APNRTS
-
AP: విదేశాల్లో చదువుతున్నారా? ఉచిత బీమా పథకాన్ని సద్వినియోగించుకోండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ (APNRTS) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకత్వంలో, ఏపీఎన్ఆర్టీఎస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులకు అనేక సేవలను అందిస్తోంది. ఇందులో ఒకటి ముఖ్యమైన ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం. విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న ఏపీ విద్యార్థులు, విదేశాల్లో పనిచేసే వారు ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమాలో నమోదు చేసుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పూర్తీగా ఉచితంగా బీమాలో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశం 15 జనవరి 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జనవరి 15 తర్వాత బీమా ప్రీమియం పెరిగి, ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉన్నందున వెంటనే నమోదు చేసుకోగలరు. (ఇంతకుముందు సంవత్సరానికి రూ.180 ల ప్రీమియంగా ఉండేది). లక్షలు ఖర్చుపెట్టి తల్లిదండ్రులు వారి పిల్లలను విదేశీ విద్యకు పంపుతున్నారు. అలా వెళ్ళిన ఎంతో మంది విద్యార్థులకు మరియు వారి కుటుంబానికి ఈ పథకం ఒక భరోసా. ఈ మధ్యకాలంలో మనం పత్రికల్లో, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాము... విద్యార్థులు సరదాగా బయటకు వెళ్లినప్పుడు, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ప్రమాదాలకు గురవ్వడం అత్యంత బాధాకరం. ఈ బీమా లో నమోదు చేసుకోవడం వలన హఠాత్తుగా అనుకోని పరిణామాలు జరిగినప్పుడు వారి కుటుంబానికి ఇది ఆర్థికంగా ఆసరాగా ఉంటుంది. విద్యార్థులు, లేదంటే వారి తరఫున వారి పేరు మీద తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా ప్రవాసాంధ్ర భరోసా బీమా లో ఉచితంగా నమోదు చేసుకోమని ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి కోరారు. ఈ పథకం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ బీమా వలన ముఖ్య ప్రయోజనాలు ► బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వలన మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ► ప్రమాదం వలన సంభవించే గాయాలు, అనారోగ్యం చికిత్సకు అయ్యే హాస్పిటల్ ఖర్చులకు రూ. 1లక్ష వరకు చెల్లింపు ► ప్రమాదం/అస్వస్థతకు గురై చదువు కొనసాగించడానికి అనర్హుడిగా గుర్తించినట్లైతే, స్వదేశం వచ్చేందుకు సాధారణ తరగతి విమాన ఛార్జీల చెల్లింపు ... ఇవే కాకుండా మరెన్నో ప్రయోజనాలు ప్రవాసాంధ్ర భరోసా బీమా నందు నమోదు కొరకు APNRTS 24/7 హెల్ప్‌లైన్ +91-863-2340678; +91 85000 27678 (వాట్సప్) ను సంప్రదించండి మరియు వెబ్ సైట్-బీమా పేజి https://www.apnrts.ap.gov.in/index.php/home/insurance_new లో లాగిన్ అవ్వండి. లేదా insurance@apnrts.com; helpline@apnrts.com కు ఇమెయిల్ చేయండి. ఏపీఎన్ఆర్టీఎస్ అందించే వివిధ సేవలు, అప్డేట్స్ కొరకు https://www.apnrts.ap.gov.in/ ని సందర్శించండి. -
అమెరికాలో ఏలూరు వాసి మృతి.. స్వదేశం రప్పించేందుకు సన్నాహాలు
అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో మరణించిన ఏలూరు జిల్లాకు చెందిన 'వీర సాయేష్' అకాల మరణంపై APNRTS సోషల్ మీడియా ద్వారా సాయేష్ కుటుంబ సభ్యుల వివరాలను కనుగొంది. వారు అందించిన ఫోన్ నంబర్లకు APNRTS 24/7 హెల్ప్ లైన్ టీమ్ ఫోన్ చేసి సంబంధిత వివరాలన్నింటినీ సేకరించింది. అమెరికా నుంచి సాయేష్ భౌతిక కాయాన్నిరాష్ట్రప్రభుత్వం ద్వారా స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తెలిపారు. అయితే, సాయేష్ కుటుంబ సభ్యులు.. మృతదేహాన్ని భారతదేశం తీసుకురావడానికి తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ద్వారా సహాయం అందుతోందని తెలియజేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం కావాలంటే APNRTS ద్వారా తీసుకుంటామన్నారు. APNRTS బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. గమ్యస్థాన విమానాశ్రయం నుండి సాయేష్ పార్థివదేహాన్ని వారి కుటుంబానికి చేర్చడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. సాయేష్ భౌతికకాయం ఒహియో రాష్ట్రంలో స్థానిక లాంఛనాలు పూర్తయిన తర్వాత రెండు రోజుల్లో స్వదేశం చేరుకునే అవకాశం ఉంది మేడపాటి పేర్కొన్నారు. -
పరీక్షల భయం ఉండదిక..
