Aravinda de Silva
-
ICC Cricket World Cup: ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో సెహ్వాగ్, ఎడుల్జీ
దుబాయ్: భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కించుకున్నారు. ఈ ఇద్దరు భారత క్రికెటర్లతో పాటు శ్రీలంక దిగ్గజం అరవింద డిసిల్వాను కూడా తాజాగా ఐసీసీ ఈ విశిష్ట క్రికెటర్ల జాబితాలో చేర్చింది. భారత్ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇప్పటి వరకు తొమ్మిది మందికి చోటు లభించగా... ఎడుల్జీ ఈ జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ కావడం విశేషం. ఆయా జట్లకు అందించిన సేవలు, నడిపించిన తీరు, గెలిపించిన ఘనతలు అన్నీ పరిగణించే ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లోకి ఎంపిక చేస్తారు. డయానా ఎడుల్జీ: భారత్‌లో అమ్మాయిల క్రికెట్‌వైపు కన్నెత్తి చూడని రోజుల్లోనే క్రికెటరై తర్వాత సారథిగా ఎదిగింది. 1976 నుంచి 1993 వరకు భారత జట్టుకు ఆడి స్పిన్ ఆల్‌రౌండర్‌గా రాణించింది. 20 టెస్టులాడి 63 వికెట్లు తీసి, 404 పరుగులు చేసింది. 34 వన్డేల్లో 211 పరుగులు సాధించి 46 వికెట్లు పడగొట్టింది. సెహ్వాగ్: భారత టెస్టు క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా సెహ్వాగ్ రికార్డుల్లోకెక్కాడు. భారత్ 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. సెహ్వాగ్ 104 టెస్టులు ఆడి 8586 పరుగులు సాధించాడు. 23 సెంచరీలు చేశాడు. 40 వికెట్లు తీశాడు. 251 వన్డేలాడి 8273 పరుగులు, 15 సెంచరీలు సాధించాడు. 96 వికెట్లు కూడా తీశాడు. 19 టి20లు ఆడి 393 పరుగులు సాధించాడు. అరవింద డిసిల్వా: ఆ్రస్టేలియాతో జరిగిన 1996 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో డిసిల్వా వీరోచిత సెంచరీతో జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. 308 వన్డేల్లో 9284 పరుగులు చేశాడు. 106 వికెట్లు పడగొట్టాడు. 93 టెస్టుల్లో 6361 పరుగులు సాధించాడు. -
వీరేంద్ర సెహ్వాగ్‌కు ఐసీసీ అత్యున్నత గౌరవం.. మరో ఇద్దరి కూడా..!
టీమిండియా డాషింగ్ బ్యాటర్, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఐసీసీ అత్యున్నత గౌరవం లభించింది. ఐసీసీ ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో వీరూకు చోటు కల్పించింది. వీరూతో పాటు భారత మాజీ మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీ, శ్రీలంక దిగ్గజ ఆటగాడు అరవింద డిసిల్వకు కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చోటు దక్కింది. ఈ ముగ్గురిని హాల్ ఆఫ్ ద ఫేమర్ల జాబితాలోకి చేరుస్తున్నట్లు ఐసీసీ ట్విటర్ వేదికగా ప్రకటించింది. 🇮🇳 🇱🇰 🇮🇳 Three stars of the game have been added to the ICC Hall of Fame 🏅 Details 👇https://t.co/gLSJSU4FvI — ICC (@ICC) November 13, 2023 45 ఏళ్ల వీరేంద్ర సెహ్వాగ్ 1999-2013 మధ్యలో 104 టెస్ట్‌లు, 251 వన్డేలు, 19 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించి 18641 పరుగులు సాధించాడు. ఇందులో 38 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పార్ట్ టైమ్ స్పిన్నర్ కూడా అయిన వీరూ తన కెరీర్లో 136 వికెట్లు పడగొట్టాడు. 67 ఏళ్ల డయానా 1976-1993 మధ్యలో 20 టెస్ట్‌లు, 34 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. మహిళల టెస్ట్ క్రికెట్లో అత్యధిక బంతులు సంధించిన రికార్డు ఇప్పటికీ డయానా పేరిటే ఉంది. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన డయానా తన అంతర్జాతీయ కెరీర్లో 109 వికెట్లు పడగొట్టింది. 58 ఏళ్ల అరవింద డిసిల్వ 1984-2003 మధ్యలో 93 టెస్ట్‌లు, 308 వన్డేల్లో శ్రీలంకకు ప్రాతినిథ్యం వహించి 15645 పరుగులు సాధించాడు. ఇందులో 31 సెంచరీలు, 86 అర్ధ సెంచరీలు ఉన్నాయి. డిసిల్వ తన కెరీర్లో 135 వికెట్లు కూడా పడగొట్టాడు. -
