డ్యూటీ చేసేందుకు బాయిమీదికి వెళ్లిన మల్లయ్యకు ఛాతిలో నొప్పి.. హుటాహుటిన అంబులెన్స్‌లో సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమించిందని హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. అయితే మల్లయ్యను అంబులెన్స్‌లో తరలిస్తుండగా వైద్యం అందక మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలాడు. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే.. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు గోదావరిఖనిని ఆనుకొని ఉన్న ఐదు జిల్లాల వాసులు ఎదుర్కొంటున్న దుస్థితి.
గోదావరిఖని(రామగుండం) : పారిశ్రామిక ప్రాంతంలో వైద్యకళాశాల ఏర్పాటు కలగా మారింది. సింగరేణి బొగ్గు గనులు, ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులు విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కార్మిక కుటుంబాలు, కార్మికుల పిల్లలు ఎక్కువగా ఉన్నారు. దీంతో అందరికీ అందుబాటులో ఉండేలా గోదావరిఖనిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని గతఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అనంతరం ఐదు జిల్లాలకు చెందిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి కళాశాల విషయం ఊసెత్తలేదు.
కార్మికులే ఎక్కువ..
పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో కార్మిక కుటుంబాలతోపాటు మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వేల సంఖ్యలో కార్మికులు ఉన్నారు. రామగుండంలో ఎన్టీపీసీలోనూ వేలాది మంది ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ కూడా కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. అతిపెద్ద సంస్థలైన ఎన్టీపీసీ, సింగరేణి సహకారంతో రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని గతంలో సీఎం కేసీఆర్ తలిచారు. 2014 ఎన్నికల సమయంలో గోదావరిఖని, మంథని ప్రచారానికి వచ్చిన సమయంలో తమను గెలిపిస్తే సింగరేణి, ఎన్టీపీసీ సంస్థల సహకారంతో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటైతే కార్మికులతోపాటు ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రావడంతోపాటు కార్మికుల పిల్లలకు వైద్య విద్యకూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
అందని వైద్య సేవలు..
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని మందమర్రి, చెన్నూరు, శ్రీరాంపూర్, బెల్లంపల్లిలో సింగరేణి ఆస్పత్రులు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో వైద్యనిపుణులు లేకపోవడంతో కార్మికులు వారి కుటుంబాలు వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులు.. హైదరాబాద్, కరీంనగర్ లాంటి నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లిలో గతంలోనే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలుగా ఏర్పడిన తర్వాత అక్కడి ఆస్పత్రులను ప్రభుత్వం ఏరియా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేసింది. కానీ.. ఏ ఆస్పత్రిలోనూ రోగులకు సరిపడా సౌకర్యాలు కల్పించలేదు. వైద్యులను నియమించలేదు.
పెరిగిన ప్రసవాల సంఖ్య..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ ప్రభావంతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఆస్పత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు, వైద్యులు లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. వైద్యుల కొరత కారణంగా కాన్పుల సమయంలో శిశువులు మృతి చెందిన సంఘటనలూ ఉన్నాయి.
సింగరేణి కార్మికులకు వైద్యం దూరం..
సింగరేణి ఆస్పత్రుల్లో కార్మికులకు వారి కుటుంబాలకూ సరైన వైద్యసేవలు అందడంలేదు. కార్మికుడు ప్రమాదశాత్తు గాయపడినా.. విధినిర్వహణలో గుండెపోటుకు గురైనా వెంటనే ఆయా జిల్లాల్లోని ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడ నిపుణులు లేకపోవడంతో సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి హైదరాబాద్‌కు రెఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లే వరకు పరిస్థితి విషమంగా ఉన్న కార్మికులు మధ్యలోనే మృతిచెందిన సంఘటనలున్నాయి. అంతేకాదు.. పట్టణ ప్రాంతాలకు వెళ్లిన రోగులు, వారి కుటుంబ సభ్యులకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గని ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడూ తక్షణ వైద్య సేవలు అందకపోవడం గమనార్హం.
వైద్య కళాశాల ఏర్పాటైతే..
గోదావరిఖనిలో వైద్య కళాశాల ఏర్పాటుచేస్తే ప్రజలకు, కార్మికులు, కార్మికుల కుటుంబాలకు అత్యున్నత వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. కనీసం 500 పడకల సామర్థ్యంతో అన్నిరకాల వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది. ఐసీయూ, ట్రామా, న్యూరో, ఆర్థో తదితర సేవలు అందనున్నాయి. ప్రాణాపాయస్థితిలో వచ్చినవారిని సత్వరసేవలు పొందే వీలుంది. పోస్టుమార్టం సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసుతలకు ఒకే చోట వైద్యం అందే అవకాశం ఉంటుంది. మరోవైపు ఉపాధి అవకాశాలూ మెరుగుపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment