ఆత్మహత్య చేసుకోవడం ఇలా అంటూ..
చదువంటే విరక్తి పుట్టిందో.. మరి ఏమైందో తెలియదు గానీ, ఓ కుర్రాడు ఫేస్బుక్ లైవ్‌లో వీడియో అప్లోడ్ చేసి, హోటల్ 19వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వీడియోలో.. ఆత్మహత్య ఎలా చేసుకోవాలో చెబుతూ ఓ ట్యుటోరియల్ పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘోరం ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో చోటుచేసుకుంది. అర్జున్ భరద్వాజ్ అనే ఈ యువకుడు హోటల్ గది కిటికీ అద్దం పగలగొట్టి అక్కడినుంచి కిందకు దూకేశాడు. అంతకుముందు అతడు షూట్ చేసిన లైవ్ వీడియోలో అతడు సిగరెట్ కాల్చి, మద్యం తాగి, ఆహారం తీసుకుంటూ కనిపించాడు. ఒక నిమిషం 43 సెకండ్ల పాటు ఆ వీడియో షూట్ చేశాడు. రూం నెం. 1925లోని అతడి టేబుల్ మీద చిన్న చిన్న సూసైడ్ నోట్లు ఏకంగా తొమ్మిది కనిపించాయి.
తెల్లవారు జామున 3 గంటల సమయంలో రూం తీసుకున్నాడని, రోజంతా రూంలోనే ఉండిపోయాడని పోలీసులు తెలిపారు. తాను తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నానని, జీవితంతో విసుగెత్తిపోయానని కూడా అతడు సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. తన డిప్రెషన్‌కు ఎవరూ కారణం కాదని చెప్పడమే కాక.. తన తల్లిదండ్రులకు సారీ కూడా చెప్పాడు. అరుణ్ భరద్వాజ్ ముంబైలోని నస్రీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో చదువుతున్నాడు. హోటల్ ప్రాంగణంలో భరద్వాజ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని ఓ సెక్యూరిటీ గార్డు చూశాడు. వెంటనే అతడిని లీలావతి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. నాలుగేళ్లుగా అతడు అంధేరిలో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నట్లు విచారణలో తేలింది. మూడో సంవత్సరం పరీక్షలలో ఫెయిల్ కావడం వల్లే డిప్రెషన్‌కు లోనై ఉంటాడని అనుమానిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త పెద్దకొడుకే అర్జున్ భరద్వాజ్. కొడుకు ఆత్మహత్య విషయం తెలిసి ఆయన ముంబైకి హుటాహుటిన తరలి వచ్చారు.