అర్జున వెనుక.. అమ్మానాన్న
కృష్ణార్జునులు డబుల్స్ ఆడి...కురుక్షేత్రంలో విజయం సాధించారు. సిక్కీరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి.. ‘ఆడేది నువ్వు. ఆడించేది నీ ప్రతిభ’అంటూ కూతుర్ని క్రీడా కురుక్షేత్రానికి సిద్ధం చేశాడు. ఆ అమ్మాయి ఆడింది. ‘అర్జున’ అవార్డు గెలిచింది. సిక్కీరెడ్డి ‘డబుల్స్’లో కాంస్య కనకాలను, రజతాలను సాధించడం వెనుక.. తండ్రి కృషి మాత్రమే కాదు...తల్లి కష్టం కూడా ఉంది. ఇద్దరూ కలిసి ఆడించారు. దేశానికొక క్రీడాకారిణిని అందించారు.
అర్జునుడు నేల మీదనున్న నీటిలోకి చూస్తూ పైకప్పుకున్న మత్సా్యన్ని ఛేదించాడు. ఇది విలుకాడిగా పరిణితి చెందిన తర్వాత. అంతకంటే ముందు.. చాలా చిన్నప్పుడు.. అంటే... విలువిద్య మొదలుపెట్టేటప్పుడు ‘ఎదురుగా ఏం కనిపిస్తోంది’ అని ద్రోణాచార్యుడు అడిగితే ‘పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది’ అన్నాడు. అదే స్ఫూర్తితో బ్యాడ్మింటన్ ఆడుతోంది అర్జున అవార్డు గ్రహీత సిక్కీరెడ్డి. ప్రత్యర్థి స్థానంలో కాబోయే భర్త సుమీత్ ఉన్నప్పుడు కూడా తనకు ‘కనిపించేది ప్రత్యర్థి ఆటగాడు మాత్రమే’ అన్నారామె. లక్ష్యం మీద అంతటి ఏకాగ్రత, ఉండబట్టే ఆమెను అంత పెద్ద అవార్డు వరించిందనిపించింది ఆమెతో మాట్లాడుతున్నప్పుడు.
నాన్న నాటారు.. అమ్మ పెంచారు
నేలకుర్తి సిక్కీ రెడ్డి పుట్టింది నల్లగొండ జిల్లా కోదాడలో. ఆమె సొంతూరు వరంగల్ (అవిభజిత) జిల్లా జయపురం. పెరిగింది హైదరాబాద్‌లో. ఎనిమిదేళ్ల వయసులో పట్టుకున్న రాకెట్‌ని పాతికేళ్లు వచ్చినా వదలకపోవడమే ఆమె విజయరహస్యం. తండ్రి కృష్ణారెడ్డి నేషనల్ వాలీబాల్ ప్లేయర్. పిల్లలిద్దరినీ క్రీడాకారులను చేయాలని ఉండేదాయనకు. సెలవులు వస్తే చాలు.. కొడుకు, కూతురు ఇద్దరినీ సమ్మర్ క్యాంపులకు తీసుకెళ్లేవారు. సిక్కీ రాకెట్ పట్టుకోవడంలో ఈజ్ ఉందని, బ్యాడ్మింటన్‌లో కోచింగ్ ఇప్పించమని చెప్పేవారు ఆమె ఆటను చూసినవారు. అది సిక్కీ బ్యాడ్మింటన్ క్రీడాప్రస్థానానికి శ్రీకారం. అలా సిక్కీ అనే మొక్కను వాళ్ల నాన్న బ్యాడ్మింటన్ తోటలో నాటారు. స్పోర్ట్స్‌కు అవసరమైన మెటీరియల్ సేకరణ నుంచి టోర్నమెంట్లకు తీసుకెళ్లడం వంటివన్నీ తల్లి మాధురి చూసుకునేవారు. ‘‘క్రీడాకారులను తయారు చేయడం చిన్న విషయం కాదు, అమ్మానాన్నలు తమ జీవితాన్ని పిల్లల కోసమే అంకితం చేయాల్సి ఉంటుంది. మా అమ్మానాన్న నా కోసమే జీవించారు’’ అంటూ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు సిక్కీరెడ్డి.
