ఫీజులుం
చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన శ్రీవల్లి, అనంతపురం నగరానికి చెందిన సుచరిత జిల్లాలో వేర్వేరు ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ చేశారు. 2013-14 విద్యా సంవత్సరమే కోర్సు పూర్తయింది. ఒక్కొక్కరు రూ. 35 వేలు దాకా ఫీజు పెండింగ్ ఉన్నారు. ఆ సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం రాలేదు. బీటెక్ పూర్తయిన ఆ ఇద్దరు అమ్మాయిలు సర్టిఫికెట్ల కోసం వెళ్తే బకాయి ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ యాజమాన్యం తెగేసి చెప్పింది. చివరకు అమ్మారుుల తల్లిదండ్రులతో బాకీ ఉన్నట్టు రాయించుకున్న తర్వాత సర్టిఫికెట్లు ఇచ్చారు. - ఇది కేవలం శ్రీవల్లి, సుచరిత మాత్రమే కాదు. జిల్లాలో వందలాది మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య.
- అనంతపురం ఎడ్యుకేషన్
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పు బకాయి విడుదలలో ప్రభుత్వం చేస్తున్న జాప్యం విద్యార్థులకు శాపంగా మారింది. కళాశాలల యాజమాన్యాల ఒత్తిడి విద్యార్థుల తల్లిదండ్రులను అప్పులపాలు చేస్తోంది. ఫలితంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత చదువుల ఆశయం నీరుగారుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల విడుదలలో ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం విద్యార్థుల తల్లిదండ్రులను అప్పులపాలు చేస్తోంది. అర్హులైన విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని ప్రభుత్వం విడుదల చేసిన జీఓలు 18, 66 స్పష్టం చేస్తున్నా... కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. యూనివర్సిటీ అభివృద్ధి, బిల్డింగ్, రాడిఫికేషన్ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి.
సర్టిఫికెట్లకు ఫీజుతో లంకె
వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఫీజులు బకాయిలు ఉన్న కారణంగా సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతున్నాయి. సర్టిఫికెట్లు ఇవ్వాలంటే బకాయి ఫీజు చెల్లించాలంటూ లంకె పెడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఫీజు మంజూరు కాగానే ‘మీ మొత్తం మీకు తిరిగి చెల్లిస్తామ’ంటూ యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. మరీ కాదుకూడదంటే తెల్లకాగితంపై బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు సంతకాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం సకాలంలో ఫీజు బకాయిలను విడుదల చేయకపోగా...ఈ విద్యా సంవత్సరం ఫీజుకు దరఖాస్తు చేసుకునే విషయంలో నిబంధనల మెలిక పెట్టింది. దీన్నిబట్టి చూస్తుంటే అనర్హుల జాబితా పెరిగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 25.91.కోట్లు పేరుకుపోయాయి. శాఖల వారిగా పరిశీలిస్తే... సాంఘిక సంక్షేమ శాఖ రూ. 4.77 కోట్లు, బీసీ సంక్షేమశాఖ రూ.7.71 కోట్లు, ఈబీసీ విద్యార్థులకు రూ. 8.68 కోట్లు, మైనార్టీ విద్యార్థులకు రూ. 4.75 కోట్లు బకాయిలు ఉన్నాయి.
వేతనాలివ్వలేకపోతున్నామంటున్న యాజమాన్యాలు మరోవైపు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కనీసం సిబ్బందికి వేతనాలు ఇవ్వలేకున్నామని కొందరు వాపోతున్నారు. ఆర్నెళ్లుగా అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేదని ఓ కళాశాల అధినేత ‘సాక్షి’తో వాపోయారు. ‘కోర్సు అయిపోయిన విద్యార్థులు వెళ్లిపోతున్నారు...ప్రభుత్వం నుంచి ఫీజు ఎప్పుడొస్తుందో తెలీదు. ఈ కారణంగానే విద్యార్థులతో కట్టంచుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి మంజూరుకాగానే వారిసొమ్ము వారికి వెనక్కు చెల్లిస్తాం’ అని చెప్పారు. ఏది ఏమైనా ప్రభుత్వం సరిగా స్పందిస్తే ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమవుతుందని కళాశాలల యూజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.