Area Hospitals
-
ఇక ఠంచనుగా ఆస్పత్రికి..
నిర్మల్: నిర్మల్‌లోని జిల్లా ఆస్పత్రి, ప్రసూ తి ఆస్పత్రులతో పాటు భైంసాలోని ఏరియా ఆస్పత్రిలో వైద్యులు పక్కాగా సమయపాలన పాటిస్తున్నారు. కలెక్టరేట్ నుంచి ఈ మూడు ఆస్పత్రులకు రోజూ ఉదయం 9గంటలకు, మధ్యాహ్నం 2గంటలకు కలెక్టర్ ముషరఫ్ అలీ తన సిబ్బందిని పంపించి వైద్యుల హాజరుపై పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వారి రిజిస్టర్లో విధుల్లో ఉన్న వైద్యు లతో స్వయం గా సంతకాలు పెట్టిస్తున్నారు. కలెక్టర్ చర్యల తో ఆస్పత్రుల్లో సమయానికి వైద్యులు వస్తుండటం, సేవలు అందుతుండటంతో జిల్లావాసు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు దవా ఖానాల్లో వైద్యుల గైర్హాజరీపై ‘సాక్షి’పలుమార్లు కథనాలను ప్రచురించిన సంగతి తెలిసిందే. -
ఈ పది రోజులే కీలకం
సాక్షి, అమరావతి: వచ్చే పది రోజులూ అత్యంత కీలకం కానుంది. ఈ గడువులో కమ్యూనిటీ స్ప్రెడ్ (కరోనా సోకిన వ్యక్తితో ఎలాంటి సంబంధమూ లేని వ్యక్తులకు సోకడం)ను అరికట్టగలిగితే కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడే అవకాశాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ చేపట్టిన చర్యలు ఒక ఎత్తు అయితే.. ఇకపై జాగ్రత్తగా ఉండటం మరో ఎత్తు అంటున్నారు. వైరస్ వ్యాప్తి అనేది సామాన్య జనంలోకి వెళ్లకుండా ఉండటమనేది పూర్తిగా ప్రజల మీదే ఆధారపడి ఉందని, వారు కనీస జాగ్రత్తలు తీసుకుంటే ఆ దశకు వెళ్లకుండా కాపాడుకునే అవకాశాలుంటాయని స్పష్టం చేస్తున్నారు. పాజిటివ్ కేసులన్నీ విదేశాల నుంచి వచ్చినవే.. ► ఏపీలో నమోదైన పాజిటివ్ కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారివే. ► ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రాకపోకలను నియంత్రిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య పూర్తిగా నిరోధించినట్లయ్యింది. ► ఇప్పటికే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ వైద్య పరిశీలనలో ఉన్న వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించగలిగితే ప్రమాదం నుంచి గట్టెక్కే అవకాశాలున్నాయి. ► మన రాష్ట్రానికి వివిధ దేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య సుమారు 13 వేల వరకూ ఉంది. ► ఈ నెల 29కి 6 వేల మందికి 14 రోజులు పరిశీలన పూర్తవుతుంది. మిగతా వారికి ఏప్రిల్ 3తో పూర్తవుతుంది. ► ఇది పూర్తయ్యే వరకూ వైరస్ వ్యాప్తిని నిరోధిస్తే సమస్య నుంచి గట్టెక్కినట్లే. ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటే గనుక ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మన చేతుల్లో ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ► ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులెవరైనా స్వీయ నిర్బంధంలో లేకుండా ఉంటే ఇప్పటికైనా వాళ్లు ఆ చర్యలు తీసుకోవాలని వివిధ మాధ్యమాల ద్వారా ప్రజారోగ్య శాఖ విజ్ఞప్తి చేస్తోంది. చేపట్టిన చర్యలివీ.. ► ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్, స్పెయిన్, అమెరికా, చైనా వంటి దేశాలు కరోనా హైరిస్క్ దేశాలుగా ప్రకటించబడ్డాయి. ► ఆ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం. ► విమానాల్లో వచ్చే వారిని క్వారంటైన్‌కు తరలించడం. ► తరచూ వారి నమూనాలు సేకరించి పరీక్షించడం. ►పైన పేర్కొన్న దేశాల నుంచి వచ్చిన వారు.. ఎవరెవరితో తిరిగారో జల్లెడ పట్టి గుర్తించడం. ► ఆ వ్యక్తి ఉన్న ఇంట్లో సభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించి వైద్య పరిశీలన చేయడం. ► ఎవరైనా సహకరించకపోతే వారిని నిర్బంధంగానైనా తరలించడం. ఏరియా ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక పడకలు బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లోనే కాకుండా ఏరియా ఆస్పత్రుల్లోనూ కరోనా వైరస్ లక్షణాలున్న వారికి ప్రత్యేక పడకల ఏర్పాటు. ► తణుకు, తాడేపల్లి గూడెం, జంగారెడ్డి గూడెం, నూజివీడు, గుడివాడ, బాపట్ల, నరసరావుపేట, చీరాల, కందుకూరు, గూడూరు, కావలి, కుప్పం, శ్రీకాళహస్తి, పలమనేరు, నగరి, కదిరి, గుంతకల్, ఆదోని, పులివెందుల ఆస్పత్రుల్లో మొత్తం 142 ప్రత్యేక పడకల ఏర్పాటు. ►వీటితోపాటు 9 ప్రత్యేక వెంటిలేటర్ల సదుపాయం. ప్రైవేట్ యాజమాన్యాలకు శిక్షణ ► కరోనా వైరస్ లక్షణాలున్న వారికి వైద్యమందించేందుకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 900 ప్రత్యేక పడకలు ఏర్పాటు చేశాం. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు ఈ నెల 24వ తేదీన ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. వారు నిబంధనల మేరకు రోగులకు వైద్యం అందించాల్సి ఉంటుంది. – డాక్టర్ ఎ.మల్లికార్జున, సీఈవో, ఆరోగ్యశ్రీ -
మెడి‘కలే’నా?
డ్యూటీ చేసేందుకు బాయిమీదికి వెళ్లిన మల్లయ్యకు ఛాతిలో నొప్పి.. హుటాహుటిన అంబులెన్స్‌లో సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమించిందని హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. అయితే మల్లయ్యను అంబులెన్స్‌లో తరలిస్తుండగా వైద్యం అందక మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలాడు. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే.. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు గోదావరిఖనిని ఆనుకొని ఉన్న ఐదు జిల్లాల వాసులు ఎదుర్కొంటున్న దుస్థితి. గోదావరిఖని(రామగుండం) : పారిశ్రామిక ప్రాంతంలో వైద్యకళాశాల ఏర్పాటు కలగా మారింది. సింగరేణి బొగ్గు గనులు, ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులు విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కార్మిక కుటుంబాలు, కార్మికుల పిల్లలు ఎక్కువగా ఉన్నారు. దీంతో అందరికీ అందుబాటులో ఉండేలా గోదావరిఖనిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని గతఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అనంతరం ఐదు జిల్లాలకు చెందిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి కళాశాల విషయం ఊసెత్తలేదు. కార్మికులే ఎక్కువ.. పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో కార్మిక కుటుంబాలతోపాటు మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వేల సంఖ్యలో కార్మికులు ఉన్నారు. రామగుండంలో ఎన్టీపీసీలోనూ వేలాది మంది ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఆర్ఎఫ్సీఎల్ కూడా కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. అతిపెద్ద సంస్థలైన ఎన్టీపీసీ, సింగరేణి సహకారంతో రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని గతంలో సీఎం కేసీఆర్ తలిచారు. 2014 ఎన్నికల సమయంలో గోదావరిఖని, మంథని ప్రచారానికి వచ్చిన సమయంలో తమను గెలిపిస్తే సింగరేణి, ఎన్టీపీసీ సంస్థల సహకారంతో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటైతే కార్మికులతోపాటు ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రావడంతోపాటు కార్మికుల పిల్లలకు వైద్య విద్యకూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అందని వైద్య సేవలు.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని మందమర్రి, చెన్నూరు, శ్రీరాంపూర్, బెల్లంపల్లిలో సింగరేణి ఆస్పత్రులు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో వైద్యనిపుణులు లేకపోవడంతో కార్మికులు వారి కుటుంబాలు వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులు.. హైదరాబాద్, కరీంనగర్ లాంటి నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లిలో గతంలోనే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలుగా ఏర్పడిన తర్వాత అక్కడి ఆస్పత్రులను ప్రభుత్వం ఏరియా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేసింది. కానీ.. ఏ ఆస్పత్రిలోనూ రోగులకు సరిపడా సౌకర్యాలు కల్పించలేదు. వైద్యులను నియమించలేదు. పెరిగిన ప్రసవాల సంఖ్య.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ ప్రభావంతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఆస్పత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు, వైద్యులు లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. వైద్యుల కొరత కారణంగా కాన్పుల సమయంలో శిశువులు మృతి చెందిన సంఘటనలూ ఉన్నాయి. సింగరేణి కార్మికులకు వైద్యం దూరం.. సింగరేణి ఆస్పత్రుల్లో కార్మికులకు వారి కుటుంబాలకూ సరైన వైద్యసేవలు అందడంలేదు. కార్మికుడు ప్రమాదశాత్తు గాయపడినా.. విధినిర్వహణలో గుండెపోటుకు గురైనా వెంటనే ఆయా జిల్లాల్లోని ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడ నిపుణులు లేకపోవడంతో సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి హైదరాబాద్‌కు రెఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లే వరకు పరిస్థితి విషమంగా ఉన్న కార్మికులు మధ్యలోనే మృతిచెందిన సంఘటనలున్నాయి. అంతేకాదు.. పట్టణ ప్రాంతాలకు వెళ్లిన రోగులు, వారి కుటుంబ సభ్యులకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గని ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడూ తక్షణ వైద్య సేవలు అందకపోవడం గమనార్హం. వైద్య కళాశాల ఏర్పాటైతే.. గోదావరిఖనిలో వైద్య కళాశాల ఏర్పాటుచేస్తే ప్రజలకు, కార్మికులు, కార్మికుల కుటుంబాలకు అత్యున్నత వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. కనీసం 500 పడకల సామర్థ్యంతో అన్నిరకాల వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది. ఐసీయూ, ట్రామా, న్యూరో, ఆర్థో తదితర సేవలు అందనున్నాయి. ప్రాణాపాయస్థితిలో వచ్చినవారిని సత్వరసేవలు పొందే వీలుంది. పోస్టుమార్టం సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసుతలకు ఒకే చోట వైద్యం అందే అవకాశం ఉంటుంది. మరోవైపు ఉపాధి అవకాశాలూ మెరుగుపడనున్నాయి. -
6 ఏరియా ఆస్పత్రుల్లో కేటరాక్ట్ ఆపరేషన్లు
హైదరాబాద్: ఇప్పటివరకూ ఏపీలోని జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో మాత్రమే కంటి శుక్లాలు (కేటరాక్ట్) ఆపరేషన్లు జరిగేవి. కానీ చాలామంది గ్రామీణ ప్రాంతాలవాసులు పట్టణాలకు వచ్చి ఇబ్బందులుపడలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఆరోగ్యమిషన్ నిధులతో ఏపీలోని వైద్యవిధాన పరిషత్ పరిధిలోని ఆరు ఏరియా ఆస్పత్రుల్లో కేటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే కేటరాక్ట్ జరుగుతున్నట్టు వైద్య విధానపరిషత్ వర్గాలు తెలిపాయి. పులివెందుల, నరసరావుపేట, తాడేపల్లిగూడెం, తణుకు, నర్సీపట్నం, టెక్కలి ఏరియా ఆస్పత్రుల్లో శుక్లాల ఆపరేషన్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో 115 విజన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో ప్రాథమిక పరీక్షలు జరుగుతాయి. కేటరాక్ట్ ఆపరేషన్లు అవసరమైతే పైన పేర్కొన్న ఏరియా ఆస్పత్రులకు గానీ, జిల్లా ఆస్పత్రులకు గానీ పంపిస్తారు. కేటరాక్ట్ మినహా క్లిష్టమైన ఆపరేషన్లు అంటే నీటికాసుల జబ్బు (గ్లకోమా), డయాబెటిక్ రెటినోపతి వంటి వాటికి జిల్లా ఆస్పత్రుల్లో గానీ, బోధనాసుపత్రులకు గానీ పంపిస్తారు. త్వరలోనే మరో 20 ఏరియా ఆస్పత్రుల్లో కేటరాక్ట్ ఆపరేషన్లు జరగడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వైద్యవిధానపరిషత్ అధికారులు తెలిపారు. గతంలో నెలకు 1200 కేటరాక్ట్ ఆపరేషన్లు జరుగుతుండగా, ఏరియా ఆస్పత్రుల్లో ఈ వసతి కల్పించాక ఈ సంఖ్య 2 వేలకు పెరిగిందని తెలిపారు. -
నెల రోజుల్లో డయాలసిస్ సేవలు
నాలుగు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు ప్రారంభమైన టెండర్ల ప్రకియ పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో వైద్యసేవలు ఎంజీఎం ఆస్పత్రిపై తగ్గనున్న బారం ఎంజీఎం : ప్రభుత్వ ఆస్పత్రుల్లో కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు జిల్లాలోని వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులలో డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నర్సంపేట, మహబూబాబాద్. జనగామ, ఏటూరునాగారం ఆస్పత్రుల్లో పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రారంభించనున్నారు. నెల రోజుల్లోనే ఈ నాలుగు ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించేలా రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా టెండర్లు సైతం పిలిచారు. ఎంజీఎం ఆస్పత్రిపై తగ్గనున్న బారం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం నాలుగు జిల్లాల నుంచి కిడ్నీ వ్యాధి బాధితులు డయాలసిస్ చేసుకునేందుకు ఎంజీఎం ఆస్పత్రిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో డయాలసిస్ సేవలు కొనసాగుతుండగా సుమారు 300 మంది రోగులు రోజూ ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఒక్కోరోగికి నెలకు 8 నుంచి పదిసార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. రోజురోజుకు రోగులు పెరుగుతుండడంతో ఎంజీఎం ఆస్పత్రిలో డయాలసిస్ యూనిట్లు సరిపోక పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలో త్వరలో ఏర్పాటు చేసే డయాలసిస్ కేంద్రాలతో ఆయా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తొలగడంతో పాటు మెరుగైన సేవలందుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఒక్కో డయాలసిస్ కేంద్రానికి రూ.50 లక్షలు ఖర్చు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే 34 డయాలసిస్ కేంద్రాల్లో భాగంగా జిల్లాలో నాలుగు ఆస్పత్రుల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనుందని వైద్యవిధాన పరిషత్ జిల్లా కోర్డినేటర్ ఆకుల సంజీవయ్య తెలిపారు. ఒక్కో ఆస్పత్రిలో నాలుగు యూనిట్లను ఏర్పాటు చేసేవిధంగా ప్రతిపాదనలు చేశామన్నారు. ఒక్కో ఆస్పత్రిలో ఏర్పాటు చేసే డయాలసిస్ సెంటర్‌కు రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని లె లిపారు. జిల్లాలో ప్రస్తుతం వంద పడకలతో మహబూబ్‌బాద్, జనగామ, 50 పడకలతో నర్సంపేట, 30 పడకలతో ఏటూరునాగారం ఆస్పత్రులు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఆస్పత్రుల్లో సూపర్‌స్పెషాలిటీ సేవలైన నెప్రాలజీ, యురాలజీ వంటి విభాగంలో అందుబాటులోకి రావడం వల్ల పేదలకు మెరుగైన సేవలు అందుతాయని, ముఖ్యంగా ఏటూరునాగారం వంటి ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.