APTF Leaders
-
నెల్లూరు కలెక్టరేట్ దగ్గర ఏపీటీఎఫ్ ధర్నా
-
పేద విద్యార్థులకు విద్యను దూరం చేయొద్దు
నిడదవోలు: పేద, బడుగు, బలహీన వర్గాల బాల బాలికలకు విద్యను దూరం చేయరాదని, రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని ఏపీ టీచర్స్ ఫెడరేషన్, (ఏపీటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి ఐ.రాజగోపాల్ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్టీఆర్ మునిసిపల్ హైస్కూల్లో సోమవారం జరిగిన నిడదవోలు జోనల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. విద్యార్ధులు తక్కువగా ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా 5,916 ప్రాథమిక పాఠశాలలు, 5,475 ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రభుత్వం మూసివేయడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. గతేడాది 1,500 ప్రాథమిక పాఠశాలలను మూసివేశారన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని సూచిస్తుందన్నారు. ప్రస్తుతం భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టులు 19,480 ఉన్నాయని తెలిపారు. జిల్లా ప్రధానకార్యదర్శి బీఏ సాల్మన్‌రాజు మాట్లాడుతూ మునిసిపల్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్‌ను రూపొందించాలని, జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.రవికుమార్, కారింకి శ్రీనివాస్, పీవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
పాఠశాలలు మూసివేస్తే ప్రజా ఉద్యమమే..
విజయనగరం: ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తే ప్రజా ఉద్యమం తప్పదని ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ హెచ్చరించింది. సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ సంయుక్త నిర్వహణలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో సభ్యులు మాట్లాడుతూ, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో పాఠశాలలను మూసివేయడం తగదన్నారు. అరకొరగా పాఠ్యపుస్తకాలు సరఫరా చేయడం, పౌష్టికాహారం పంపిణీలో అవకతవకలు వంటి కారణాలు చూస్తే ప్రభుత్వం కావాలనే పాఠశాల విద్యను నాశనం చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. గ్రామ సభల ఆమోదం లేకుండా ఏ ఒక్క ఆవాస ప్రాంతంలో కూడా పాఠశాలలను తొలగించరాదన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డి.ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏపీ సేవ్ ఎడ్యుకేషన్ జిల్లా కన్వీనర్ జేసీ రాజు, కో-కన్వీనర్ కొల్లి సత్యం, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.ఈశ్వరరావు, అదనపు కార్యదర్శి సీహెచ్వీఎస్ఎన్ మూర్తి, సీహెచ్ వెంకటరమణ, కె.శ్రీనివాసరావు, ఆర్.చంద్రశేఖర్ నాయుడు, సూర్యారావు, చినసత్యం, అప్పారావు, నాగేశ్వరరావు, పైడితల్లి, తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ ముట్టడి వాయిదా
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: ఈనెల 23వ తేదీన జరగాల్సిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్.అచ్చుతరావు, కె.భానుమూర్తి, రాష్ట్ర కార్యదర్శి ఎస్.వి.అనిల్‌కుమార్, రాష్ట్ర కౌన్సిలర్ ఎం.తవుడు మంగళవారం సంయుక్తంగా ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కె.పార్థసారథితో జాక్టో నేతలు మంగళవారం జరిగిన చర్యల్లో సమస్యల పరిష్కారానికి సానుకూల స్పందన రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2,500 పండిత, 2500 పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయడానికి ఒప్పందం కుదిరిందని తెలిపారు. అదేవిధంగా 398 రూపాయిల వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయుల నోషనల్ ఇంక్రిమెంట్ల ఫైలు ముఖ్యమంత్రి పరిశీలన కోసం పంపడానికి ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయుల హాఫ్ పే లీవ్‌ను నగదుగా మార్చుకునే అవకాశాన్ని పునరుద్ధరిస్తూ 2, 3 రోజులలో ఉత్తర్వులు ఇవ్వడానికి అంగీకారం కుదిరిందని తెలిపారు. డీఈవోల పోస్టులను ఆ డివిజన్లో పనిచేస్తున్న సీనియర్ ప్రధానోపాధ్యాయులకి మాత్రమే ఇవ్వాలని, ఎంఈవో పోస్టులను ఆ మండలంలోని సీనియర్ స్కూల్ అసిస్టెంట్‌కు మాత్రమే బాధ్యతలు ఇవ్వడానికి విద్యామంత్రితో ఒప్పందం కుదిరినట్లు వారు వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన చర్చల్లో పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారి, స్కూల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ వి.మోహన్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.