సాక్షి, అమరావతి: వచ్చే పది రోజులూ అత్యంత కీలకం కానుంది. ఈ గడువులో కమ్యూనిటీ స్ప్రెడ్ (కరోనా సోకిన వ్యక్తితో ఎలాంటి సంబంధమూ లేని వ్యక్తులకు సోకడం)ను అరికట్టగలిగితే కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడే అవకాశాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ చేపట్టిన చర్యలు ఒక ఎత్తు అయితే.. ఇకపై జాగ్రత్తగా ఉండటం మరో ఎత్తు అంటున్నారు. వైరస్ వ్యాప్తి అనేది సామాన్య జనంలోకి వెళ్లకుండా ఉండటమనేది పూర్తిగా ప్రజల మీదే ఆధారపడి ఉందని, వారు కనీస జాగ్రత్తలు తీసుకుంటే ఆ దశకు వెళ్లకుండా కాపాడుకునే అవకాశాలుంటాయని స్పష్టం చేస్తున్నారు.
పాజిటివ్ కేసులన్నీ విదేశాల నుంచి వచ్చినవే..
► ఏపీలో నమోదైన పాజిటివ్ కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారివే.
► ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రాకపోకలను నియంత్రిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య పూర్తిగా నిరోధించినట్లయ్యింది.
► ఇప్పటికే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ వైద్య పరిశీలనలో ఉన్న వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించగలిగితే ప్రమాదం నుంచి గట్టెక్కే అవకాశాలున్నాయి.
► మన రాష్ట్రానికి వివిధ దేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య సుమారు 13 వేల వరకూ ఉంది.
► ఈ నెల 29కి 6 వేల మందికి 14 రోజులు పరిశీలన పూర్తవుతుంది. మిగతా వారికి ఏప్రిల్ 3తో పూర్తవుతుంది.
► ఇది పూర్తయ్యే వరకూ వైరస్ వ్యాప్తిని నిరోధిస్తే సమస్య నుంచి గట్టెక్కినట్లే. ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటే గనుక ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మన చేతుల్లో ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
► ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులెవరైనా స్వీయ నిర్బంధంలో లేకుండా ఉంటే ఇప్పటికైనా వాళ్లు ఆ చర్యలు తీసుకోవాలని వివిధ మాధ్యమాల ద్వారా ప్రజారోగ్య శాఖ విజ్ఞప్తి చేస్తోంది.
చేపట్టిన చర్యలివీ..
► ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్, స్పెయిన్, అమెరికా, చైనా వంటి దేశాలు కరోనా హైరిస్క్ దేశాలుగా ప్రకటించబడ్డాయి.
► ఆ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం.
► విమానాల్లో వచ్చే వారిని క్వారంటైన్‌కు తరలించడం.
► తరచూ వారి నమూనాలు సేకరించి పరీక్షించడం.
►పైన పేర్కొన్న దేశాల నుంచి వచ్చిన వారు.. ఎవరెవరితో తిరిగారో జల్లెడ పట్టి గుర్తించడం.
► ఆ వ్యక్తి ఉన్న ఇంట్లో సభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించి వైద్య పరిశీలన చేయడం.
► ఎవరైనా సహకరించకపోతే వారిని నిర్బంధంగానైనా తరలించడం.
ఏరియా ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక పడకలు
బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లోనే కాకుండా ఏరియా ఆస్పత్రుల్లోనూ కరోనా వైరస్ లక్షణాలున్న వారికి ప్రత్యేక పడకల ఏర్పాటు.
► తణుకు, తాడేపల్లి గూడెం, జంగారెడ్డి గూడెం, నూజివీడు, గుడివాడ, బాపట్ల, నరసరావుపేట, చీరాల, కందుకూరు, గూడూరు, కావలి, కుప్పం, శ్రీకాళహస్తి, పలమనేరు, నగరి, కదిరి, గుంతకల్, ఆదోని, పులివెందుల ఆస్పత్రుల్లో మొత్తం 142 ప్రత్యేక పడకల ఏర్పాటు.
►వీటితోపాటు 9 ప్రత్యేక వెంటిలేటర్ల సదుపాయం.
ప్రైవేట్ యాజమాన్యాలకు శిక్షణ
► కరోనా వైరస్ లక్షణాలున్న వారికి వైద్యమందించేందుకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 900 ప్రత్యేక పడకలు ఏర్పాటు చేశాం. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు ఈ నెల 24వ తేదీన ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. వారు నిబంధనల మేరకు రోగులకు వైద్యం అందించాల్సి ఉంటుంది.
– డాక్టర్ ఎ.మల్లికార్జున, సీఈవో, ఆరోగ్యశ్రీ
Comments
Please login to add a commentAdd a comment