ఇల్లు కొనలేకపోయారు
‘‘అన్నయ్యకు, నాకు కోచింగ్ ఇప్పించడం కోసం అమ్మ చాలా వదులుకోవాల్సి వచ్చింది. చెన్నై, కొచ్చి, బెంగళూరు, చండీగఢ్, పుణే.. ఇలా ఏడాది పొడవునా ఎక్కడో ఓ చోట టోర్నమెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఇద్దర్నీ తీసుకెళ్లేది. ప్రాక్టీస్ చేయడం, ఆడటం తప్ప మరొకటి తెలిసే వయసు కాదు మాది. మేము ఏమి తినాలో కూడా అమ్మే చూసుకునేది. డబ్బు చాలా ఖర్చయ్యేది. ఒక దశలో నాన్నకు వచ్చే డబ్బు సరిపోక అమ్మ తన నగలను తాకట్టు పెట్టింది. అలాంటి రోజుల్లో కనుక ఆమె.. ‘మన ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఆటను కొనసాగించడం కష్టం, మామూలుగా స్కూలుకి వెళ్లండి’ అని చెప్పి ఉంటే.. మేము అలాగేనని తలూపేవాళ్లం కదా. మమ్మల్ని క్రీడాకారులుగా తయారు చేయడానికి అమ్మానాన్న చాలా రాజీలు పడాల్సి వచ్చింది. అన్నయ్యకు యాక్సిడెంట్ కావడంతో ఇంటర్ తర్వాత ప్రాక్టీస్ ఆపేసి చదువుకే పరిమితమయ్యాడు. ఇబ్బందులు పడుతూ కూడా నా ప్రాక్టీస్‌ని కొనసాగించారు. నా కోచింగ్ కోసం ఎన్ని ఇళ్లు మారారో చెప్పలేను. దిల్షుక్నగర్, బాగ్‌లింగంపల్లి, గచ్చిబౌలి, లింగంపల్లి, అత్తాపూర్ తర్వాత ఇప్పుడు మాదాపూర్‌లో ఉంటున్నాం. అది కూడా అద్దె ఇల్లే. నా కోచింగ్ అనేది లేకపోతే ఎప్పుడో ఇల్లు కొనుక్కోగలిగే వాళ్లు.
ఏడాది విరామం
క్రీడాకారిణిగా మంచి ఆహారం తీసుకునే దాన్ని, అలాగని ప్రత్యేకమైన ఆహారం ఏమీ లేదు. రాగి వంటి మన నేచురల్ఫుడ్డే మంచిది. గుడ్లు, చికెన్, తాజా పళ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసేది అమ్మ. బయటి ఫుడ్ పెట్టేది కాదు. ఇప్పుడు నాలుగేళ్ల నుంచి స్పోర్ట్స్ డైటీషియన్ ఇచ్చిన చార్ట్ ప్రకారం తీసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి కూడా నేను ఆడుతున్నంత సేపూ ఎక్కడ గాయాలు తగులుతాయోనని చూసుకుంటూ ఉండేది అమ్మ. లెవెన్త్ క్లాస్‌లో నెల్లూరులో ఉడెన్ కోర్టులో జంప్ చేసినప్పుడు మోకాలి దగ్గర టప్ మన్న శబ్దం వినిపించింది. రెస్ట్ సరిపోతుందని, సర్జరీ అవసరం లేదనుకున్నాం. మలేసియాలో జూనియర్ ఏసియన్ ఆడుతున్నప్పుడు మోకాలికి గాయం అయింది. నాలుగు నెలల పాటు అడుగు నేల మీద పెట్టలేక పోయాను. పూర్తిగా బెడ్‌రెస్ట్, మూడు సర్జరీలయ్యాయి. పూర్తిగా కోలుకోవడానికి ఏడాది పట్టింది. ‘నేను తిరిగి ఆడగలుగుతానా అని గోపీ అన్న (కోచ్ గోపీచంద్) ను అడిగేదాన్ని. అన్నకు కూడా అలాగే గాయమైంది. అదే మాట చెబుతూ ‘డాక్టర్లు చెప్పినంత ఆలస్యం ఏమీ కాదు, ఒక నెలలో నడుస్తావు’ అంటూ బాగా ధైర్యం చెప్పారు.
ప్రతి ఆటా ఒక పాఠమే!
క్రీడాకారులను తీర్చిదిద్దడానికి కోచ్‌లు పడే శ్రమ ఇంత అని చెప్పలేం. ఆట నేర్పించి వదిలేయరు. టోర్నమెంట్లకు వస్తారు. ప్రాక్టీస్‌లో చూపించినంత నైపుణ్యం పోటీలో చూపిస్తున్నామా లేదా అని చూస్తారు. ఎక్కడైనా పొరపాటు చేస్తున్నామా అనేది గమనిస్తారు, మొత్తంగా మా ఆటను అధ్యయనం చేస్తూ నోట్స్ రాసుకుంటారు. ఆ పొరపాట్లు మళ్లీ చేయకుండా శిక్షణనిస్తారు. గెలుపు కొన్నిసార్లు మనవైపు ఉంటుంది, కొన్నిసార్లు ప్రత్యర్థి వైపు ఉంటుంది. అయితే ప్రతి పోటీలోనూ ఏదో ఒకటి నేర్చుకుంటాం. ప్రత్యర్థి ఆట తీరులో కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలను కూడా తెలుసుకోగలుగుతాం.
సౌకర్యాలు పెరిగాయి
మా చిన్నప్పటి కంటే ఇప్పుడు క్రీడలకు సౌకర్యాలు బాగా పెరిగాయి. ప్రాక్టీస్‌కు అనువైన మంచి వాతావరణం ఉంది. అయితే అప్పట్లో బ్యాడ్మింటన్ షటిల్ రూపాయికొచ్చేది, ఇప్పుడది వందకు పైనే ఉంది. అప్పుడు ఐదొందలకు వచ్చిన షూస్ ఇప్పుడు ఐదువేలు. ఇక రాకెట్ ధరలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతో ఇది రిచ్ పీపుల్ గేమ్ అనే మాట వినిపిస్తోంది. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఇన్కమ్ కూడా దానికి తగ్గట్టే పెరిగింది. ఖర్చులకు భయపడి స్పోర్ట్స్ మీద ఇష్టాన్ని వదులుకోనక్కర్లేదనే చెప్తాను. నాకు మొదట్లో స్పాన్సర్షిప్ పెద్దగా రాకపోయినా ఇప్పుడు కొంత బెటర్‌గానే ఉంది. నైపుణ్యం ఉండి, కోచింగ్ తీసుకోవడానికి కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించని వాళ్లకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహాయం చేస్తోంది. స్పోర్ట్స్‌లో రాణించడంతోపాటు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఉద్యోగావకాశాలు చాలా ఉన్నాయి. అలాగని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కోసమే ఆట ఆడాలనుకుంటే ఎప్పటికీ రాణించలేరు. ఆట మీద వ్యామోహంతోనే ఆడాలి. నాకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగం ఇచ్చింది. ప్రాక్టీస్‌కు తగిన వెసులుబాటు ఇస్తున్నారు. 2020 ఒలింపిక్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను.
ఆనందాన్ని కొలవలేను
బ్యాడ్మింటనే నాకు జీవితం. అర్జున అవార్డు అందుకోవడం ఎలా ఉందంటే... ‘ఇలా’ అని చెప్పడానికి మాటలు తెలియడం లేదు. దేశం నన్ను అక్కున చేర్చుకున్నందుకు ‘ఇంత’ అని చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆ ఆనందాన్ని కొలిచే కొలబద్ద ఉండదు. దేశానికి గుర్తింపు తేవాలనే కోరిక క్రీడాకారులందరికీ ఉంటుంది. అలా దేశానికి అందిన గౌరవంలో నా పాత్ర ఉండాలనేదే నా ఆకాంక్ష.’’
సిక్కీ... నాన్న పెట్
సిక్కీ పేరు సింధుజ. ఇంట్లో సిక్కీ అని పిలిచేవాళ్లం. వాళ్ల నాన్నకు కూతురంటే చెప్పలేనంత మురిపెం. స్కూల్లో చేర్చేటప్పుడు కూడా అదే పేరు చెప్పారు. సిక్కీనా... ఆశ్చర్యంగా అడిగినప్పుడు రెడ్డి జత చేశారు. అలా సిక్కీరెడ్డి అయింది. ఇప్పటికీ అలా ఎందుకు చేశారని ఎవరైనా అడిగితే ‘అందరూ నాలాగే ముద్దుగా పిలవాలని’ నవ్వుతారు. గాయపడిన తర్వాత ఆడటానికి భయపడే పిల్లల్ని చాలామందిని చూశాను. కానీ సిక్కీ అలా భయపడలేదు. వాళ్ల నాన్నే ఆమె ధైర్యం. తను మంచి సింగిల్స్ ప్లేయర్. అండర్ 19 సింగిల్స్‌లో హ్యాట్రిక్ విజయాలు సాధించింది. కాలి గాయం తర్వాత డబుల్స్ మీద కాన్సెంట్రేట్ చేసింది. మా అమ్మాయి ఆట కోసం మేము చాలా రాజీ పడిన మాట నిజమే. బంధువుల పెళ్లిళ్లు, ఇతర కార్యాలకు వెళ్లడం కుదిరేది కాదు. కొందరు అర్థం చేసుకునే వాళ్లు, కొన్ని నిష్టూరాలు కూడా ఉంటాయి. నేననే కాదు.. స్పోర్ట్స్ పర్సన్ పేరెంట్స్ అందరి పరిస్థితీ దాదాపుగా ఇలాగే ఉంటుంది. వెనక్కి గుర్తు చేసుకుంటే నాకు బాధనిపించేది ఒక్కటే. మా నాన్న పండుగలకు పిలిచినా వెళ్లలేకపోయేదాన్ని. ‘నా బిడ్డని చూడాలని నాకున్నట్లే, నీ బిడ్డని బాగా చూసుకోవాలని నీకు ఉండడం తప్పేమీ కాదులే’ అనేవారు. ప్రాక్టీస్ లేని రోజుల్లో వెళ్లి కనిపించినా సరే, పండక్కి రాలేదనే బాధ వ్యక్తమయ్యేది ఆయన మాటల్లో. నాన్న ఉండి ఉంటే... సిక్కీ అర్జున అవార్డు అందుకోవడం చూసి ఎంత సంతోషించేవారో. సిక్కీ అర్జున అవార్డు అందుకున్నప్పటి నుంచి నాన్న తరచూ గుర్తుకు వస్తున్నాడు.
– మాధవి, సిక్కీరెడ్డి తల్లి
డైలీ రొటీన్
ఉదయం ఆరున్నర నుంచి రెండు గంటల పాటు ప్రాక్టీస్, తర్వాత ఓ గంట సేపు బ్రేక్ ఫాస్ట్ కోసం బ్రేక్. పది నుంచి పన్నెండున్నర – ఒంటి గంట వరకు రెండవ సెషన్ ప్రాక్టీస్. లంచ్ అవర్ తర్వాత గంట సేపు నిద్రపోతాను. సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకు ప్రాక్టీస్, అరగంట సేపు రికవరీ మసాజ్ ఉంటుంది. అప్పుడు ఇంటికి వస్తే కొంత సేపు అమ్మానాన్నలతో కబుర్లు, అది రిలాక్సేషన్ టైమ్. సుమీత్ కూడా అప్పుడే కాల్ చేస్తాడు. సుమీత్ చిన్నప్పటి నుంచి తెలుసు. బాగా అల్లరి. అంకుల్ (సుమీత్ నాన్నగారు) అథ్లెటిక్ కోచ్. అంకుల్ దగ్గర మాట వినడని బ్యాడ్మింటన్‌లో చేర్చారు. సుమీత్‌తో కలిసి ఆడలేదు, కానీ గత ఏడాది సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ మిక్స్డ్ డబుల్స్‌లో ఒకరితో ఒకరం ఆడాం.
– సిక్కీరెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత
ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి