కోణాదిత్యుడికి కోటి దండాలు..
సూర్యభగవానుడు అన్ని జీవులపట్ల సమదృష్టి కలిగిన వాడు. ఆరోగ్యప్రదాత. సకల శాస్త్రపారంగతుడు, మహా వ్యాకరణవేత్త అయిన ఆంజనేయునికే గురువు. ఆయన లేనిదే వృక్షజాతులు మనలేవు. నేత్రవ్యాధులు, శత్రుబాధలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మండలం రోజులపాటు ఆదిత్యహృదయాన్ని పారాయణ చేస్తే ఆయా బాధలు పటాపంచలవుతాయని ప్రతీతి. సూర్యునికి ప్రపంచవ్యాప్తంగా గల ఆలయాల్లో ఒడిశా రాష్ట్రంలోని కోణార్కలో గల సూర్యదేవాలయం అత్యంత ప్రాచుర్యం పొందింది. ఆ ఆలయ విశేషాలివి...
పదమూడవ శతాబ్దంలో గంగవంశానికి చెందిన నరసింహదేవుడు నిర్మించిన కోణార్క సూర్యదేవాలయ నిర్మాణ వైశిష్ట్యం అత్యద్భుతం, అనితర సాధ్యం. ఏడుగుర్రాలు లాగుతున్నట్లుగా ఉన్న 24 చక్రాలు గల సూర్యరథంపై రాతితో నిర్మించిన ఈ ఆలయంలో కొలువై ఉంటాడు ఏడుగుర్రాల రేడు. సాక్షాత్తూ శ్రీకృష్ణుడి కుమారుడే ఇక్కడి సూర్యభగవానుడి మూర్తిని ప్రతిష్టించినట్లు ఓ ఆసక్తికరమైన కథనం ప్రాచుర్యంలో ఉంది. శ్రీకృష్ణునికి, జాంబవతికి పుట్టిన సాంబుడనే వాడు ఆకతాయితనంతో అంతఃపురస్త్రీలు స్నానం చేస్తున్న ప్రదేశానికి వెళ్లాడు. దాంతో కోపించిన శ్రీకృష్ణుడు కుష్టువ్యాధిగ్రస్థుడవు కావలసిందని సాంబుణ్ణి శపించాడు. సాంబుని ప్రార్థన మేరకు ఆ వ్యాధిని పోగొట్టుకోవాలంటే సూర్యారాధన చేయాలని చెబుతాడు కృష్ణుడు.
తండ్రి చెప్పినట్లుగా సాంబుడు సూర్యారాధనకు అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ, ఓఢ్రదేశం (నేటి ఒడిశా) చేరతాడు. అక్కడ చంద్రభాగానదిలో స్నానం చేస్తూ, అత్యంత భక్తిశ్రద్ధలతో సూర్యుని పూజిస్తుంటాడు. ఓ రోజు స్నానం చేస్తుండగా తామరపుష్పంపై కొలువై ఉన్నట్లుగా ఉన్న సూర్యభగవానుని మూర్తి నదిలో దొరుకుతుంది. ఆశ్చర్యంగా సాంబుడి వ్యాధి కూడా తగ్గిపోతుంది. అందుకు సంతోషించిన సాంబుడు సూర్యుడికి ఆలయం నిర్మించి, ఆ ప్రతిమను అందులో ప్రతిష్ఠిస్తాడు. శిథిలమైన ఆ ఆలయాన్నే నరసింహదేవుడు పునర్నిర్మించి, సూర్యవిగ్రహాన్ని పునఃప్రతిష్టించాడన్నమాట. నేత్ర, చర్మవ్యాధులతో బాధపడేవారు కోణాదిత్యుని సేవించి, తమ వ్యాధులకు ఉపశమనం పొందుతుంటారు.
- డి.వి.ఆర్.