పదమూడేళ్లకే అరుదైన ఘనతలు!!
మనసుంటే మార్గం ఉంటుంది... ప్రతిభకు వయసు ఏమాత్రం అడ్డంకి కానే కాదు అని నిరూపిస్తున్నాడు డల్లాస్‌కు చెందిన పదమూడేళ్ల వండర్ కిడ్ అర్నవ్ కొప్పాల. 11 ఏళ్లకే సైన్స్ ఫిక్షన్ నవల రచించి.. అమెరికా స్కూలు చరిత్రలో అత్యంత చిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన తొలి బాలుడిగా గుర్తింపు పొందాడు.. జీబైట్ అనే సంస్థను నెలకొల్పాడు..ఇవే కాదు ఇలాంటి ఇంకెన్నో ఘనతలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ తెలుగు తేజం.
సాక్షి, ప్రత్యేకం : ‘నిజంగా ఏదైనా సాధించాలనుకుంటే జీవితంలో ఎటువంటి హద్దులు ఉండవు.. ఒకవేళ ఉన్నాయి అన్పిస్తోంది అంటే అవి మనకి మనంగా మన మెదడుతో నిర్ణయించుకున్నవే..’ ఇదే అర్నవ్ నమ్మే సిద్ధాంతం. ప్రతీ విషయంలోనూ తన మనసుని మాత్రమే అనుసరించే గుణం అతడి సొంతం. అందుకే మానవతావాదిగా, పొలిటికల్ ఆక్టివిస్ట్గా గుర్తింపు పొందాడు. ఎందరో ప్రముఖులతో కలిసి పనిచేస్తున్నాడు. రచయితగా పేరు పొందాడు. అంతేకాదు నేటి ఆధునిక యుగంలో టెక్ బానిసలుగా మారి బంధాలకు, ఆప్యాయతలకు దూరమవుతున్న పిల్లలు, పెద్దలకు ఆ లోటు లేకుండా చేసేందుకు జీబైట్ అనే సంస్థను నెలకొల్పాడు.
ఇలా చిన్న వయస్సులోనే పెద్ద బాధ్యతలను తలకెత్తుకున్న అర్నవ్ ఎన్నో పోటీల్లో పాల్గొని 121 ట్రోఫీలు, 82 మెడల్స్ సాధించి ఔరా అనిపించాడు. అంతేకాదు తన రచనలకు గుర్తింపుగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, లారా బుష్, ఇర్వింగ్ మేయర్ వంటి ప్రముఖులచేత ప్రశంసలు అందుకున్నాడు. ఇలా ఒక్కటేమిటి అడుగుపెట్టిన ప్రతీరంగంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు సెవంత్ గ్రేడ్ చదువుతున్న అర్నవ్.
సైన్స్ అంటే ఎంతో మక్కువ..
వండర్ కిడ్ అర్నవ్‌కు సైన్స్ అంటే ఉన్న ఇష్టమే పదకొండేళ్లకే సైన్స్ ఫిక్షన్ నవల రచించేలా చేసింది. అంతేకాదు 2016లో పెంటగాన్ స్ప్రింగ్స్, 2017లో బ్రేకింగ్ బౌండరీస్, 2018లో ది జర్నీ వంటి నవలల ద్వారా రచయితగా గుర్తింపు తెచ్చిపెట్టింది. కాగా ఈ మూడు నవలలను అమెజాన్.కామ్ పబ్లిష్ చేసింది. అయితే వీటి ద్వారా తనకు లభించిన పారితోషికం, రాయిల్టీలను పెడియాట్రిక్ క్యాన్సర్ సెంటర్‌కు డొనేట్ చేసి మరోసారి పెద్ద మనసు చాటుకున్నాడు అర్నవ్.
అర్నవ్ కుటుంబం..
అర్నవ్ తల్లిదండ్రులు రీనా, శ్రీనివాస్ కొప్పాల. చిన్నతనం నుంచే అర్నవ్ ఇలా వివిధ రంగాల్లో రాణించడంలో వారిద్దరూ ఎంతో కీలక పాత్ర పోషించారు. ప్రతీ విషయంలో స్వేచ్ఛ ఇచ్చి తనకు తానుగా ఎదిగేలా ప్రోత్సహించారు. చిన్న వయస్సులోనే అర్నవ్ సాధిస్తున్న ఘనతలకు ఆనందపడుతూనే.. మరోవైపు అతడు చేపడుతున్న కార్యక్రమాలకు అండగా నిలుస్తూ స్ఫూర్తి నింపుతున్నారు.
-రామ్ అన్నాడి