వెబ్‌ల్యాండ్‌పై రేపు సాక్షి సదస్సు
ఏలూరు (మెట్రో): వెబ్‌ల్యాండ్‌లో ఒకరి భూమి మరొకరి పేరున నమోదవడం, ఉన్న భూమి కంటే తక్కువ విస్తీర్ణం కనిపించడం వంటి సమస్యలు అధికంగా వెలుగుచూస్తున్న నేపథ్యంలో రైతులు, భూ యజమానులకు బాసటగా నిలవాలని ‘సాక్షి’ సంకల్పించింది. రైతులు తమకు ఎదురైన సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి అనే అంశంపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించనుంది. ఉదయం పది గంటలకు జిల్లా కేంద్రం ఏలూరులో జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ ప్రాంగణంలోని సర్ ఆర్ధర్ కాటన్ భవన్లో సదస్సు ప్రారంభం కానుంది. సదస్సులో ప్రస్తుతం వెబ్‌ల్యాండ్ వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఆ సమస్యలకు జిల్లా రెవెన్యూ అధికారులు, వెబ్‌ల్యాండ్ కమిటీ మెంబర్లు పరిష్కార మార్గాలు సూచిస్తారు. ఈ సదస్సులో వివిధ రైతు సంఘాల నాయకులు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, యెర్నేని నాగేంద్రనాథ్, మాగంటి సీతారామస్వామి, ఎం.వి.సూర్యనారాయణరాజు, శిరిగినీడి నాగభూషణం, వైట్ల విద్యాధర్, బి.బలరాం, కె.శ్రీనివాస్, పెనుమత్స రామరాజు, త్రినాథరెడ్డి, రామచంద్రరాజు, ఆకుల దొరయ్య, ఆంజనేయులు, ఇతర రైతుల సంఘాల నాయకులు పాల్గొంటారు. జిల్లాలోని రైతులు, భూ యజమానులు దీనిలో పాల్గొని తమ సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు.