ఆన్లైన్లో పెరిగిన ఉద్యోగ నియామకాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రారంభంలో ఆన్లైన్లో ఉద్యోగ నియామకాల జోరు పెరిగింది. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో నియామకాల్లో వృద్ధి 6 శాతంగా నమోదైందని మాన్స్టర్ డాట్కామ్ పేర్కొంది. పరిశ్రమల వారీగా చూస్తే ఇతర రంగాలతో పోలిస్తే తయారీ రంగంలో అధికంగా 38 శాతం వృద్ధి నమోదైందని మాన్స్టర్ డాట్కామ్ మేనేజింగ్ డెరైక్టర్ సంజయ్ మోదీ తెలిపారు. ఆటోమేషన్ రంగంలో మాత్రం నియామకాల సంఖ్య తగ్గిందని చెప్పారు. ప్రస్తుతం మనం మేకిన్ ఇండియా దిశగానే అడుగులు వేస్తున్నామన్నారు.
ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఉద్యోగ నియామకాలకు దోహదపడే చర్యల్ని తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు. నియామకాల్ని వృత్తి రంగాల వారీగా చూస్తే ఆర్ట్ రంగంలో అధికంగా 42 శాతం వృద్ధి నమోదైంది. అలాగే పట్టణాల వారీగా చూస్తే బరోడాలో అత్యధికంగా 29 శాతం వృద్ధి, మెట్రో నగరాల పరంగా చూస్తే అధికంగా ఢిల్లీలో 12 శాతం వృద్ధి కనిపించింది.