పరిశ్రమలకు అనుమతుల్లో జాప్యాన్ని సహించం
మంత్రి జూపల్లి కృష్ణారావు
సాక్షి, హైదరాబాద్: కొత్త పరిశ్రమలకు అనుమతుల జారీలో జాప్యా న్ని సహించబోమని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. పరిశ్రమల స్థాపన కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లోనే అన్నిరకాల అనుమతులు ఇస్తామన్నారు. అనుమతుల జారీలో ఒక్కరోజు ఆలస్యమైనా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
‘అభివృద్ధి కోసం పరిపాలన’ అనే అంశంపై భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవా రం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో జూపల్లి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ ఐ-పాస్)లో నూతన పరిశ్రమలకు 100 శాతం స్టాంపు డ్యూటీ మినహా యింపుతోపాటు 5 ఏళ్లు, ఏడేళ్ల వరకు పన్నుల మినహాయింపులు ఇస్తామని చెప్పారు.
రాష్ట్రంలోని అపారమైన సహజ, మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చారన్నారు. పారిశ్రామికీకరణలో దేశంలోనే ప్రథమ స్థానాన్ని అందుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో విద్యుతోత్పత్తి 12 వేల నుంచి 20 వేల మెగావాట్లకు పెరుగుతుందని, మిగులు విద్యుత్‌ను సాధిస్తుందన్నారు. ఈ సదస్సులో హిమాచల్‌ప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం కులపతి, ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు అరుణ్ మైరా, సీఐఐ తెలంగాణ చెర్మైన్ వనితా డాట్ల, నృపేందర్‌రావు, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.