సాక్షి, అమరావతి: పరీక్షల భయంతో కలిగే మానసిక ఒత్తిడిని విద్యార్థులు అధిగమించేలా చేయడంపై ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) దృష్టి సారించింది. ఇందుకోసం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌తో కలిసి ప్రవాస వైద్యులు, నిపుణులతో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని లెక్చరర్లకు ‘లైఫ్ స్కిల్స్–స్ట్రెస్ మేనేజ్మెంట్’ పేరిట శిక్షణ ఇస్తోంది. ఆ అధ్యాపకులు తమ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తారు. ఇంటర్మీడియెట్ పరీక్షల సమయంలో విద్యార్థులు అధిక ఒత్తిడికి గురవుతున్నారని, దానిని ఎలా అధిగమించవచ్చనే విషయాన్ని వివరించేందుకు వర్చువల్‌గా ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి కాలేజీ నుంచి ఇద్దరు చొప్పున 10,200 మంది (ప్రభుత్వ కాలేజీల నుంచి 3,400 మంది, ప్రైవేట్ కాలేజీల నుంచి 6,800 మంది) లెక్చరర్లను ఎంపిక చేశామని పేర్కొన్నారు. విద్యార్థులను మానసిక ఒత్తిడి నుంచి దూరం చేయడానికి అవలంబించాల్సిన విధానాలపై వారికి శిక్షణ ఇస్తున్నామని వివరించారు. ఇప్పటికే 50 శాతం కళాశాలల్లో శిక్షణ పూర్తయిందని, ఈ నెల 22 వరకు కొనసాగుతుందని తెలిపారు. శిక్షణ పూర్తయిన లెక్చరర్లు తమ కాలేజీల్లోని విద్యార్థులకు ఒత్తిడి అధిగమించడంపై కౌన్సెలింగ్ ఇస్తారని పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో అమెరికాలోని అల్బమాకు చెందిన సర్టిఫైడ్ చైల్డ్ అండ్ అడాలెసెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ అపర్ణ ఉప్పల, ఎస్పీఐఎఫ్ వ్యవస్థాపకుడు నెల్సన్ వినోద్ మోజెస్ (మెంటల్ హెల్త్ జర్నలిస్ట్ విభాగంలో అవార్డ్ గ్రహీత)తోపాటు ప్రముఖ యాంకర్, సినీనటి ఝాన్సీ తదితరులు పాల్గొంటున్నారని తెలిపారు. -
దుబాయ్‌లో శ్రీకాకుళం మహిళకు భర్త వేధింపులు
సాక్షి, అమరావతి: దుబాయ్‌లో భర్త వేధింపులకు గురవుతున్న శ్రీకాకుళానికి చెందిన మహిళతోపాటు ఆమె తల్లిదండ్రులను ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) సురక్షితంగా భారతదేశానికి చేర్చింది. శ్రీకాకుళానికి చెందిన కావ్య, తన భర్త అవినాష్, రెండేళ్ల కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి దుబాయ్‌లో ఉంటున్నారు. ఇటీవల భర్త అవినాష్ అదనపు కట్నం కోసం తనతోపాటు కుమార్తెను, తల్లిదండ్రులను సైతం వేధిస్తున్నాడని కావ్య ఇటీవల వీడియో ద్వారా తెలియజేసింది. తాము భారత్ రాకుండా అడ్డుకునేందుకు అవినాష్ అక్కడి కోర్టును ఆశ్రయించి తన రెండేళ్ల కుమార్తె ప్రయాణంపై నిషేధం విధించేలా చేశాడని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డ్టాకర్ సీదిరి అప్పలరాజు తమ దృష్టికి తీసుకువచ్చారని ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి తెలిపారు. తాము వెంటనే వివరాలు సేకరించి కావ్య తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో ఇండియాకు తిరిగి వెళ్లే విధంగా ఎంబసీ అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నామని పేర్కొన్నారు. త్వరలోనే కావ్య కుమార్తెను కూడా స్వదేశానికి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. స్వదేశానికి చేరుకున్న తర్వాత కావ్య సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తాము క్షేమంగా భారత్‌కు చేరుకునేందుకు ఏపీఎన్ఆర్టీఎస్ చేసిన సాయం మరువలేనిదని, తన పాపను కూడా తీసుకొచ్చే విధంగా చూడాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
యూకే, యూరప్ దేశాలలో ముగిసిన దేవదేవుడి కల్యాణోత్సవాలు
