కారుణ్య మరణానికి ఓకే
న్యూఢిల్లీ: కోలుకునే అవకాశం ఏమాత్రం లేని పరిస్థితుల్లో.. మృత్యువు కోసం ఎదురుచూస్తూ, మంచంపైనే కాలం వెళ్లదీస్తున్నవారికి ఊరటనిచ్చేలా దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. మరణం వాయిదా వేయడం మినహా మరే ఆశ లేనప్పుడు, శారీరక బాధను భరించలేని దయనీయ పరిస్థితిలో.. రోగి లేదా అతని తరఫున నమ్మకమైన వ్యక్తి అనుమతితో కారుణ్య మరణం ప్రసాదించవచ్చని పేర్కొంటూ పరోక్ష కారుణ్య మరణానికి(పాసివ్ యుథనేసియా) సమ్మతించింది. గౌరవప్రదమైన మరణం కూడా జీవించే హక్కులో భాగమేనని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అయితే, ఈ కారుణ్య మరణం అమలుకు సంబంధించి కొన్ని కచ్చితమైన మార్గదర్శకాలను కోర్టు పేర్కొంది. చికిత్స సాధ్యం కాదని, మరణం అనివార్యమని తెలిసినప్పుడు లేక చాన్నాళ్లుగా అచేతన స్థితిలో (కోమా) ఉన్నప్పుడు ఆ రోగి లేదా ఆ వ్యక్తి తరఫున.. కేవలం మరణాన్ని వాయిదా వేసే వైద్య చికిత్స తనకవసరం లేదని, ఆ ప్రాణాధార చికిత్సను నిలిపేయాలని కోరుతూ ‘అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్’ లేదా ‘లివింగ్ విల్’ను ఇవ్వొచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం వివరించింది.
కారుణ్య మరణం కోసం ‘అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్’ని చట్టబద్ధం చేయకపోవడం.. ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రశాంతంగా, గౌరవ ప్రదంగా మరణించే హక్కును పట్టించుకోకపోవడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అంశంపై వీలైనంత త్వరగా చట్టం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ‘ఈ అంశంపై పార్లమెంటు చట్టం చేసే వరకూ కోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు అమల్లో ఉంటాయి’ అని సీజేఐ మిశ్రా తెలిపారు.
తనతో పాటు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ తరఫున ఆయన తీర్పు వెలువరించగా.. జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌లు వేర్వేరుగా తీర్పు వెలువరించారు. చికిత్సకు సంబంధించిన స్వయంగా నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్న రోగికి అన్ని విధాలా దగ్గరివారైన, రోగి మనస్సును అర్థం చేసుకోగలవారైన వ్యక్తికి రోగి కారుణ్య మరణంపై నిర్ణయం తీసుకునే అధికారం అప్పగించడాన్నే మెడికల్ పవర్ ఆఫ్ అటార్నీ లేదా లివింగ్ విల్ లేదా అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్ అంటారు.
త్వరగా చట్టం చేయాలి
సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా 192 పేజీల తీర్పునిస్తూ ‘బతికే ఆశ లేని పరిస్థితుల్లో లేక కోలుకునే అవకాశం లేకుండా సుదీర్ఘంగా అచేతనంగా(కోమా) ఉన్నప్పుడు.. ఆ వ్యక్తి పడే బాధను తగ్గించే క్రమంలో మరణ ప్రక్రియను వేగవంతం చేయడమంటే గౌరవంగా జీవించే హక్కును కల్పించడమే.. మానవ జీవిత పవిత్రతను ఎంతో గౌరవించాల్సి ఉన్నప్పటికీ.. వారు కోలుకునే ఆశ లేనప్పుడు.. ముందస్తు అనుమతి, సొంత నిర్ణయ హక్కుకు ప్రాధాన్యమివ్వాలి’ అని చెప్పారు.
జస్టిస్ చంద్రచూడ్ 134 పేజీల తీర్పును వెలువరిస్తూ.. ‘చావు, బతుకులు విడదీయరానివి.. మరణించడం తప్పనిసరని తెలిసిన పరిస్థితుల్లో కూడా రాజ్యాంగం ప్రసాదించిన గౌరవప్రదంగా జీవించే హక్కు కొనసాగుతుందని తెలుసుకోవడం కోర్టుకు తప్పనిసరి. గౌరవప్రద మరణం కూడా జీవించే హక్కులో భాగం. గౌరవ ప్రదమైన మరణం లేకుండా చేయడమంటే ఒక వ్యక్తికి ఉండే అర్థవంతమైన ఉనికిని లేకుండా చేయడమే.
