బిగిసిన పిడికిలి
సాక్షి, మచిలీపట్నం :సమైక్య ఆందోళనలతో జిల్లా అట్టుడుకుతోంది. చల్లపల్లిలో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా రహదారిపై హోమం నిర్వహించారు. అవనిగడ్డ జేఏసీ ఆధ్వర్యంలో పులిగడ్డలో 216 జాతీయ రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించి భోజనాలు ముగించారు. అధికార భాషాసంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గసమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు.
నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య తన పదవికి రాజీనామా చేశారు. కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిలో ఉల్లిని రూ.10కే విక్రయించారు. కూరగాయల దుకాణాల అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. ఆర్టీసీ కార్మికులు వంటావార్పు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు పట్టణంలో అద్దె బస్సులతో ర్యాలీ నిర్వహించారు. జగ్గయ్యపేటలో బంద్ నిర్వహించారు. ముస్లింల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పాల్గొన్నారు.
నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన కైకలూరు బంద్ విజయవంతమైంది. ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావులు ర్యాలీలో పాల్గొన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్టుకు నిరసనగా మైలవరంలో టీడీపీ నాయకులు మన్నె సాంబశివరావు, షేక్ సుభానీలు తారకరామనగర్‌లోని వాటర్ ట్యాంకు పైకి ఎక్కి నిరసన తెలియజేశారు. గుడివాడలో మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి రిలేనిరాహారదీక్ష చేశారు. నెహ్రూచౌక్ సెంటర్లో ఎన్జీవోల దీక్షలు కొనసాగాయి. డ్వాక్రా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. పామర్రులో బంద్ నిర్వహించారు.
వత్సవాయిలో ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో రహదారిపై పాఠాలు బోధించారు. గోపినేనిపాలెం గ్రామంలో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి గ్రామ ప్రధాన సెంటర్లో దహనం చేశారు. ఏపీ డాక్టర్స్, ఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో కంకిపాడులో భారీ ప్రదర్శన నిర్వహించారు. కానూరులో వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు, పోరంకిలో టీడీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు విద్యార్థులతో కలసి బందరురోడ్డుపై రాస్తారోకో చేశారు. నందిగామ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ, ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి.
తిరువూరులో భవన నిర్మాణ కార్మికులు పనులు బహిష్కరించి నిరసన ప్రదర్శన చేశారు. న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించగా, న్యాయశాఖ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. విస్సన్నపేటలో జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెనుగంచిప్రోలులో ఆటోడ్రైవర్లు, యజమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయశాఖ ఉద్యోగుల సంఘం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
పెడనలో పీఏసీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఉప్పాల రాంప్రసాదు వాకా వాసుదేవరావు మద్దతు ప్రకటించారు. నూజివీడు చిన్నగాంధీబొమ్మ సెంటర్లో చేస్తున్న దీక్షలకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మద్దతు ప్రకటించారు. ఉయ్యూరు రైతుబజార్ కూరగాయల రైతులు కూరగాయల దండలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్రహీంపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
విజయవాడలో.. నగరంలో మున్సిపల్ ఉద్యోగులు రిలే దీక్షలు చేయడంతో పాటు రోడ్లపైనే ఆటలు ఆడుతూ నిరసన తెలిపారు. వన్‌టౌన్‌లోని సెయింట్ థామస్ ఇంగ్లీషు మీడియం స్కూల్ చిన్నారులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాష్ర్ట విభజన వద్దు... సమైక్యాంధ్ర ముద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్లపై నిర్వహించిన తరగతులకు హాజరయ్యారు. చిట్టినగర్ పొలిటికల్ జేఏసీ చేపట్టిన రిలే దీక్షలు తొమ్మిదవ రోజుకు చేరాయి. టీడీపీ నేతల అరెస్టును నిరసిస్తూ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఆర్టీసీ అద్దెబస్సుల ఓనర్స్, వర్కర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలుగు తల్లి విగ్రహం వద్ద విజయవాడ మాస్టర్ ప్రింటర్స్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సెంట్రల్ సమన్వయకర్త పి.గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు.
విజయవాడ టైలర్స్ జేఏసీ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. మోటార్ మెకానిక్స్ ఆధ్వర్యంలో జరిగిన మోటార్ సైకిల్ ర్యాలీలో వైఎస్సార్ సీపీ తూర్పు సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సమైక్యాంధ్ర ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరిగాయి. సిద్ధార్థ మెడికల్ కాలేజీ వద్ద వైద్య ఉద్యోగులు వంటావార్పు నిర్వహించారు.