సాక్షి, అమరావతి: పరీక్షల భయంతో కలిగే మానసిక ఒత్తిడిని విద్యార్థులు అధిగమించేలా చేయడంపై ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్టీఎస్) దృష్టి సారించింది. ఇందుకోసం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌తో కలిసి ప్రవాస వైద్యులు, నిపుణులతో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని లెక్చరర్లకు ‘లైఫ్ స్కిల్స్–స్ట్రెస్ మేనేజ్‌మెంట్’ పేరిట శిక్షణ ఇస్తోంది.
ఆ అధ్యాపకులు తమ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తారు. ఇంటర్మీడియెట్ పరీక్షల సమయంలో విద్యార్థులు అధిక ఒత్తిడికి గురవుతున్నారని, దానిని ఎలా అధిగమించవచ్చనే విషయాన్ని వివరించేందుకు వర్చువల్గా ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఏపీఎన్‌ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రతి కాలేజీ నుంచి ఇద్దరు చొప్పున 10,200 మంది (ప్రభుత్వ కాలేజీల నుంచి 3,400 మంది, ప్రైవేట్ కాలేజీల నుంచి 6,800 మంది) లెక్చరర్లను ఎంపిక చేశామని పేర్కొన్నారు. విద్యార్థులను మానసిక ఒత్తిడి నుంచి దూరం చేయడానికి అవలంబించాల్సిన విధానాలపై వారికి శిక్షణ ఇస్తున్నామని వివరించారు.
ఇప్పటికే 50 శాతం కళాశాలల్లో శిక్షణ పూర్తయిందని, ఈ నెల 22 వరకు కొనసాగుతుందని తెలిపారు. శిక్షణ పూర్తయిన లెక్చరర్లు తమ కాలేజీల్లోని విద్యార్థులకు ఒత్తిడి అధిగమించడంపై కౌన్సెలింగ్ ఇస్తారని పేర్కొన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో అమెరికాలోని అల్బమాకు చెందిన సర్టిఫైడ్ చైల్డ్ అండ్ అడాలెసెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ అపర్ణ ఉప్పల, ఎస్‌పీఐఎఫ్ వ్యవస్థాపకుడు నెల్సన్ వినోద్ మోజెస్ (మెంటల్ హెల్త్ జర్నలిస్ట్ విభాగంలో అవార్డ్ గ్రహీత)తోపాటు ప్రముఖ యాంకర్, సినీనటి ఝాన్సీ తదితరులు పాల్గొంటున్నారని తెలిపారు.
పరీక్షల భయం ఉండదిక..
Published Fri, Feb 17 2023 6:01 AM | Last Updated on Fri, Feb 17 2023 2:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment