ముప్పును ఎదుర్కొంటాం
భారత్కు సత్తా ఉందన్న వైమానిక దళం చీఫ్ అరూప్ రాహా
న్యూఢిల్లీ: అల్కాయిదా వంటి ఉగ్రవాద గ్రూపుల నుంచి భారత్కు ముప్పు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొనే సత్తా దేశానికి ఉందని వైమానిక దళం చీఫ్ అరూప్ రాహా వ్యాఖ్యానించారు. ఉపఖండంలో కార్యకలాపాల విస్తరణే లక్ష్యంగా అల్కాయిదా ఇక్కడ తన ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉన్నా.. దాన్ని ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘1965లో పాక్తో యుద్ధంలో భారత వైమానిక దళం పాత్ర’ అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సులో అరూప్ రాహా మాట్లాడారు.
తీవ్రంగా పరిగణించాల్సిందే: భారత ఉపఖండంలో జిహాద్ కోసం ‘ఖైదత్ అల్ జిహాద్’ పేరుతో అల్కాయిదా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించాలని అమెరికా భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఇస్లాంకు శత్రువుగా ముద్ర వేయాలని అల్కాయిదా కోరుకుంటోందని వారు చెబుతున్నారు. పాకిస్థాన్ తో మకాం వేసి లష్కరే తోయిబా అండతో భారత్కు అది పెద్ద ముప్పుగా పరిణమించే ప్రమాదముందని అమెరికా నిఘా సంస్థ సీఐఏ మాజీ విశ్లేషకుడు బ్రూస్ రీడెల్ హెచ్చరించారు. అయితే అమెరికా మాత్రం ఈ విషయానికి అంతగా ప్రాముఖ్యతనివ్వలేదు. మరోవైపు తాజా పరిణామంపై బంగ్లాదేశ్ కూడా అప్రమత్తమైంది.