పరిశ్రమలో అగ్నిప్రమాదం
మొయినాబాద్, న్యూస్‌లైన్: ఓ ఆర్కిటెక్చర్ మోల్డింగ్ కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వేస్టేజీ స్క్రాప్‌తో పాటు ఓ షెడ్డుకు మంటలు చెలరేగాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది మంటలు అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన మండల పరిధిలోని కనకమామిడి రెవెన్యూ పరిధిలో ఉన్న రాస్ పాలిబోర్డ్ ప్రొడక్స్ కంపెనీలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రాస్ పాలిబోర్డ్ కంపెనీలో ఇంటీరియర్ డెకరేషన్‌కు సంబంధించిన ఆర్కిటెక్చర్ మోల్డింగ్ షీట్లు తయారు చేస్తారు. కాగా ఏడాదిగా కంపెనీలో పని జరగడంలేదు. కార్మికుల కుటుంబాలు కంపెనీ ఆవరణలోనే ఉన్న గృహాల్లో నివాసముంటున్నారు.
కంపెనీలో షీట్లు తయారు చేయగా మిగిలిన వేస్టేజీ స్క్రాప్‌ను కంపెనీ పక్కన ఓ షెడ్డులో వేశారు. షెడ్డుపక్కన సైతం వేస్టేజీ ఉంది. శుక్రవారం స్క్రాప్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కార్మికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. స్క్రాప్ ఉన్న షెడ్డుకు కూడా నిప్పు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా పొగ కమ్ముకోవడంతో ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
కార్మికుల సమాచారంతో చేవెళ్ల నుంచి ఫైరింజన్ వచ్చింది. ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కొద్దిసేపటి తర్వాత లంగర్‌హౌస్ నుంచి మరో ఫైరింజన్ రావడంతో మంటలను పూర్తిగా ఆర్పేశారు. మంటలు చెలరేగిన షెడ్డుకు ఇరవై అడుగుల దూరంలోనే గోడౌన్ ఉంది. ఓ పక్క కంపెనీ, మరో పక్క గృహసముదాయం ఉంది. మంటలు అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పింది.