archaeological dept
-
16వ శతాబ్దం నాటి వినాయక విగ్రహం గుర్తింపు
సాక్షి,మైదుకూరు: వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామంలో 16వ శతాబ్దం నాటి వినాయక విగ్రహాన్ని గుర్తించినట్టు ఔత్సాహిక పరిశోధకుడు బొమ్మిశెట్టి రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి పశువుల దొడ్డిలో ఈ విగ్రహాన్ని కనుగొన్నట్టు పేర్కొన్నారు. విగ్రహం ఎడమ చేతిలో శంఖం, కుడి చేతిలో డమరుకం ఉన్నట్టు తెలిపారు. మైసూరు పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డికి విగ్రహం గురించి తెలియజేయగా, అది 16వ శతాబ్దం నాటిదని ఆయన చెప్పినట్టు రమేష్ తెలిపారు. -
షాక్‌లో శాస్త్రవేత్తలు.. బయటపడ్డ 5000 ఏళ్ల నాటి ఫ్రిడ్జ్.. అందులో ఏం దాచేవారో తెలుసా!
చరిత్రను వెలికితీయడంతో పాటు వాటి ఆధారాలను భద్రపరచే లక్ష్యంతో పురావస్తు శాఖ పని చేస్తుంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి వారికి ఆశ్చర్యం కలిగించే ఘటనలు ఎదురవుతుంటాయి. తాజాగా దక్షిణ ఇరాక్‌లో తవ్వకాలు జరుపుతున్న పురావస్తు శాస్త్రవేత్తల బృందానికి అటువంటి అనుభవమే ఎదురైంది. దాదాపు 5000 సంవత్సరాల నాటి రెస్టారెంట్ అవశేషాలు బయటపడ్డాయి. 5వేల ఏళ్ల నాటి ఫ్రిడ్జ్.. వివరాల్లోకి వెళితే.. సుమేరియన్ నాగరికతకు ముఖ్యమైన కేంద్రంగా పిలిచే పురాతన లగాష్ శిధిలాల మధ్య పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు ప్రారంభించారు. ఈనేపథ్యంలో ఇటీవల అక్కడ 5వేల ఏళ్ల నాటి రెస్టారెంట్‌ను కనుగొన్నారు. అందులో ఆ కాలం నాటి ఓవెన్, కొన్ని బెంచీలు, గిన్నెలు, ఇతర పాత్రలలో బయటపడ్డాయి. అన్నింటికంటే విచిత్రంగా ‘జీర్’ అనే పిలిచే మట్టి రిఫ్రిజిరేటర్ బయట పడటం శాస్త్రవేత్తలును ఆశ్చరపరిచింది. ఆ ఫ్రిజ్‌లో బీర్‌ను దాచినట్టు వారికి రుజువులు కూడా దొరికాయి. అంతేకాకుండా ఆ పురాతన బీర్ తయారు చేసే ఒక రెసిపీని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు చెప్పారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, పిసా విశ్వవిద్యాలయ బృందాల సంయుక్త ప్రయత్నాల ఫలితంగా ఈ ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయి. ఈ తవ్వకాల ఆ బృందం.. డ్రోన్ ఫోటోగ్రఫీ, థర్మల్ ఇమేజింగ్, మాగ్నెటోమెట్రీ, మైక్రో-స్ట్రాటిగ్రాఫిక్ శాంప్లింగ్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించుకున్నారు. -
ఎపిగ్రఫీ మ్యూజియం సిటీకి బదులు తిరుచ్చికి..?
