పడవల వెనుక పాక్ సైన్యం
భారత్ వైపు వచ్చింది ఒకటి కాదు.. రెండు?
పడవల నుంచి పాక్ సైన్యంతో సంభాషణలు సాగినట్టు వెల్లడి
రేడియో సంభాషణలు రికార్డు
గాంధీనగర్: ముంబై మారణహోమం తరహాలో దాడులకు తెగబడేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్ర వెనుక పాక్ సైన్యం హస్తం ఉన్నట్లు తేటతెల్లమైంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి అరేబియా సముద్ర జలాల మీదుగా భారత్‌లోకి చొచ్చుకు వచ్చేందుకు యత్నించిన రెండు మరపడవలు పాక్ సైన్యంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపినట్టు అధికారులు గుర్తించారు. ఈ సంభాషణలను జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(ఎన్‌టీఆర్‌ఓ) రికార్డు చేసింది. 26/11 తరహాలోనే పోర్‌బందర్‌లో నెత్తుటేర్లు పారించేందుకు ముష్కరులు కుట్ర పన్నినట్లు ఆ రేడియో సంభాషణలు స్పష్టం చేస్తున్నాయని అధికారులు తెలిపారు. అలాగే ఉగ్రవాదులు ఒక్క పడవలోనే వచ్చారా లేదా రెండో పడవ కూడా ఉందా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. సముద్ర జలాల్లో పేలిపోయిన పడవతోపాటు మరో పడవ ఉండొచ్చన్న వార్తలను అధికార వర్గాలు ధ్రువీకరించకపోయినా.. ఎన్‌టీఆర్‌ఓ రికార్డు చేసిన సంభాషణల ప్రకారం రెండో పడవ ఉన్నది నిజమేనని తెలుస్తోంది. ఈ రెండు పడవలు పాక్ తీరప్రాంత ఏజెన్సీతోపాటు ఆ దేశ సైన్యంతో తరచూ సంభాషణలు సాగించాయి.
ఈ అనుమానిత పడవలు భారత జలాల్లోకి వస్తున్న విషయాన్ని ఎన్‌టీఆర్‌ఓ భారత తీరగస్తీ దళానికి చేరవేయడంతో... సిబ్బంది రంగంలోకి దిగారు. వాటిని వెంబడిస్తూ హెచ్చరికలు పంపారు. దీంతో ముష్కరులు ఒక పడవకు నిప్పుపెట్టారు. మొదటి పడవ తన పనిని పూర్తిచేసిందని, అందులోని సామగ్రిని తమకు అందించిందని రెండో పడవ నుంచి సంభాషణలు సాగాయని ఎన్‌టీఆర్‌వో గుర్తించింది. అయితే రంధ్రం పడడంతో రెండో పడవ వెనుదిరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దానికోసం తీరగస్తీ దళం ఇంకా గాలిస్తోంది.
కొనసాగుతున్న గాలింపు.. మునిగిపోయిన పాక్ పడవ శకలాల కోసం తీరగస్తీ దళం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. అందులోని నలుగురు ముష్కరుల మృతదేహాల కోసం వెదుకుతోంది. శకలాలు, మృతదేహాలు దొరికితే పడవలు భారత్ వైపు ఎందుకు వచ్చిందో బయటపడుతుందని అధికారులు చెబుతున్నారు. భారత్ వైపు రెండు పడవలు వచ్చినట్టు వస్తున్న వార్తలపై కోస్ట్‌గార్డ్ కమాండర్ కుల్‌దీప్‌సింగ్ షెరాన్‌ను ప్రశ్నించగా.. ఇప్పటివరకైతే అలాంటి సమాచారం లేదన్నారు. ఆ పడవలపై ఉన్నవారు జాలర్ల మాదిరిగా లేరని, వారివద్ద వలలు కూడా లేవని వివరించారు. టీ షర్టులు, మోకాలి వరకు ప్యాంట్లు ధరించినట్లు తెలిపారు. వారు ఉగ్రవాదులేనా అని ప్రశ్నిచగా... దీనిపై ఇంకా దర్యాప్తు సాగుతోందన్నారు. ఈనెల 7-9 తేదీల్లో గుజరాత్‌లో ప్రవాసీ భారతీయ దివస్, 11-13 తేదీల మధ్య వైబ్రంట్ గుజరాత్ సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో తీరప్రాంతంపై నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.