తాడేపల్లి: యూకే , యూరోప్ లలోని వివిధ దేశాలలో ఘనంగా జరిగిన శ్రీ మలయప్ప స్వామి వారి కల్యాణోత్సవాలపై ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి పత్రికా ప్రకటన విడుదల చేసారు. యూకే , యూరప్ దేశాలలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో అక్టోబర్ 15 నుండి నవంబర్ 13వ తేదీ వరకు పదకొండు (11) నగరాల్లో జరిగిన శ్రీనివాస కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిసాయి. వైఖానస ఆగమం ప్రకారం తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేద పండితులు ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అన్ని నగరాల్లో శ్రీవారి కళ్యాణోత్సవానికి అశేసంఖ్యలో భక్తులు హాజరయ్యి స్వామి వారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి భక్తి పులకితులయ్యారు. ఈ కల్యాణోత్సవాలకు ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయ సహకారం అందించింది. తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమన్వయ సూచనలతో బేసింగ్ స్టోక్-ఇంగ్లాండ్ లో బేసింగ్ స్టోక్ తెలుగు సంఘం, మాంచెస్టర్ - ఇంగ్లాండ్ లో శ్రీ వైకుంఠమ్, బెల్ఫాస్ట్ -నార్త్ ఐర్లాండ్ లో నార్త్ ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్, డబ్లిన్ - ఐర్లాండ్, ఇండో-ఐరిష్ తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్, జురిక్-స్విట్జర్లాండ్ లో స్విస్ వేదిక్ భక్తీ ఫౌండేషన్, ఐండ్ హోవెన్ - నెదర్లాండ్స్ లో SVK, నవంబర్ ౩వ తేదీన జర్మనీ లోని మునిక్, 5వ తేదీన ఫ్రాంక్ఫర్ట్, 6వ తేదీన ఫ్రాన్స్ లోని పారిస్, 12వ తేదీన ఇంగ్లాండ్ లోని లండన్, 13 వ తేదీన స్కాట్లాండ్ లోని ఎడిన్ బర్గ్ నగరాలలో తెలుగు, భారతీయ సంస్థల సహకారంతో శ్రీ మలయప్ప స్వామివారి కళ్యాణం కన్నులపండుగగా నిర్వహించడం జరిగింది. ఈ 11 నగరాలలో శ్రీవారి కళ్యాణం నిర్వహించడానికి దాదాపు 15వేల కిలోమీటర్లకు పైగా బస్సు ప్రయాణం చేసిన తితిదే అర్చకులు, వేదపండితులు ప్రతి కల్యాణాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఐండ్ హోవెన్ లో జరిగిన శ్రీవారి కళ్యాణానికి ది హేగ్, నెదర్లాండ్స్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం అంబాసిడర్ శ్రీమతి రీనత్ సంధు, సత్య పినిశెట్టి, సెక్రటరీ (ఎకనామిక్స్ అండ్ కామర్స్) బెల్జియం భారత రాయబార కార్యాలయ అధికారులు హాజరయ్యారు. అలాగే ఫ్రాంక్ఫర్ట్ లో జరిగిన శ్రీవారి కళ్యాణంలో జర్మనీలో భారత రాయబార కార్యాలయం అంబాసిడర్ పర్వతనేని హరీష్ దంపతులు, స్థానిక మేయర్ పాల్గొన్నారు. ఇక పారిస్ లో జరిగిన కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో తమిళ, పాండిచ్చేరి భక్తులు హాజరయ్యారు. 11 నగరాలలోని కల్యాణోత్సవాల్లో తెలుగు, భారతీయ భక్తులతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న వారుకూడా అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణ ఘట్టాన్ని వీక్షించి ఆశీర్వాదాలు అందుకున్నారు. 11 నగరాలలోని కల్యాణోత్సవాల్లో ఆయా నగరాల్లోని తెలుగు, భారతీయ, ధార్మిక సేవా సంస్థలు భక్తులకు ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేసారు. ప్రతి ఏటా ప్రపంచంలోని వివిధ దేశాలలో శ్రీ మలయప్పస్వామి వారి కల్యాణం నిర్వహించాలని భక్తులు, తెలుగు, భారతీయ సంస్థలు ముందుకొస్తే ఆయా దేశాలలో శ్రీవారి కల్యాణం నిర్వహించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని మేడపాటి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తితిదే సిద్ధంగా ఉన్నాయని, దీనికి ఏపీఎన్ఆర్టీఎస్ తమ వంతు సహకారం అందిస్తుందని తెలిపారు.