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి శాసనాల ప్రదర్శనశాల (ఎపిగ్రఫీ మ్యూజియం)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ప్రక్రియకు ఆదిలోనే అవాంతరం ఎదురవుతోంది. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆమోదించిన ప్రతిపాదనే బుట్టదాఖలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మ్యూజియాన్ని హైదరాబాద్‌లో కాకుండా తిరుచ్చిలో ఏర్పాటు చేసేలా తమిళనాడుకు చెందిన కొందరు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ)లో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారులు, ఢిల్లీలోని మరికొందరు తమిళ ఐఏఎస్ అధికారులు ఈ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వెరసి.. భాగ్యనగరానికి మరింత పర్యాటక శోభ తీసుకు రావాల్సిన ప్రాజెక్టు కాస్తా మనకు దక్కకుండా పోయే పరిస్థితి నెలకొంది. తొలుత హైదరాబాద్‌లో ఏర్పాటుకు కసరత్తు..: దేశంలో శాసనాలకు ప్రత్యేకంగా మ్యూజియం లేదు. మైసూరు కేంద్రంగా ఏఎస్ఐలో భాగంగా శాసనాల విభాగం ఉంది. దీని పరిధిలో లక్నో, చెన్నై, నాగ్‌పూర్‌లలో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. మైసూరులో 75 వేల శాసనాలకు చెందిన నకళ్లు ఉన్నాయి. కానీ ప్రజలు సందర్శించేలా మ్యూజియం మాత్రం లేదు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో లభించిన శాసనాలను భద్రపరిచేందుకు, పర్యాటకులు వాటిని తిలకించేందుకు వీలుగా ఎపిగ్రఫీ మ్యూజియాన్ని హైదరాబాద్‌లో ఏర్పా టు చేయాలని చరిత్ర పరిశోధకులు గతేడాది కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. దీనికి ఆయన ఆమోదం తెలిపారు. దీంతో వెంటనే స్థానికంగా మ్యూజియం ఏర్పాటుకు వీలుగా కసరత్తు ప్రారంభమైంది. ఓ చిన్న పెవిలియన్‌తో సరిపెట్టేలా..: కానీ ఏఎస్ఐలో పనిచేసే తమిళనాడుకు చెందిన ఓ సీనియర్ అధికారి కేంద్ర మంత్రి ప్రతిపాదనకు గండికొట్టి ఎపిగ్రఫీ మ్యూజియాన్ని తమిళనాడులోని తిరుచ్చిలో ఏర్పాటు చేసే పని ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఎపిగ్రఫీ మ్యూజియం బదులు సాలార్జంగ్ మ్యూజియంలో ఓ చిన్న పెవిలియన్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీంతో ఏఎస్ఐ తెలంగాణ సర్కిల్ అధికారులు సాలార్జంగ్ మ్యూజియంలో ప్రతిపాదిత పెవిలియన్ కోసం 132 శాసన కాపీలను ప్రదర్శించేందుకు ఓ జాబితా రూపొందించారు. రూ. 20 లక్షలు వెచ్చించి పెవిలయన్ గ్యాలరీలు సిద్ధం చేశారు. మైసూరులోని ఎపిగ్రఫీ డైరక్టరేట్లోని శాసన నకళ్లలో 23 వేలకుపైగా తమిళ భాషవే ఉన్నాయి. ఇప్పుడు వాటిని తమిళనాడుకు తరలించేందుకు ఆ అధికారులు తెరవెనక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత తిరుచ్చిలో జాతీయ మ్యూజియం ఏర్పాటు చేయాలన్నది ఆ అధికారుల యోచన. అయితే దీన్ని అడ్డుకోవాలని చరిత్ర పరిశోధకులు కిషన్‌రెడ్డిని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో సమావేశం జరగనుంది. ఇందులో కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. -
32 ఆకుల ధర్మచక్రశిల లభ్యం
తొండంగి: తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఎ.కొత్తపల్లి మెట్టపై క్రీస్తుశకం 3వ శతాబ్దం నాటి 32 ఆకుల ధర్మచక్ర శిల బయల్పడింది. ఈ మెట్టపై కొంత కాలం నుంచి పురావస్తుశాఖ ఆధ్వర్యంలో రెండో విడత తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకూ ఇక్కడ క్రీస్తుశకం 2వ శతాబ్దం నాటి బౌద్ధస్థూపావశేషాలు, శిలాశాసనాలు, విగ్రహాలు లభ్యమయ్యాయి. శనివారం నాటి తవ్వకాల్లో సారనాథ్‌లో అశోకుని ధర్మచక్రం లాంటి మరో ధర్మచక్ర శిలాధారం లభ్యమైంది. ఇది ఇక్ష్వాకుల కాలంనాటిదిగా భావిస్తున్నామని పురావస్తుశాఖ సహాయసంచాలకులు పట్టాభిరెడ్డి, సాంకేతిక సహాయకులు వెంకటరావు, తిమ్మరాజు తెలిపారు. అశోకుని ధర్మ చక్రంలో 24 ఆకులు ఉంటే ఈ ధర్మచక్రం 32 ఆకులతో ఉందన్నారు. పాళీ భాషలో త, ద, మ, ర, ఛి, థ, స, ద అక్షరాలతో ఉన్న శిలాశాసనం లభించిందని, దానికి సంబంధించి లోతుగా పరిశీలిస్తున్నామని చెప్పారు. సమగ్రమైన నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు పంపుతామన్నారు.