తొలియత్నం: చలంగారు ఉంటే సంతోషించేవారు!
సినిమా ఒక ఆర్ట్. ఈ ఆర్ట్ స్క్రీన్ మీదినుంచి ఆడియన్స్ మైండ్లోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అది సైన్స్ అవుతుంది. ఆర్ట్‌లో ఎంత క్రియేషన్ ఉంటే, ఆడియన్స్‌లో అంత ఎమోషన్ బిల్డప్ అవుతుంది. ఈ ఆర్ట్‌నూ, సైన్సునూ ఒక సమాంతరరేఖ మీద నిలబెట్టినవాడు సినిమా చరిత్రలో సెన్సిబుల్ డెరైక్టర్‌గా నిలిచిపోతాడు. అలా కంటెంట్‌నూ, కాన్ఫిడెన్స్నూ నమ్ముకుని, సింపుల్ అండ్ బ్యూటిఫుల్ సినిమాలు తీస్తున్న డెరైక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ! అతడి మొదటి సినిమా ‘గ్రహణం’ వెనుక సంగ్రామం అతడి మాటల్లోనే...
మన సమాజంలో ఒక ద్వంద్వ ప్రవృత్తి ఉంది. స్త్రీ ఎవరితోనైనా కాస్తంత సాన్నిహిత్యంగా మెలిగితే చులకనగా మాట్లాడతారు. అదే మగాడు ఎంతమంది ఆడవాళ్లతో తిరిగితే అతనికంత క్రేజ్. ఆలోచనల్లో ఈ హిపోక్రసీ మొదటినుంచీ ఉంది. చలంగారి రచనలన్నీ సమాజపు ద్వంద్వ నీతిని చీల్చి చెండాడాయి. స్త్రీ ఆలోచనలకు స్వేచ్ఛనిచ్చాయి. సంప్రదాయ సమాజంలో భూకంపం పుట్టించాయి. కానీ ఆయన కథలు సినిమాలుగా తీసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. మొదటిసారిగా నేనా ప్రయత్నం చేసి సక్సెస్ అవడం నిజంగా నా అదృష్టం.
1996లో మొదటిసారిగా చలంగారి శేషమ్మ కథల సంపుటి చదివాను. అందులో దోషగుణం కథ దగ్గర ఆగిపోయాను. ఆయన మిగతా కథల కన్నా ఇందులో ఏదో ప్రత్యేకత కనిపించింది. దాన్ని సినిమాగా తీయాలని డిసైడయ్యాను. కానీ ఆ కథను యధాతథంగా సినిమాగా మలచడం కుదరదనిపించింది. అందులో ఇరవై శాతం మాత్రమే సినిమాకు అడాప్ట్ చేసుకోవచ్చు. అందులోనే చలం ఆలోచనల్ని దట్టించాలి.
మొదట కథను ఒక స్క్రిప్ట్‌గా రాసుకున్నాను. 1998లో కెనడాలో ఫిలిం స్కూల్‌కు అప్లై చేసినప్పుడు అదే స్క్రిప్ట్‌ను శాంపిల్ కింద పంపాను. అప్పుడు నాకు స్క్రీన్ రైటింగ్‌లో అడ్మిషన్ దొరికింది. కోర్స్ పూర్తయ్యాక, 2001లో ఇండియాకు వచ్చాను. 2003 వరకు చాలామంది చుట్టూ అవకాశాల కోసం తిరిగాను. ఈ మధ్యలో ‘చలి’ అనే షార్ట్ ఫిలిం తీశాను. మంచి అప్రీసియేషన్ వచ్చినా అవకాశాలు మాత్రం రాలేదు. అప్పటికి ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఎలా ఉండాలో నాకు అవగాహన వచ్చింది కాబట్టి ‘దోషగుణం’ స్క్రిప్ట్‌ను రీరైట్ చేశాను. అయితే ఆ పేరు పాతగా ఉండటంతో, సినిమాకి ఏ టైటిల్ పెడదామా అని తీవ్రంగా ఆలోచించాను. ఒక అపవాదు వల్ల భూస్వామి జీవితంలో గ్రహణం కమ్మింది. అతని భార్య జీవితంలోను, పనివాడు కనకయ్య జీవితంలోను కూడా గ్రహణం కమ్మింది. ఇంతమంది జీవితంలో గ్రహణం కమ్మింది కాబట్టి ఆ టైటిలే కరెక్ట్ అనుకున్నాను.
