'వాటిని క్రికెట్ జయిస్తుంది'
శ్రీనగర్: క్రికెట్ లో చోటు చేసుకుంటున్న అవినీతి ఘటనలకు కచ్చితంగా ముగింపు అనేది దొరుకుతుందని శ్రీలంక ఆటగాడు అరవింద్ డిసిల్వా అభిప్రాయపడ్డాడు. గత కొన్ని సంవత్సరాలుగా వెలుగుచూస్తున్న అవినీతి అంశాల కంటే క్రికెట్ క్రీడ చాలా గొప్పదన్నాడు. క్రికెట్ లో అవినీతిని ఆ క్రీడ తప్పకుండా జయిస్తుందని డిసిల్వా పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను క్రికెట్ గురించి ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోకపోయినా.... కొన్నేళ్ల నుంచి క్రికెట్ లో ఏదొక అవినీతి జరుగుతూనే వస్తుందన్నాడు. క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వంటి ఘటనలు తరచు చోటు చేసుకుంటూ ఆటకు మచ్చ తెస్తుండటం నిజంగా ఆందోళనకరమేనన్నాడు.
క్రికెట్ అనేది ప్రజల్ని సమష్టిగా ఉంచి వివాదాల్ని దూరంగా నెట్టే సమయం వస్తుందన్నాడు. క్రికెట్ లో ఎన్ని అవాంతరాలు ఏర్పడినా... అంతిమంగా క్రికెట్ దే విజయమని డిసిల్వా స్పష్టం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అనేక మంది విదేశీ ఆటగాళ్లు భాగస్వామ్యం కావడం ఆనందించదగ్గ విషయమన్నాడు. దీంతో పలు రకాలైన సాంప్రదాయాలు క్రికెట్ మరింత విస్తరించడానికి దోహద పడుతుందన్నాడు. భారత్-పాకిస్థాన్ ల మధ్య జరగాల్సిన ద్వైపాక్షి సిరీస్ పై స్పందించిన డిసిల్వా.. ఇరు దేశాల ప్రజలు మిగతా విషయాలను మరచిపోయి ఆటను ఆటగా చూడాల్సిన అవసరం ఉందన్నాడు. ఒక క్రీడకు మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే అది ప్రజల హృదయాల్లో నిలిచిపోతుందన్నాడు.