అందుకే మరణించే వరకూ ఒక వ్యక్తి గౌరవప్రదంగా జీవించేందుకు ఉన్న హక్కును రాజ్యాంగం పరిరక్షిస్తుంది’ అని పేర్కొన్నారు. సీజేఐ తీర్పుతో జస్టిస్ సిక్రీ ఏకీభవిస్తూ.. ఈ అంశంపై చట్టసభలు వీలైనంత త్వరగా సమగ్ర చట్టం తీసుకురావాలని సూచించారు. జియాన్ కౌర్ కేసులో ‘గౌరవప్రదంగా మరణించడం రాజ్యంగ హక్కు’ అని 1996లో సుప్రీం ధర్మాసనం చెప్పిన విషయాన్ని తన తీర్పులో జస్టిస్ భూషణ్ పునరుద్ఘాటించారు.
2011లోనే..: 2011లో అరుణా షాన్‌బాగ్ కేసు సమయంలో పరోక్ష కారుణ్య మరణాన్ని సుప్రీంకోర్టు గుర్తించింది. అనంతరం ఇలాంటి సంఘటనలో పరోక్ష కారుణ్య మరణం కోసం రోగి ఇచ్చే లివింగ్ విల్లును గుర్తించాలని కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది.
లివింగ్ విల్ అంటే..
రోగి తన ఆరోగ్య సంరక్షణకు సంబంధించి నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ బాధ్యతను నమ్మకస్తుడైన మరో వ్యక్తికి కట్టబెట్టే ‘మెడికల్ పవర్ ఆఫ్ అటార్నీ’నే ‘లివింగ్ విల్’ లేదా ‘అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్’గా పరిగణిస్తాం.
► రోగి స్పృహలో లేనప్పుడు, ఒక నిర్ణయం తీసుకునే తీసుకునే స్థితిలో లేనప్పుడు అతనికి ఎంతకాలం వైద్యం కొనసాగించాలో నిర్ణయించేది ఆ నమ్మకస్తుడైన వ్యక్తే
► సుప్రీం మార్గదర్శకాల ప్రకారం..మానసికంగా ఆరోగ్యవంతుడైన, సరిగా భావ వ్యక్తీకరణ చేసే వయోజనుడు లివింగ్ విల్ రూపొందించుకోవచ్చు. దాని ఉద్దేశం, అమలుచేశాక తలెత్తే పరిణామాలను అతను అర్థం చేసుకొని ఉండాలి.
తీర్పులో వివేకానంద, ప్లేటో, షేక్స్పియర్..!
తీర్పు సందర్భంగా కోర్టు తత్వవేత్తలు స్వామి వివేకానంద, చార్వాకుడు, ప్లేటో, హిప్పోక్రటస్, ఎపిక్యురస్లను ఉదాహరించింది. వీరితో పాటు విలియమ్ షేక్స్పియర్, అల్ఫ్రెడ్ టెన్నిసన్, ఎర్నెస్ట్ హెమ్మింగ్వే తదితర రచయితలు, కవులు జీవితం, మరణంపై వ్యక్తీకరించిన అభిప్రాయాల్ని తీర్పులో చేర్చారు. సీజేఐ మిశ్రా తీర్పును వెలువరిస్తూ ‘శ్వాసించే మనుషులెవరూ ఇప్పటివరకూ మృత్యువును కోరుకోలేదు’ అని టెన్నిసన్ వ్యాఖ్యలను ఉటంకించారు.
‘ఈ ప్రపంచం ఓ రంగస్థలం. మనం కేవలం పాత్రధారులమే’ అని షేక్స్పియర్మాటల్ని ఉదహరించారు. జస్టిస్ సిక్రీ తీర్పును వెలువరిస్తూ.. ‘ఈ లోకంలోకి ప్రతీ ఒక్కరూ ఏడుస్తూనే వస్తారు. కానీ నవ్వుతూ చనిపోయే వాడే అందరిలోకెల్లా అత్యంత అదృష్టవంతుడు’ అని ఓ హిందీ సినిమా డైలాగ్‌ను తీర్పులో చేర్చారు. ‘ఓ వ్యక్తి పరిపూర్ణం కాని రాజ్యాంగంతో పాటు అనారోగ్యకరమైన అలవాట్లు కలిగిఉంటే ఆ జీవితం వల్ల ఆ వ్యక్తికి, ఇతరులకు ప్రయోజనం శూన్యం’ అని ప్లేటో వ్యాఖ్యలను జస్టిస్ భూషణ్ ఉటంకించారు.
ఆ కేసుతోనే కారుణ్య మరణంపై చర్చ
అరుణ రామచంద్ర షాన్‌బాగ్.. 1973లో ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో నర్సుగా చేస్తున్న సమయంలో వార్డు బాయ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె మెడకు గొలుసు బిగించి గాయపర్చడంతో అరుణ మెదడుకి రక్తప్రసారం నిలిచిపోయి అచేతన స్థితికి వెళ్లిపోయింది. 42 ఏళ్ల పాటు అలా మంచానికే పరిమితమయ్యారు. ట్యూబులతో ద్వారా వైద్యులు ఆహారం అందించారు.