2011 ఫిక్సింగ్ : దర్యాప్తు నిలిపివేసిన శ్రీలంక
కొలంబొ : భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలత్గమగే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఫొన్సెక నేతృత్వంలోని బృందం శ్రీలంక ఆటగాళ్లను విచారిస్తోంది. తాజాగా మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ వచ్చిన ఆరోపణలకు తగిన ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు శ్రీలంక క్రీడాశాఖ తెలిపింది.(‘సరైన టైమ్‌లో కెప్టెన్‌గా తీసేశారు’) కాగా ఈ కేసులో ఇప్పటికే మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ఆరోపణలు చేసిన మహిదానందతో పాటు అప్పటి కెప్టెన్ కుమార సంగక్కరతో పాటు మాజీ ఆటగాళ్లు మహేళ జయవర్దెనేతో పాటు అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మన్, మాజీ ఆటగాడు అరవింద డిసిల్వాలను విచారించింది. విచారణలో భాగంగా వారు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్నామని.. వారి సమాధానాలతో తాము సంతృప్తి చెందినట్లు ఫొన్సెక నేతృత్వంలోని స్పెషల్ ఇన్వస్టిగేషన్ టీమ్ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నాం అంటూ శ్రీలంక క్రీడాశాఖ తెలిపింది.( నేడు విచారణకు సంగక్కర ) కాగా 2011 మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంపై అప్పటి కెప్టెన్ కుమార సంగక్కరను దర్యాప్తు విభాగం సుమారు 10 గంటల పాటు విచారించింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో రెండు సార్లు టాస్ వేయడంపై గల కారణాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన సంగక్కర.. నిజనిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం లంక మాజీ క్రికెటర్, మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అరవింద డిసిల్వాను అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. ప్రపంచకప్ 2011 ఫైనల్ సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించిన వివరాలపై కూపీ లాగారు. మంగళవారం సమన్లు జారీ చేసిన పోలీసులు ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కౌన్సిల్ సైతం స్వతంత్ర విచారణ జరిపించాలని డిసిల్వా డిమాండ్ చేశారు. అవసరమైతే విచారణ కోసం భారత్‌కు వస్తానని పేర్కొన్నారు. ఫిక్సింగ్ ఆరోపణల్లో భాగంగా శ్రీలంక బ్యాటింగ్ లెజెండ్ మహేలా జయవర్ధనే విచారణకు హాజరయ్యాడు. అందుకోసం కొలంబోలోని సుగతదాసా స్టేడియంలోని క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు విభాగానికి జయవర్ధనే హజరయ్యాడు. జయవర్దెనే చెప్పిన విషయాలను దర్యాప్తు బృందం రికార్డు చేసుకుంది. ఆ మ్యాచ్‌లో జయవర్దెనే శతకం సాధించిన సంగతి తెలిసిందే. (2011 ఫైనల్ ఫిక్సింగ్? దర్యాప్తు వేగవంతం) కాగా నాటి ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 274/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. స్టార్ బ్యాట్స్‌మెన్ సెహ్వాగ్ (0), సచిన్ (18)ల వికెట్లను త్వరగా కోల్పోయింది. ఆ క్లిష్ట స్థితిలో గౌతమ్ గంభీర్(97) అద్భుత పోరాటానికి.. ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఆరు వికెట్లతో టీమిండియా విజయం సాధించి 28 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై రెండో ప్రపంచకప్‌ను సాధించింది. -
ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ విచారణ జరపాలి
కొలంబో: 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందంటూ శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలుత్గమగే చేసిన ఆరోపణలపై ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఇప్పటికే శ్రీలంక మాజీ క్రికెటర్లు కుమార సంగక్కరా, మహేళ జయవర్ధనే ఆ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించగా, తాజాగా వారి జాబితాలో మరో లంక మాజీ క్రికెటర్ అరవింద డిసిల్వా చేరాడు. అవి ఎటువంటి ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలంటూ ధ్వజమెత్తిన డిసిల్వా.. వాటిని ప్రజలు నమ్మవద్దని పేర్కొన్నాడు. అదే సమయంలో ‘ఫిక్సింగ్’ ఆరోపణలపై భారత ప్రభుత్వం, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లు నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశాడు. ‘ఇవి చాలా సీరియస్ ఆరోపణలు. చాలామంది ప్రజల్ని ప్రభావితం చేస్తాయి. ఇది కేవలం క్రికెటర్లు, సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ కోసం మాత్రమే కాదు. క్రికెట్ గేమ్‌లో మరింత పారదర్శకత తీసుకురావడం కోసం పూర్తిస్థాయి విచారణ చేయాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో భారత గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. మేము మా ప్రపంచ కప్ విజయాన్ని ఎంతో ఆదరించినట్లే, సచిన్ టెండూల్కర్ వంటి ఆటగాళ్ళు 2011 వరల్డ్‌కప్ విజయాన్ని జీవితాంతం ఆ క్షణాలను ఎంతో ఆస్వాదిస్తారు. భారత్‌లోని కోట్లాది మంది క్రికెట్ అభిమానుల అభిరుచి, ఆసక్తి నాకు తెలుసు. ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం, బీసీసీఐ నిష్పాక్షిక విచారణ జరిపి నిజాలను వెలికి తీయండి. విచారణ పూర్తయ్యే వరకూ ప్రజలు లేని పోని అపోహల్ని నమ్మవద్దు. విచారణ పూర్తయితే అన్ని బయటకొస్తాయి’ అని 1996 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో సెంచరీ సాధించి లంక టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన డిసిల్వా పేర్కొన్నాడు. కొన్ని రోజుల క్రితం స్థానిక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిందనంద మాట్లాడుతూ ‘మీకు నేనో విషయం చెప్పాలనుకుంటున్నా. 2011 ప్రపంచకప్ అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని నేను క్రీడల మంత్రిగా ఉన్నప్పుడే చెప్పాను. (వాళ్లెందుకు అంతగా స్పందిస్తున్నారు?) ఫైనల్ మ్యాచ్ మేం గెలవాల్సింది. అయితే ఇది తెలియజేయడం నా బాధ్యతని చెబుతున్నా... ఆ మ్యాచ్ ఫిక్సయింది. ఇది వాస్తవం’ అని సరికొత్త వివాదానికి తెరలేపాడు. దాంతో ఆ మ్యాచ్‌లో సభ్యులైన జయవర్ధనే, సంగక్కరాలకు చిర్రెత్తుకొచ్చింది. ‘ఎన్నికలకు ముందు ఈ తరహా సర్కస్‌లు మొదలు కావడం కొత్త కాదు.. మళ్లీ సర్కస్ చేస్తున్నారు’ అని జయవర్ధనే విమర్శించగా, ప్రపంచకప్ ఫైనల్‌ను ఫిక్స్ చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. మ్యాచ్ ఆడిన తుది జట్టులో భాగం కాని వ్యక్తి అలా ఎలా చేయగలడో మాకైతే తెలీదు. