‘ప్రైమ్‌డే’లో 2,400 ఉత్పత్తుల ఆవిష్కరణ
న్యూఢిల్లీ: ఈ ఏడాది జులై 26–27 తేదీల్లో నిర్వహించే ’ప్రైమ్ డే’లో 100 పైచిలుకు చిన్న, మధ్య తరహా సంస్థలు 2,400 పైచిలుకు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డైరెక్టర్ ప్రణవ్ భాసిన్ తెలిపారు. ఈ సంస్థల్లో స్టార్టప్‌లు, మహిళా ఎంటర్ప్రెన్యూర్లు, చేనేత కళాకారులు మొదలైన వారు ఉంటారని పేర్కొన్నారు. ఇల్లు..వంటగదికి అవసరమైన ఉత్పత్తులు మొదలుకుని ఫ్యాషన్, ఆభరణాలు, స్టేషనరీ, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులు ఉంటాయని భాసిన్ వివరించారు.
ప్రైమ్ డేలో 450 నగరాల నుంచి 75,000 పైచిలుకు ’లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్’ విక్రేతలు పాల్కొంటారని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం గతేడాది లాక్డౌన్లు విధించినప్పట్నుంచీ ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాల్లో తమ కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని భాసిన్ చెప్పారు. ప్రస్తుతం తమ కస్టమర్ ఆర్డర్లలో 65 శాతం, కొత్త కస్టమర్లలో 85 శాతం మంది వీరే ఉంటున్నారన్నారు. వర్క్–ఫ్రం–హోమ్, ఆన్లైన్ స్కూలింగ్‌కు సంబంధించిన ఉత్పత్తులతో పాటు వ్యక్తిగత సౌందర్య సాధనాలు, నిత్యావసరాలు మొదలైన వాటికి డిమాండ్ ఎక్కువగా ఉందని ఆయన వివరించారు.