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో నిద్రలేమి పెద్దసమస్యగా మారింది. దీని వల్ల మనిషి దేహంలో అధిక రక్తపోటు, గుండెపోటు, హృద్రోగసమస్యలు, మధుమేహం, మానసిక ఒత్తిడి తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ప్రతి 13 మందిలో ఒకరు నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ‘ఆప్నియా యాప్’ ను యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇటీవల దీని పనితీరుపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ యాప్ 98 శాతం మెరుగైన ఫలితాలు చూపించిందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ’నథానియల్ ఎఫ్. వాట్సన్’ తెలిపారు.
ఆసుపత్రుల్లో నిద్రను అధ్యయనం చేసేందుకు వినియోగించే ‘పాలిసొమ్నోగ్రఫీ’ కన్నా మెరుగైన పనితీరును కనబరించిందని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్, హెచ్‌టీసీ ఫోన్లలో ఇది పని చేస్తుంది. ఇందుకోసం మనిషి శరీరానికి ఎలాంటి సెన్సార్లు అతికించాల్సిన అవసరం లేదు. ఫోన్లో ఉండే రెండు మైక్రోఫోన్ల ద్వారా వెలువడే తరంగాలు మనిషి శ్వాసను ఎప్పటికప్పుడు పసిగడతాయి. వ్యక్తి నిద్రించే సమయంలో సెల్‌ఫోన్ పక్కనే ఉండాల్సిన పని లేదు. గదిలో మనిషికి మూడు అడుగుల దూరంలో ఉన్నా ఇది పనిచేస్తుంటుంది. మనం దీర్ఘనిద్ర, కలత నిద్ర, గురక తదితర కారణాల వల్ల శ్వాస తీసుకునే విధానంలో తేడా ఉంటుంది. ఆ సమయంలో శ్వాస ఆధారంగా మనం ఎలా నిద్రపోతున్నామో ఇది చెప్పేస్తుంది. దీంతో నిద్రలేమి సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్స చేయించుకుంటే పలు అనారోగ్య సమస్యలను అధిగమించిన వారిమవుతాం. ఈ యాప్ ఇప్పటికిప్పుడు అందుబాటులో లేదు. మరో రెండు సంవత్సరాల్లోగా విడుదల చేయవచ్చని సమాచారం.