సాక్షి, హైదరాబాద్: బంగారుతునక లాంటి ధనిక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పులపాలు చేశారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అప్పు పుట్టనిదే, ఉన్న ప్రభుత్వ భూములు అమ్మనిదే రాష్ట్రం ముందుకుపోలేని దీనస్థితికి తెచ్చారని ఆమె సోమవారం ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఇంతకాలం దోచుకుతిన్నది చాలక ఎన్నికలకు మూడు నెలల ముందు పథకాలకు అప్పులు కావాలని కేంద్రం వద్ద కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని విమర్శించారు.
మరో లక్ష కోట్ల అప్పులకు తంటాలు పడే కేసీఆర్.. తెచ్చిన రూ.5 లక్షల కోట్ల అప్పుతో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. రూ.21 వేల కోట్ల రుణమాఫీ, రూ.20 వేల కోట్ల ఉచిత ఎరువులు, దళితులకు 3 ఎకరాల భూమి, రూ.5 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, 50 లక్షల మందికి నిరుద్యోగభృతి వంటి హామీల అమలు సంగతి ఏమైందని ప్రశ్నించారు. ఇవేవీ చేయకపోగా ప్రజల నెత్తిపై రూ.2 లక్షల చొప్పున అప్పు పెట్టారని విమర్శించారు. కేసీఆర్ పాలనకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని షర్మిల ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment