Arabian Sea waters
-
తోకముడిచిన సోమాలియా పైరేట్లు
న్యూఢిల్లీ: భారతీయ సిబ్బందితో కూడిన లైబీరియా సరుకు నౌకను హైజాక్ చేసేందుకు సోమాలియా సముద్రపు దొంగలు చేసిన ప్రయత్నాన్ని భారత నేవీ కమాండోలు చాకచక్యంగా తిప్పికొట్టారు. అందులోని 15 మంది భారతీయ సిబ్బంది సహా మొత్తం 21 మందిని కాపాడారు. ఎంవీ లిలా నార్ఫోక్ అనే ఓడను ఈ నెల 4వ తేదీన అరేబియా సముద్ర జలాల్లో ఉండగా సాయుధ దుండగులు హస్తగతం చేసుకున్నారు. ఆపదలో ఉన్నామని, ఆదుకోవాలంటూ ఓడ సిబ్బంది యునైటెడ్ కింగ్డమ్ మారిటైం ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీవో)పోర్టల్‌కు సమాచారం అందించారు. అందులో 15 మంది వరకు భారతీయ సిబ్బంది ఉన్నట్లు తెలియడంతో భారత నేవీ అప్రమత్తమైంది. ఆ ప్రాంతానికి ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌకను హుటాహుటిన పంపించింది. పైరేట్లను లొంగిపోవాలని హెచ్చరికలు చేస్తూ ఎంవీ లిలా నార్ఫోక్ను శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఐఎన్ఎస్ చెన్నై అడ్డగించింది. సుశిక్షితులైన కమాండోలతో కూడిన అత్యాధునిక గస్తీ హెలికాప్టర్ పి–81ను సైతం అధికారులు సిద్ధంగా ఉంచారు. నౌకలోని పరిస్థితులను దగ్గర్నుంచి అంచనా వేసేందుకు అత్యాధునిక ఎంక్యూ9బీ ప్రిడేటర్ డ్రోన్‌ను రంగంలోకి దించారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పైఅధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ అందగానే కమాండోలు ఎంవీ లిలా నార్‌ఫోక్‌లోకి మెరుపు వేగంతో ప్రవేశించారు. వారిని చూసి పైరేట్లు తోకముడిచారు. గస్తీ సిబ్బంది ఇచ్చిన గట్టి హెచ్చరికలతోనే వారు భయపడి, నౌకను హైజాక్ చేసే ప్రయత్నాన్ని విరమించుకుని, పలాయన మంత్రం పఠించారని నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వాల్ చెప్పారు. నౌకలో విద్యుత్ వ్యవస్థను, చోదక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. అన్నీ పూర్తయ్యాక నౌక ప్రయాణాన్ని మళ్లీ కొనసాగించనుందన్నారు. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకల స్వేచ్ఛా యానానికి అనువైన వాతావరణం కల్పించేందుకు ఇతర దేశాల భాగస్వామ్యంతో పనిచేసేందుకు నేవీ కట్టుబడి ఉంటుందని వివరించారు. సముద్ర దొంగల బారి నుంచి తమ నౌకను రక్షించిన భారత నేవీకి లిలా గ్లోబల్ సీఈవో స్టీవ్ కుంజెర్ ధన్యవాదాలు తెలిపారు. ఇలా ఉండగా, ఇజ్రాయెల్–హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రభావం నౌకా రవాణాపైనా పడింది. 21 మంది భారతీయ సిబ్బందితో కూడిన లైబీరియాకు చెందిన ఎంవీ చెమ్ ప్లుటో నౌకపై డిసెంబర్ 23న భారత పశ్చిమ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. భారత్ వైపు చమురుతో వస్తున్న మరో నౌకపై ఎర్ర సముద్రంలో డ్రోన్ దాడి జరిగింది. మాల్టాకు చెందిన ఎంవీ రుయెన్ అనే నౌకను పైరేట్లు డిసెంబర్ 14న హైజాక్ చేశారు. -
పడవల వెనుక పాక్ సైన్యం
