వేరుశనగను బాగా ఆరబెట్టాలి
– ఏఆర్ఎస్ నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి
అనంతపురం అగ్రికల్చర్ : తొలగించిన వేరుశనగ పంటను బాగా ఆరబెట్టుకోవాలని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి సూచించారు. సాధారణంగా పంట తొలగించిన సమయంలో కాయల్లో తేమ 35 నుంచి 60 శాతం వరకు ఉంటుందన్నారు. అది 8 నుంచి 9 శాతానికి చేరే దాకా ఆరబెట్టుకోవాలని సూచించారు. లేకపోతే శిలీంధ్రాలు అభివద్ధి చెంది దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ విషయంలో రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు.
వాతావరణం:
నాలుగు రోజులుగా ఎక్కడా వర్షం పడలేదు. పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 35, రాత్రిళ్లు 17 నుంచి 19 డిగ్రీల డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఉదయం పూట బాగానే ఉన్నా మధ్యాహ్న సమయంలో తేమశాతం 21 నుంచి 27కు పడిపోయింది. గంటకు 4 నుంచి 7 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇదిలా ఉండగా రానున్న మూడు రోజుల్లో వాతావరణం పొడిగానే ఉంటుంది. వర్షం పడే సూచనలు లేవు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 29 నుంచి 31, కనిష్టం 19 నుంచి 21 డిగ్రీలు నమోదు కావచ్చు. గాలిలో తేమ ఉదయం 49 నుంచి 74, మధ్యాహ్నం 29 నుంచి 47 శాతం మధ్య ఉండవచ్చు. గంటకు 3 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
పంటల సమాచారం:
వర్షం పడే పరిస్థితి లేనందున జూన్, జూలైలో వేసిన వేరుశనగ, కొర్ర, సజ్జ లాంటి పంటలు తొలగించుకోవచ్చు. బెట్ట పరిస్థితులు ఏర్పడినందున అవకాశం ఉంటే పత్తి, ఆముదం, కందికి రక్షకతడి ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. కందికి ఆశించిన శనగపచ్చ పురుగు నివారణకు 5 మిల్లిలీటర్ల వేపగింజల కషాయం లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. వరిలో కాండం తొలిచే పురుగు ఆశించినందున 2.5 మిల్లిలీటర్ల క్లోరోఫైరిపాస్ లేదా 1.5 గ్రాము అసిఫేట్ లేదా 2 గ్రాములు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. సుడిదోమ నివారణకు ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల మేర కాలిబాట వదలాలి. సుడిదోమ ఆశిస్తే 330 మిల్లిలీటర్ల అప్లాడ్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అక్కడక్కడ వరిలో ఆకునల్లి ఆశించినందున 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. రబీ పంటలుగా పప్పుశెనగ, కుసమ అక్టోబర్ నెలాఖరు వరకు మంచి సమయం. నవంబర్ మొదటి వారం నుంచి రబీ వేరుశనగ పంట బోరుబావుల కింద వేసుకోవచ్చు.