2009లో సామాజిక కార్యకర్త పింకీ విరాని ఆమె స్థితికి చలించి ట్యూబుల్ని తొలగించి కారుణ్య మరణం ప్రసాదించాలని సుప్రీంలో పిటిషన్ వేశారు. కోర్టు ముగ్గురు ప్రముఖు వైద్యులతో కమిటీ వేయగా.. అరుణ బ్రెయిన్ డెడ్ అవలేదని, యుథనేసియా ఈ కేసుకి వర్తించదని ఆ కమిటీ తెలిపింది. దీంతో విరానీ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత అరుణ న్యుమోనియా సోకడంతో 2015, మే 18న మరణించారు.
యుథనేసియా రకాలు..
స్వచ్ఛంద(వాలంటరీ): రోగి అంగీకారం, అనుమతి మేరకు అతడికి మరణాన్ని అందించడం. బెల్జియం, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్‌లో ఈ రకం యూథనేసియా చట్టబద్ధం.
స్వచ్ఛందం కాని(నాన్‌వాలంటరీ): రోగి అనుమతి, అంగీకారం తీసుకునే పరిస్థితి లేనప్పుడు నిర్వహించే మరణ ప్రక్రియ ఇది. పసిపిల్లల విషయంలో అరుదుగా ఉపయోగిస్తుంటారు. ఏ దేశంలోనూ ఇది చట్ట సమ్మతం కాదుగానీ.. నెదర్లాండ్స్‌లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం అనుమతిస్తారు.
బలవంతపు(ఇన్వాలంటరీ): పేరులో ఉన్నట్లే రోగికి ఇష్టం లేకపోయినా అతడిని చంపేసే ప్రక్రియను ఇన్వాలంటరీ యూథనేసియా అని పిలుస్తారు.
పాసివ్, యాక్టివ్: పాసివ్ యుథనేసియాలో రోగికి అందిస్తున్న వైద్యాన్ని ఆపివేయడం ద్వారా మరణించేలా చేస్తారు. యాక్టివ్ యుథనేసియాలో వెంటనే చనిపోయేలా విషపు ఇంజెక్షన్లు ఇస్తారు.
సుప్రీం మార్గదర్శకాలు..
కారుణ్య మరణం అమలు కోసం రోగి లేదా అతని తరఫు నమ్మకమైన వ్యక్తి రాసిచ్చే అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్ లేదా లివింగ్ విల్ విషయంలో కోర్టు పలు మార్గదర్శకాలు నిర్దేశించింది. మెడికల్ డైరెక్టివ్ పూర్తి ఆరోగ్యంతో ఉన్న వయోధికుడు మాత్రమే రాసి ఇవ్వాలి. అనుమతి పత్రం ఉద్దేశం, అమలు అనంతర పరిణామాల పట్ల వారికి అవగాహన ఉండాలి. ఎలాంటి నిర్బంధం లేకుండా స్వచ్ఛందంగా అనుమతి పత్రాన్ని రాసివ్వాలి.
ముందుగా ఎలాంటి చికిత్స తీసుకున్నప్పటికీ వ్యాధులు నయంకాని రోగి గురించి చికిత్స చేసే వైద్యుడు ఆస్పత్రి యాజమాన్యానికి తెలియచేయాలి. అనంతరం ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు చెపుతారు. దీనిపై సంబంధిత విభాగాధిపతితో పాటు జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, అంకాలజీ విభాగాల్లో నిష్ణాతులైన ముగ్గురు వైద్యులతో ఆస్పత్రి యాజమాన్యం ఓ మెడికల్ బోర్డును ఏర్పాటుచేస్తుంది.
బంధువుల సమక్షంలో రోగిని ఈ బృందం పరీక్షించి వైద్య సేవల్ని నిలిపివేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ రోగికి వైద్యాన్ని నిలిపివేయడానికి బోర్డు అంగీకరిస్తే.. ఈ విషయాన్ని సంబంధిత జిల్లా కలెక్టర్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ విషయమై కలెక్టర్ మరో మెడికల్ బోర్డును ఏర్పాటుచేసి ఇంతకుముందు ఆస్పత్రి తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షిస్తారు.
ఈ కమిటీ ఆస్పత్రి నిర్ణయంపై సంతృప్తి చెందితే కలెక్టర్ రోగిని సందర్శించి పాసివ్ యూథనేసియాకు అనుమతిస్తారు. ఒకవేళ కలెక్టర్ నియమించిన బోర్డు పాసివ్ యూథనేసియాకు ఆమోదం తెలపకుంటే రోగి కుటుంబ సభ్యులు, చికిత్స అందించిన వైద్యుడు, ఆస్పత్రి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓ డివిజన్ బెంచ్‌ను ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకుంటారు. ముందస్తు వినతి లేని సమయంలో సదరు ఆస్పత్రి యాజమాన్యం మెడికల్ బోర్డును ఏర్పాటుచేస్తుంది.