బాలాజీ సన్నిధిలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల
అప్పనపల్లి(మామిడికుదురు) :
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు’, ‘బ్రహ్మోత్సవం, ముకుంద వంటి విభిన్న చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆదివారం అప్పనపల్లి శ్రీబాల బాలాజీస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులతో పాటు అభిమానులు సాదరంగా స్వాగతం పలికారు. ఉభయ దేవేరులతో కొలువు తీరిన స్వామి వారిని దర్శించుకున్న శ్రీకాంత్ స్వామి వారి పాత గుడికి కూడా వెళ్లారు. ఆయనకు ధర్మకర్తలు బోనం బాబు, సుందరనీడి వీరబాబు స్వామి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంత వరకు నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించానని, ఏటా సంక్రాంతి పండుగకు ఈ ప్రాంతానికి రావడం తనకు అలవాటని చెప్పారు. కనుమ రోజున జరిగే ప్రభల తీర్థం వీక్షించడం చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. సంక్రాంతి పండుగ తరువాత కొత్త చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకు రావడం తనకు సెంటిమెంట్‌గా వస్తోందన్నారు. అదే సంప్రదాయంతో ఇక్కడికి వచ్చానన్నారు. ఆయన వెంట తులా ఆదినారాయణ, అడబాల తాతకాపు, నాగిరెడ్డి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.