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడైనా మాకు జ్ఞానోదయం కలిగించండి’ అంటూ మాజీ కెప్టెన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. దీనిపై ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వం విచారణ ప్రారంభించగా, భారత ప్రభుత్వం, బీసీసీఐ కూడా విచారణ జరపాలని డిసిల్వా సూచించాడు. (2011 ఫైనల్ ఫిక్సయింది!) -
మేమెప్పుడూ ఫిక్సింగ్‌కు పాల్పడలేదు
కొలంబో: శ్రీలంక క్రికెట్లో ఫిక్సింగ్‌కు ఆద్యులమంటూ తమపై దేశ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ తిలంగ సుమతిపాల చేసిన ఆరోపణలను మాజీ కెప్టెన్లు అర్జున రణతుంగ, అరవింద డిసిల్వా తీవ్రంగా ఖండించారు. ‘మేమెప్పుడూ డబ్బు తీసుకోలేదు. మ్యాచ్‌లను ఫిక్స్ చేయలేదు’ అని వీరిద్దరూ మంగళవారం కొలంబోలో ప్రకటించారు. 1994లో లక్నో టెస్టు సందర్భంగా భారత బుకీ నుంచి రణతుంగ, డిసిల్వాలు 1500 అమెరికన్ డాలర్లు తీసుకున్నారని సుమతిపాల ఇటీవల ఆరోపించారు. దీంతో మాజీ సారథులిద్దరూ ఉమ్మడిగా మీడియా ముందుకువచ్చారు. ‘సుమతిపాల అధ్యక్షుడిగా ఉన్న క్రికెట్ కమిటీలో నేను పనిచేశా. ఒకవేళ ఫిక్సర్నైతే నన్ను ఎలా కొనసాగించారు? ఆయన ఆరోపణలను లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు’ అని డిసిల్వా పేర్కొన్నాడు. ‘15 వేల డాలర్లు కాదు... ప్రపంచ కప్‌ను వదులుకుంటే 15 మిలియన్ డాలర్లైనా ఇచ్చేవారు. అయినా మేం ఎప్పుడూ డబ్బు కోసం ఆశపడలేదు. ఆటకు అంకితమయ్యాం. దేశానికి పేరు తేవడానికి శ్రమించాం’ అని 1996 ప్రపంచకప్‌లో శ్రీలంకను విజేతగా నిలిపిన రణతుంగ స్పష్టం చేశాడు. -
'వాటిని క్రికెట్ జయిస్తుంది'
శ్రీనగర్: క్రికెట్ లో చోటు చేసుకుంటున్న అవినీతి ఘటనలకు కచ్చితంగా ముగింపు అనేది దొరుకుతుందని శ్రీలంక ఆటగాడు అరవింద్ డిసిల్వా అభిప్రాయపడ్డాడు. గత కొన్ని సంవత్సరాలుగా వెలుగుచూస్తున్న అవినీతి అంశాల కంటే క్రికెట్ క్రీడ చాలా గొప్పదన్నాడు. క్రికెట్ లో అవినీతిని ఆ క్రీడ తప్పకుండా జయిస్తుందని డిసిల్వా పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను క్రికెట్ గురించి ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోకపోయినా.... కొన్నేళ్ల నుంచి క్రికెట్ లో ఏదొక అవినీతి జరుగుతూనే వస్తుందన్నాడు. క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వంటి ఘటనలు తరచు చోటు చేసుకుంటూ ఆటకు మచ్చ తెస్తుండటం నిజంగా ఆందోళనకరమేనన్నాడు. క్రికెట్ అనేది ప్రజల్ని సమష్టిగా ఉంచి వివాదాల్ని దూరంగా నెట్టే సమయం వస్తుందన్నాడు. క్రికెట్ లో ఎన్ని అవాంతరాలు ఏర్పడినా... అంతిమంగా క్రికెట్ దే విజయమని డిసిల్వా స్పష్టం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అనేక మంది విదేశీ ఆటగాళ్లు భాగస్వామ్యం కావడం ఆనందించదగ్గ విషయమన్నాడు. దీంతో పలు రకాలైన సాంప్రదాయాలు క్రికెట్ మరింత విస్తరించడానికి దోహద పడుతుందన్నాడు. భారత్-పాకిస్థాన్ ల మధ్య జరగాల్సిన ద్వైపాక్షి సిరీస్ పై స్పందించిన డిసిల్వా.. ఇరు దేశాల ప్రజలు మిగతా విషయాలను మరచిపోయి ఆటను ఆటగా చూడాల్సిన అవసరం ఉందన్నాడు. ఒక క్రీడకు మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే అది ప్రజల హృదయాల్లో నిలిచిపోతుందన్నాడు.