ఎ.కొత్తపల్లిమెట్టపై లభించిన ఎనిమిది అక్షరాలతో ఉన్న శిలాశాసనం, అరుదైన 32 ఆకుల ధర్మచక్రశిల
తొండంగి: తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఎ.కొత్తపల్లి మెట్టపై క్రీస్తుశకం 3వ శతాబ్దం నాటి 32 ఆకుల ధర్మచక్ర శిల బయల్పడింది. ఈ మెట్టపై కొంత కాలం నుంచి పురావస్తుశాఖ ఆధ్వర్యంలో రెండో విడత తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకూ ఇక్కడ క్రీస్తుశకం 2వ శతాబ్దం నాటి బౌద్ధస్థూపావశేషాలు, శిలాశాసనాలు, విగ్రహాలు లభ్యమయ్యాయి.
శనివారం నాటి తవ్వకాల్లో సారనాథ్‌లో అశోకుని ధర్మచక్రం లాంటి మరో ధర్మచక్ర శిలాధారం లభ్యమైంది. ఇది ఇక్ష్వాకుల కాలంనాటిదిగా భావిస్తున్నామని పురావస్తుశాఖ సహాయసంచాలకులు పట్టాభిరెడ్డి, సాంకేతిక సహాయకులు వెంకటరావు, తిమ్మరాజు తెలిపారు. అశోకుని ధర్మ చక్రంలో 24 ఆకులు ఉంటే ఈ ధర్మచక్రం 32 ఆకులతో ఉందన్నారు.
పాళీ భాషలో త, ద, మ, ర, ఛి, థ, స, ద అక్షరాలతో ఉన్న శిలాశాసనం లభించిందని, దానికి సంబంధించి లోతుగా పరిశీలిస్తున్నామని చెప్పారు. సమగ్రమైన నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు పంపుతామన్నారు.