భూస్వామి తన భార్య తొడ నుండి రక్తం తీసుకునే సీన్ సినిమాకి చాలా కీలకం. అయితే ఆ సీన్ తీయడానికి ఒక కొత్త దర్శకుడిగా నేను చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు భరణిగారు, జయలలితగారు చాలా సపోర్ట్ చేశారు. ఒకరోజు హైదరాబాద్ ఫిలిం క్లబ్లో తనికెళ్ల భరణిగారు కలిసినప్పుడు చలం కథ ఆధారంగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నానని చెప్పాను. వెంటనే ఆయన పైసా తీసుకోకుండా చేస్తాను అన్నారు. ‘మరి ప్రొడ్యూసర్ ఎలా’ అన్నారాయన. ‘మా అమ్మగారు తన ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్రేక్ చేసి మూడు లక్షలిస్తానన్నారు, దాంతో చేస్తానండీ’ అన్నాను. ‘మూడు లక్షలతో సినిమా ఎలా తీస్తావయ్యా’ అని కనకధార క్రియేషన్స్ సుబ్బారావు, అంజిరెడ్డి, వెంకట్ల దగ్గరకు తీసుకెళ్లారు. వాళ్లు బడ్జెట్‌ను మరో మూడు లక్షలకు పెంచారు. అలా మా సినిమా ఊపిరి పోసుకుంది.
ఇక ఆర్టిస్ట్‌ల విషయానికొస్తే, భూస్వామి పాత్రను భరణిగారు చేస్తానన్నారు. భార్య శారదాంబ పాత్రకు జయలలితగారు బాగుంటుందనుకున్నాను. జయలలితగారికి మన సినిమాల్లో ఒక సెక్సీ ఇమేజ్ ఉంది. కానీ ఆవిడ అంతకుమించి చేయగలరని నా నమ్మకం. నా దృష్టిలో ఆవిడో ట్రెడిషనల్ బ్యూటీ. భరణిగారు కూడా మంచి ఐడియా అన్నారు. మిగతా పాత్రలకు సీరియల్స్ నుంచి, కొంతవరకు నాటకాల నుంచి తీసుకున్నాను. కనకయ్య పాత్రకు ఆర్టిస్ట్‌ను వెదకడానికి చాలా ఇబ్బందిపడ్డాను. పదిహేనేళ్ల కుర్రవాడు నడివయసు స్త్రీతో సన్నిహితంగా మెలగాలి. అలా చేయాలంటే ఆ కుర్రవాడికి ఎంతో కొంత పరిణతి కావాలి. అందుకే చాలా అన్వేషణ జరిపి తల్లావజ్జల సుందరిగారి అబ్బాయి మోహనీష్ను సెలెక్ట్ చేసుకున్నాం. తను కనకయ్య పాత్రకు జీవం పోశాడు.
ఆనాటి సమాజ వాతావరణాన్ని తలపించే లొకేషన్ కోసం చాలా వెదికాం. చివరకు అమలాపురం దగ్గర ఉన్న లక్కవరం సెలక్ట్ చేసుకున్నాం. అక్కడ ఒక మంచి ఇల్లు దొరికింది. ఒక్క ప్రాపర్టీని కూడా బయట నుంచి తీసుకురాలేదు. దాదాపు షూటింగ్ అంతా అందులోనే జరిగింది. యూనిట్ అంతా ఒకే దగ్గర ఉండి షూటింగ్ చేసుకోవడం, సాయంత్రం వచ్చాక మర్నాడు చేయాల్సిన సీన్ గురించి డిస్కస్ చేసుకోవడంతో ఒక కుటుంబ వాతావరణంలా ఉండేది. షూటింగ్ సమయంలో ఓ రెండు సంఘటనలు నన్ను తీవ్ర ఆశ్చర్యానికి లోను చేసి, కొన్నింటి పట్ల నా అభిప్రాయాన్ని మార్చివేశాయి.
