కొలంబో: 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందంటూ శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలుత్గమగే చేసిన ఆరోపణలపై ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఇప్పటికే శ్రీలంక మాజీ క్రికెటర్లు కుమార సంగక్కరా, మహేళ జయవర్ధనే ఆ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించగా, తాజాగా వారి జాబితాలో మరో లంక మాజీ క్రికెటర్ అరవింద డిసిల్వా చేరాడు. అవి ఎటువంటి ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలంటూ ధ్వజమెత్తిన డిసిల్వా.. వాటిని ప్రజలు నమ్మవద్దని పేర్కొన్నాడు. అదే సమయంలో ‘ఫిక్సింగ్’ ఆరోపణలపై భారత ప్రభుత్వం, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లు నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశాడు. ‘ఇవి చాలా సీరియస్ ఆరోపణలు. చాలామంది ప్రజల్ని ప్రభావితం చేస్తాయి. ఇది కేవలం క్రికెటర్లు, సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ కోసం మాత్రమే కాదు.
క్రికెట్ గేమ్‌లో మరింత పారదర్శకత తీసుకురావడం కోసం పూర్తిస్థాయి విచారణ చేయాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో భారత గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. మేము మా ప్రపంచ కప్ విజయాన్ని ఎంతో ఆదరించినట్లే, సచిన్ టెండూల్కర్ వంటి ఆటగాళ్ళు 2011 వరల్డ్‌కప్ విజయాన్ని జీవితాంతం ఆ క్షణాలను ఎంతో ఆస్వాదిస్తారు. భారత్‌లోని కోట్లాది మంది క్రికెట్ అభిమానుల అభిరుచి, ఆసక్తి నాకు తెలుసు. ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం, బీసీసీఐ నిష్పాక్షిక విచారణ జరిపి నిజాలను వెలికి తీయండి. విచారణ పూర్తయ్యే వరకూ ప్రజలు లేని పోని అపోహల్ని నమ్మవద్దు. విచారణ పూర్తయితే అన్ని బయటకొస్తాయి’ అని 1996 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో సెంచరీ సాధించి లంక టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన డిసిల్వా పేర్కొన్నాడు. కొన్ని రోజుల క్రితం స్థానిక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిందనంద మాట్లాడుతూ ‘మీకు నేనో విషయం చెప్పాలనుకుంటున్నా. 2011 ప్రపంచకప్ అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని నేను క్రీడల మంత్రిగా ఉన్నప్పుడే చెప్పాను. (వాళ్లెందుకు అంతగా స్పందిస్తున్నారు?)
ఫైనల్ మ్యాచ్ మేం గెలవాల్సింది. అయితే ఇది తెలియజేయడం నా బాధ్యతని చెబుతున్నా... ఆ మ్యాచ్ ఫిక్సయింది. ఇది వాస్తవం’ అని సరికొత్త వివాదానికి తెరలేపాడు. దాంతో ఆ మ్యాచ్‌లో సభ్యులైన జయవర్ధనే, సంగక్కరాలకు చిర్రెత్తుకొచ్చింది. ‘ఎన్నికలకు ముందు ఈ తరహా సర్కస్‌లు మొదలు కావడం కొత్త కాదు.. మళ్లీ సర్కస్ చేస్తున్నారు’ అని జయవర్ధనే విమర్శించగా, ప్రపంచకప్ ఫైనల్‌ను ఫిక్స్ చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. మ్యాచ్ ఆడిన తుది జట్టులో భాగం కాని వ్యక్తి అలా ఎలా చేయగలడో మాకైతే తెలీదు. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడైనా మాకు జ్ఞానోదయం కలిగించండి’ అంటూ మాజీ కెప్టెన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. దీనిపై ఇప‍్పటికే శ్రీలంక ప్రభుత్వం విచారణ ప్రారంభించగా, భారత ప్రభుత్వం, బీసీసీఐ కూడా విచారణ జరపాలని డిసిల్వా సూచించాడు. (2011 ఫైనల్ ఫిక్సయింది!)
Comments
Please login to add a commentAdd a comment