అప్పులు తీర్చలేకే...
ఇబ్రహీంపట్నం : ఇంటిని సక్రమ మార్గంలో నడపాల్సిన వ్యక్తే చెడుమార్గంలో పయనించాడు. దీంతో ఆనందంగా గడపాల్సిన ఆ కుటుంబం అర్ధాంతరంగా కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటుపల్లి వ్యాగన్ వర్క్‌షాపులో ఆరేపల్లి సత్యనారాయణ(39) హెల్పర్‌గా పనిచేస్తూ రైల్వే కాలనీలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. అతడికి భార్య పద్మ, కుమారుడు రామకృష్ణ(14) ఉన్నారు.
కుమారుడు విజయవాడ వన్‌టౌన్‌లోని రాజా హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కొంతకాలంగా సత్యనారాయణ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. భార్య ఎంత చెప్పినా వినేవాడు కాదు. అప్పులు పెరిగిపోయాయి. వాటిని బంధువులు కూడా తీర్చలేకపోయారు. అప్పులిచ్చినవారు ఒత్తిడి చేస్తుండటంతో ఏమీ చేయలేక విషయాన్ని భార్యకు చెప్పాడు. అప్పు తీర్చే అవకాశం లేకపోవడంతో ఆత్మహత్యలే శరణ్యమని ఆ కుటుంబం భావించి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
ఈ నెల 14న సత్యనారాయణ, పద్మతోపాటు కుమారుడు రామకృష్ణ కలిసి గుంటుపల్లి వద్ద కృష్ణా నదిలో దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. గొల్లపూడి వద్ద కృష్ణానది పాయలో శుక్రవారం పద్మ మృతదేహాన్ని విజయవాడ వన్‌టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ, రామకృష్ణ మృతదేహాలను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
వర్కషాప్లో విషాదఛాయలు
సత్యనారాయణ కుటుంబం ఆత్మహత్యతో గుంటుపల్లిలోని వ్యాగన్ వర్క్‌షాపులో విషాదం నెలకొంది. అందరితో కలివిడిగా ఉండే పద్మ ఇక లేదంటూ స్నేహితురాళ్లు విలపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కాలనీవాసులను కలచివేసింది. సత్యనారాయణ స్వస్థలం విద్యాధరపురం. కుమారుడితోపాటు కోడలు, మనవడు మరణించారని తెలియడంతో సత్యనారాయణ తండ్రి ఉమామహేశ్వరరావు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.