కథ ప్రకారం ఒక సీన్లో తల్లిదండ్రుల మీద కోపంతో కనకయ్య కుండ విసిరికొడతాడు. అది కిందపడి పగులుతుంది. సీన్ తీయబోతుంటే ఇంటి ఓనర్ వచ్చి ‘ఇవాళ మంగళవారం, కుండ పగలగొట్టొద్దు’ అంది. మా షెడ్యూల్ ప్రకారం ఆ రోజు సీన్ పూర్తవాలి, మరో రోజు పొడిగించడానికి లేదు. ఎలా అని ఆలోచిస్తుంటే మోహనీష్... ‘సార్, నేను కుండ పగలగొడతాను, మీరు నన్ను తిట్టండి, అలా మన పనైపోతుంది’ అని ఐడియా ఇచ్చాడు. మేం సరే అన్నాం. తను కుండ పగలగొట్టాడు. ‘వాళ్లు అలా చేయవద్దన్నప్పుడు చేయడం తప్పు కదా’ అని మోహనీష్ని తిట్టాను. ఇంటావిడ రాగానే ‘ఈ రోజుల్లో కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఏంటండీ’ అన్నాను.
‘ఏవో ఉంటాయి నాయనా, ఐనా కుండ లేపే షాట్ ఈ రోజు విడిగా, పగిలిన షాట్ రేపు విడిగా తీసుకుని తరువాత రెండూ కలుపుకోవచ్చుగా’ అందావిడ. నేను ఆశ్చర్యపోయాను. మామూలు ప్రజలకు సినిమా గురించి అంతగా అవగాహన ఉండదని అప్పటిదాకా భావించిన నాకు ఈ అనుభవం కొత్త పాఠం నేర్పింది. అలాగే షూటింగ్ అయిపోయిన తరువాత కొన్ని పల్లెటూరి షాట్స్ తీస్తున్నాను. గోచీ పెట్టుకున్న ఒకతను సైకిల్ మీద మా దగ్గరికి వచ్చి ‘షూటింగ్ అయిపోయింది కదా ఇంకేం తీస్తున్నారండీ’ అన్నాడు. ‘పల్లె విజువల్స్ తీస్తున్నాం’ అన్నాను. ‘తీసుకోండి, టైటిల్స్ వేసుకోవడానికి పనికొస్తాయి’ అన్నాడు. నోట మాట రాలేదు. మొత్తానికి పందొమ్మిది రోజుల్లో, ఆరున్నర లక్షల బడ్జెట్లో సినిమా పూర్తిచేశాం.
బ్లాక్ అండ్ వైట్‌లో చేయాలన్నది కూడా యాదృచ్ఛికంగా జరిగిందే. ఒకసారి మానిటర్ ఆన్ చేస్తుంటే కొన్ని క్షణాలు బ్లాక్ అండ్ వైట్‌లో కనిపించింది. అది చూసిన భరణిగారు ‘ఎంత బావుందో’ అన్నారు. అంతే, సినిమాను బ్లాక్ అండ్ వైట్‌లో ఉంచాలనుకున్నాం. అది చాలా ప్లస్సయ్యింది. తరువాత సినిమాను చాలా ఫిలిం ఫెస్టివల్స్‌కు పంపించాం. మంచి స్పందన వచ్చింది. నేషనల్ అవార్డ్‌కు పంపించేటప్పుడు ఫిలిం ఫార్మాట్ కావాలంటే డిజిటల్ నుంచి ఫిలింకు ట్రాన్స్ఫర్ చేశాం. ఉత్తమ దర్శకుడిగా నేషనల్ అవార్డ్ వచ్చింది. 2006లో ఆమిర్‌ఖాన్ చేతుల మీదుగా గొల్లపూడి శ్రీనివాస్ స్మారక అవార్డును అందుకున్నాను. రెండేళ్ల తరువాత ఆమిర్ ‘తారే జమీన్ పర్’కు తొలి ఉత్తమ దర్శకుడిగా అదే అవార్డ్ అందుకున్నారు.
