పుస్తకాలే లేవు.. పాఠాలు ఎలా?
ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది.. కళాశాలలు ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్నా తెలుగు అకాడమి పుస్తకాలు మార్కెట్లోకి రాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ ఏడాది ఆర్ట్స్ గ్రూపుల సిలబస్ మారడంతో విద్యార్థులు మరింత కంగారు పడుతున్నారు.. ‘పాఠ్యపుస్తకాలు లేవు,
కనీసం సిలబసైనా ప్రటికంచలేదు. విద్యార్థులకు ఏవిధంగా పాఠాలు బోధించాలి’ అని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు..
- మారిన ఇంటర్మీడియెట్ ఆర్ట్స్ సిలబస్
- మార్కెట్లోకి రాని అకాడమి బుక్స్
- సిలబస్ ప్రకటించని ఇంటర్‌బోర్డు
- ఆందోళనలో విద్యార్థులు
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 61, ప్రైవేటు కళాశాలలు 174 ఉన్నాయి. ఆయా కాలేజిల్లో ఆర్ట్స్ గ్రూపులకు చెందిన మొదటి సంవత్సర విద్యార్థులు సుమారు 25వేల మంది ఉండగా వీరిలో తెలుగు మీడియం 15వేల మంది ఉన్నట్లు సమాచారం. జూన్ 2న కళాశాలలు ప్రారంభమైనా ఇంతవరకు పాఠ్య పుస్తకాలు అందకపోవడంతో విద్యార్థులు రోజూ వచ్చి ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. కాగా గతేడాది నూతనంగా ప్రాజెక్టు వర్క్‌లు పెట్టడం, రాష్ట్ర విభజన తదితర కారణాలతో తరగతులకు దూరమైన విద్యార్థులు పూర్తిస్థాయిలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు.
ఈ ఏడాదైనా ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలనుకున్న అధ్యాపకులకు పాఠ్యపుస్తకాల ముద్రణలో జాప్యం నిరాశకు గురిచేస్తోంది. ఈసారి సీనియర్ ఇంటర్ ద్వితీయ భాష సిలబస్ సైతం మారింది. తెలుగు, హిందీ, సంస్కృతంలో నూతన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టారు. అయినా వీటికి సంబంధించిన పుస్తకాలు అకాడమి నుంచి నేటికీ మార్కెట్లోకి విడుదల కాలేదు. దీంతో సీనియర్ ఇంటర్ విద్యార్థుల్లోనూ ఆందోళన నెలకొంది. తెలుగు అకాడమి పుస్తకాలు ఎప్పుడు వస్తాయోనని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.
పాఠ్య పుస్తకాల్లో ఏముందో!
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ నేపథ్యంలో గత ఏడాది బైపీసీ విద్యార్థులకు భౌతిక, రసాయన శాస్త్రం సిల బస్‌ను మార్చారు. అలాగే ఈసారి ఆర్ట్స్ గ్రూపులకు సంబంధించి సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులకు చెందిన సిలబస్‌లోనూ మార్పులు చేశారు. అయితే ఇంటర్మీడియట్ బోర్డు ఆ వివరాలను ఇంతవరకు ప్రకటించలేదు. కనీసం వెబ్సైట్లోనైనా పొందుపర్చలేదు. దీంతో కొత్త పుస్తకాల్లో ఏముందో విద్యార్థులకు ఏం బోధించాలో తెలి యక అధ్యాపకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం సిలబస్ ప్రకటిస్తే పాఠ్యపుస్తకాలు వచ్చే వరకు కొంత మేరకు బోధించే అవకాశం ఉంటుందన్నారు.