‘చందన’ సీమకు చీకటి దారులు
సందర్భం అరణ్యకాండ -1
రాయలసీమ నేలల్లో కాల్షియం కార్బొనేట్ ఎక్కువగా ఉండటం వల్ల అత్యుత్తమ శ్రేణి ఎర్రచందనం అక్కడే లభ్యమౌతోంది. అందుకే స్మగ్లర్లందరి కళ్లూ ఆ అరణ్యాలపైనే. ‘తమిళ కూలీ’లతో సీమ జైళ్లన్నీ నిండిపోతున్నా మన ‘బంగారం’ మటుమాయమైపోతూనే ఉంది.
ఒకటి కాదు, రెండు కాదు... ఎర్రచందనం స్మగ్లింగ్ దారులు ఎన్నని? రాస్తే రామాయణం, చెబితే భారతం. సూట్‌కేసులు, వ్యాన్లు, లారీలు, పెట్రోల్ ట్యాంకర్లు, ట్రాక్టర్లు, పాల వ్యాన్లు, అంబులెన్స్‌లు, పెళ్లి వాహనాలు.. ఏదైనా ఎర్రచందనాన్ని తరలించదగిందే. యూరియా మూటలు, పైపులు, మొక్కజొన్న బస్తాలు, పండ్ల పెట్టెలు, నిమ్మ అంట్లు, బొప్పాయి, చీనీ కాయలు, టెంకాయలు, మామిడి కాయలు, వరిపొట్టు, కరేపాకు, ఇనుప ఖనిజం, ఇసుక.... ఇలా ఎర్రచందనం ఎలా దొరకలేదు? ఎక్కడ పట్టుబడలేదు?
ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అంతరించిపో తున్న వృక్ష సంపదగా గుర్తింపును పొందిన ఎర్రచంద నం కడప, చిత్తూరు జిల్లాల అడవులంతటా ఉన్నాయి. కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దు అడవుల్లో ఐదు లక్షల హెక్టార్లలో కూడా అవి ఉన్నాయి. అటవీ శాఖ ఆ చెట్లను 10-20 ఏళ్లు, 20-30 ఏళ్లు, 30-40 ఏళ్లు వయసున్న మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తుంది. స్మగ్లర్ల దృష్టి ఎప్పుడూ 30-40 ఏళ్ల చెట్లపైనే. అటవీ శాఖ అధి కారులు శాటిలైట్ రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా పరిశీలించగా చిత్తూరు జిల్లాలోని చామల అటవీ రేంజ్ పరిధిలో ఎక్కువగా ఆ చెట్లను నరికేసినట్టు తెలిసింది. కడప జిల్లాలో 3,14,590 హెక్టార్లలో ఎర్రచందనం చెట్లున్నాయి. డివిజన్ల వారీగా కడప డివిజన్లో 1,28, 644 హెక్టార్లు, ప్రొద్దుటూరులో 1,01,142 హెక్టార్లు, రాజంపేట డివిజన్లో 84,803 హెక్టార్లలో విస్తరించి ఉంది. కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి 11 కిలో మీటర్ల దూరంలోని శేషాచలం కొండల్లోని శ్రీ వెంకటే శ్వర అభయారణ్యం ప్రధానమైనది. కుక్కలదొడ్డి నుంచి 10 కిలో మీటర్ల దూరంలోని తుంబుర తీర్థం ద్వారా అడవిలోకి దారులున్నాయి. రైల్వే కోడూరు రేంజిలో పోట్రాలగుండం, కేసరి బండలు, వాననీళ్ల గుట్ట, చిన్నక లుజులు, పల్లెగుండాలు, కాశికోన, గాదెల, బాటగుం డం, చాకలిరేవుకోన, వలసకోన, ముత్తరాచకోన, దొంగ బండల ప్రాంతాలున్నాయి. అలాగే బాలపల్లె రేంజి పరి ధిలో యర్రడ్లమడుగు, సిద్ధలేరు, కంగుమడుగు, దేశెట్టి గుడాలు, గుంజనేరు, యుద్ధరాల తీర్థం, విష్ణుగుండం, సందలేరు, తలకోన ప్రాంతాల్లో నీటి కుంటలు ఉండ టం వల్ల ఎర్రచందనం కూలీలకు ఈ ప్రాంతాలు ఆవా సాలుగా మారుతున్నాయి. బాలపల్లె, రైల్వేకోడూరు, చిట్వేలి, రాజంపేట, సానిపాయ రేంజ్‌లు రాజంపేట డివిజనల్ అటవీ అధికారి (డీఎఫ్ఓ) పరిధిలో ఉన్నాయి. బాలపల్లి రేంజ్లో 30-40 ఏళ్లకు పైబడిన ఎర్రచందనం వృక్షాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో స్మగ్లర్ల కన్ను ప్రస్తు తం దానిపైనే ప్రధానంగా ఉంది. అందుకే ఆ రేంజ్‌లోనే అక్రమంగా తరలిపోతున్న ఎర్రచందనం వాహనాలు ఎక్కువగా పట్టుబడుతున్నాయి. ప్రొద్దుటూరు డివిజన్ అటవీ ప్రాంతం 1,64,516 హెక్టార్లు. కాగా అందులో లంకమల అభయారణ్యం 20,050 హెక్టార్లలో, పెనుశిల నరసింహ అభయారణ్యం 7,844 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఆ రెండిట్లో కాక ఇంకా 68,440 హెక్టార్లలో 21,17,614 ఎర్రచందనం వృక్షాలున్నాయి.
కోడూరు రైల్వే స్టేషన్లో ప్రతిరోజూ తెల్లవారు జామున చెన్నై నుంచి వచ్చే రైల్లోంచి వందల్లో ‘తమిళ కూలీ’లు దిగుతుంటారు. తిండిగింజలు, సరుకులు, వం టపాత్రలు మోసుకుంటూ దిగినవారు దిగినట్టే వారు అడవుల్లోకి వెళ్లిపోవడం స్థానికులకు నిత్యం కనిపించే దృశ్యమే. 350 మంది వరకు ఎర్రచందనం కూలీలు రిమాండు ఖైదీలుగా ఉన్న కడప కేంద్ర కాగారారం కిక్కి రిసిపోయింది. వారిలో 90 శాతం మంది తమిళులే. గత ఏడాది జూలై 1న 356 మంది ‘ఎర్రచందనం కూలీ’ లను నిందితులుగా విచారించడానికి కోర్టులు సరిపోక తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మైదానంలో ‘బహిరంగ కోర్టు’ నిర్వహించాల్సి వచ్చింది. 2013 డిసెంబర్ 15న శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు ఇద్దరు అటవీ శాఖాధికారులను (డేవిడ్, శ్రీధర్) కిరాతకంగా హత్య చేసిన ఆ కేసు సంచలనం సృష్టించింది. కూలీలు, విద్యార్థులు, యువకులు, నిరక్షరాస్యులు, మైనర్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. రాయలసీమలోని జైళ్లన్నీ ‘తమిళ కూలీ’లతోనే నిండిపోతున్నాయి.
పొరుగు రాష్ట్రాల అడవుల్లో సాధారణంగా ఒక్కో బీటు పరిధి 5-10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం లోపే ఉంటుంది. కానీ కడప, ప్రొద్దుటూరు, రాజంపేట అటవీ డివిజన్ల పరిధిలోని 14 రేంజ్‌ల్లో ఒక్కో బీటు 25 నుంచి 75 చదరపు కిలోమీటర్ల పరిధికి విస్తరించి ఉంటోంది. ఒక అంచనా ప్రకారం శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విస్తీర్ణం అధికంగా ఉన్న ఎనిమిది అటవీ డివిజన్ల పరి ధిలో అటవీశాఖ పట్టుకోగలిగిన వి 50 వేల దుంగలు మా త్రమే. అంత మొత్తం సరిహద్దులు దాటిపోయాయి.
దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న ఎర్రచందనం దుం గలలో వేటిని ఏ రేంజిలో, ఏ సెక్షన్లో, ఏ బీటులో నరి కారో గుర్తించలేని స్థితి. అక్రమంగా రవాణా చేసే ఎర్ర చందనం ఎక్కడ దొరికినా వాటిని విక్రయించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్‌కే దక్కేలా కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ నుంచి ఒక హామీని మాత్రం మన అధికారులు పొందగలిగారు. రాయల సీమ నేలల్లో కాల్షియం కార్బొనేట్ ఎక్కువగా ఉండటం వల్లనే అత్యుత్తమ శ్రేణి ఎర్రచందనం ఇక్కడి అరణ్యాల్లో లభ్యమౌతోందని శాస్త్రవేత్తల అభిప్రాయం.
(వ్యాసకర్త రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్టు)
e-mail: gangadhar.vempalli@gmail.com