గ్రహణం నాకు ప్రశంసలతో పాటు విమర్శలనూ తెచ్చిపెట్టింది. కథను సినిమాగా మలిచే క్రమంలో ఏ దర్శకుడికైనా కొంత స్పేస్ ఉంటుంది. దోషగుణాన్ని గ్రహణంగా మలిచే క్రమంలో నేను కూడా కొంత స్వేచ్ఛ తీసుకున్నాను. చలంగారు పల్లెటూరి మనుషులు, వారి స్వభావాల గురించి, అక్కడి వ్యవహారాల గురించి చాలా వర్ణన చేశారు. బడ్జెట్ దృష్ట్యా నేనవన్నీ పక్కన పెట్టాను. ఆయన అభిప్రాయాలన్నీ కనకయ్య మేనమామ పాత్ర ద్వారా చెప్పించాను. నిజానికి ఆ పాత్ర కథలో లేదు. అవసరం కోసం నేనే సృష్టించాను.
దానికి నేను సినిమాలో పేరు పెట్టలేదు. అలాగే కనకయ్య తండ్రి పాత్రకు కథలో పేరు లేదు. సినిమాలో నేను సుబ్రహ్మణ్యం అని పెట్టాను. ఇవి చిన్న మార్పులే. కానీ సినిమా మీద ప్రధానంగా రెండు విమర్శలు వచ్చాయి. కథలో చలం శారదాంబను ఒక పవిత్రమూర్తిగా చూపించారు. నేను ఒక సాధారణ స్త్రీగా చూపించాను. ఎందుకంటే పురాణాల్లోలా పవిత్ర స్త్రీకి మాత్రమే అపవాదు రాదు. నిజ జీవితంలో ఒక మామూలు స్త్రీకి కూడా రావచ్చు. వస్తే తనెలా సంఘర్షణకు గురవుతుంది, స్త్రీ లైంగికత్వం మీద సమాజం ఎలాంటి నిఘా పెడుతుందీ చూపించాలనుకున్నాను. అందుకే కనకయ్య శారదాంబ కాళ్లు వత్తేటప్పుడు ప్రేక్షకులు వాళ్లిద్దరికీ ఏదో సంబంధం ఉంది అనుకోవాలన్నట్టు చిత్రించాను. ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య సంబంధాన్ని కేవలం లైంగిక విషయానికి మాత్రమే పరిమితమైనదానిగా చూడటం తప్పని చివర్లో చెప్పే ప్రయత్నం చేశాను. ఒక సీన్లో శారదాంబ మంగళసూత్రం తీసి మొహం కడుక్కుని, తరువాత మళ్లీ వేసుకుంటుంది. ఓ సంప్రదాయ స్త్రీ అలా చేయదన్నారు. అలా చేయకూడదని ఎక్కడా లేదని నా ఉద్దేశం.
చలంగారి కథను సినిమాగా తీయడానికి అంగీకరించిన ఆయన కూతురు సౌరిస్, సినిమా చూసి ‘నాన్నగారు ఉండి ఉంటే చాలా సంతోషించేవారు’ అన్నారు. నా దృష్టిలో గ్రహణానికి లభించిన అతిపెద్ద సర్టిఫికెట్ అది. ఇక భరణి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నా తొలి సినిమాకే కాదు, నా కెరీర్‌కి కూడా వెన్నెముకగా నిలిచారాయన!
- కె.క్రాంతికుమార్‌రెడ్డి