భారత్ వైపు వచ్చింది ఒకటి కాదు.. రెండు? పడవల నుంచి పాక్ సైన్యంతో సంభాషణలు సాగినట్టు వెల్లడి రేడియో సంభాషణలు రికార్డు గాంధీనగర్: ముంబై మారణహోమం తరహాలో దాడులకు తెగబడేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్ర వెనుక పాక్ సైన్యం హస్తం ఉన్నట్లు తేటతెల్లమైంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి అరేబియా సముద్ర జలాల మీదుగా భారత్‌లోకి చొచ్చుకు వచ్చేందుకు యత్నించిన రెండు మరపడవలు పాక్ సైన్యంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపినట్టు అధికారులు గుర్తించారు. ఈ సంభాషణలను జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(ఎన్టీఆర్ఓ) రికార్డు చేసింది. 26/11 తరహాలోనే పోర్బందర్లో నెత్తుటేర్లు పారించేందుకు ముష్కరులు కుట్ర పన్నినట్లు ఆ రేడియో సంభాషణలు స్పష్టం చేస్తున్నాయని అధికారులు తెలిపారు. అలాగే ఉగ్రవాదులు ఒక్క పడవలోనే వచ్చారా లేదా రెండో పడవ కూడా ఉందా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. సముద్ర జలాల్లో పేలిపోయిన పడవతోపాటు మరో పడవ ఉండొచ్చన్న వార్తలను అధికార వర్గాలు ధ్రువీకరించకపోయినా.. ఎన్టీఆర్ఓ రికార్డు చేసిన సంభాషణల ప్రకారం రెండో పడవ ఉన్నది నిజమేనని తెలుస్తోంది. ఈ రెండు పడవలు పాక్ తీరప్రాంత ఏజెన్సీతోపాటు ఆ దేశ సైన్యంతో తరచూ సంభాషణలు సాగించాయి. ఈ అనుమానిత పడవలు భారత జలాల్లోకి వస్తున్న విషయాన్ని ఎన్టీఆర్ఓ భారత తీరగస్తీ దళానికి చేరవేయడంతో... సిబ్బంది రంగంలోకి దిగారు. వాటిని వెంబడిస్తూ హెచ్చరికలు పంపారు. దీంతో ముష్కరులు ఒక పడవకు నిప్పుపెట్టారు. మొదటి పడవ తన పనిని పూర్తిచేసిందని, అందులోని సామగ్రిని తమకు అందించిందని రెండో పడవ నుంచి సంభాషణలు సాగాయని ఎన్టీఆర్వో గుర్తించింది. అయితే రంధ్రం పడడంతో రెండో పడవ వెనుదిరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దానికోసం తీరగస్తీ దళం ఇంకా గాలిస్తోంది. కొనసాగుతున్న గాలింపు.. మునిగిపోయిన పాక్ పడవ శకలాల కోసం తీరగస్తీ దళం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. అందులోని నలుగురు ముష్కరుల మృతదేహాల కోసం వెదుకుతోంది. శకలాలు, మృతదేహాలు దొరికితే పడవలు భారత్ వైపు ఎందుకు వచ్చిందో బయటపడుతుందని అధికారులు చెబుతున్నారు. భారత్ వైపు రెండు పడవలు వచ్చినట్టు వస్తున్న వార్తలపై కోస్ట్‌గార్డ్ కమాండర్ కుల్దీప్సింగ్ షెరాన్‌ను ప్రశ్నించగా.. ఇప్పటివరకైతే అలాంటి సమాచారం లేదన్నారు. ఆ పడవలపై ఉన్నవారు జాలర్ల మాదిరిగా లేరని, వారివద్ద వలలు కూడా లేవని వివరించారు. టీ షర్టులు, మోకాలి వరకు ప్యాంట్లు ధరించినట్లు తెలిపారు. వారు ఉగ్రవాదులేనా అని ప్రశ్నిచగా... దీనిపై ఇంకా దర్యాప్తు సాగుతోందన్నారు. ఈనెల 7-9 తేదీల్లో గుజరాత్లో ప్రవాసీ భారతీయ దివస్, 11-13 తేదీల మధ్య వైబ్రంట్ గుజరాత్ సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో తీరప్రాంతంపై నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.