సాటి మనిషిపట్ల సహానుభూతి, ప్రేమ, ఆప్యాయతలు అడుగంటుతున్న సమాజ పోకడల గురించి మనలనందరినీ హెచ్చరిస్తున్నట్టుగా నాలుగు దశాబ్దాలనుంచి ముంబై కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆసుపత్రి బెడ్‌పై అచేతన స్థితిలో జీవచ్ఛవంలా మిగిలిపోయిన అరుణా రామచంద్ర శాన్‌బాగ్ సోమవారం ఉదయం కన్నుమూసింది. తాను ఎంతో ఇష్టంగా ఎంచుకున్న నర్సింగ్ వృత్తిలో అంకితభావాన్ని ప్రదర్శించడంతోపాటు తన సహ విద్యార్థులకు తలలో నాలుకలా మెలగిన అరుణ ఒక మానవమృగం దాడిలో ఎప్పటికీ కోలుకోలేని దురదృష్టకర స్థితికి చేరుకుంది.
ఇనుప గొలుసును ఆమె మెడకు బిగించి లాక్కుపోవడంవల్ల, లైంగిక నేరానికి పాల్పడటంవల్ల మెదడుకు ఆక్సిజన్ ఆగిపోయి...మాట పడిపోయి, చూపు మందగించి ఆమెను శాశ్వత అచేతన స్థితికి తీసుకెళ్లాయి. పాతికేళ్ల వయసులో అదే ఆసుపత్రిలో పనిచేసే వైద్యుడిని పెళ్లాడి జీవితంలోనూ, వృత్తిలోనూ స్థిరపడదామనుకుని సెలవు మంజూరు చేయించుకున్న రోజునే ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రపంచంలో ఇలాంటి అచేతన స్థితికి వెళ్లి ఇంత సుదీర్ఘకాలం బతికిన ఏకైక వ్యక్తి అరుణేనని చెబుతున్నారు.
మంచానికి పరిమితమై తన లోకంలో తానుండిపోయినా మన దేశంలో ఎప్పటినుంచో మరుగున పడిపోయిన ఒక కీలకమైన చర్చకు అరుణా శాన్‌బాగ్ కారకురాలైంది. వైద్య కారణాలరీత్యా సుదీర్ఘకాలం అచేతనస్థితిలో లేదా అర్థచేతన స్థితిలో కాలం వెళ్లదీస్తూ... సమాజంలోని ఇతరుల్లా తమకు నచ్చినట్టుగా, హుందాగా జీవించడం అసాధ్యమైన పరిస్థితుల్లో పడినవారు తమకు మరణాన్ని ప్రసాదించమని అడగవచ్చునా, అలా అడగడాన్ని చట్టబద్ధం చేయవచ్చునా అన్నదే ఆ చర్చ సారాంశం. అయినవారికి భారంగా మారామన్న మనోవేదన ఒకపక్కా...శరీరంలో ముదిరిన రోగం కారణంగా క్షణక్షణం నరకం అనుభవంలోకి రావడం మరోపక్కా బాధిస్తుండగా చావుకు అనుమతి కోరడం తప్పెలా అవుతుందని కొందరు ప్రశ్నించారు.
ప్రాణం పోసే శక్తి లేని మనిషికి ప్రాణం తీసే హక్కు ఎక్కడిదని మరికొందరు వాదించారు. ఎంతో చైతన్యవంతంగా, అర్ధవంతంగా జీవితం గడిపిన అరుణా శాన్‌బాగ్ జీవచ్ఛవంలా మారడాన్ని చూసి తట్టుకోలేక ఆమెకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని అరుణ స్నేహితురాలు, జర్నలిస్టు పింకీ విరానీ 2009లో సుప్రీంకోర్టు ముందు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై నాలుగేళ్లక్రితం తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు దేశంలో తొలిసారి కారుణ్యమరణానికి పాక్షిక చట్టబద్ధతను కల్పించింది. అయితే, శాన్‌బాగ్ విషయంలో మాత్రం ఈ తీర్పు వర్తించబోదన్నది. అత్యంత అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే కారుణ్యమరణానికి అనుమతించవచ్చునని, శాన్‌బాగ్ విషయంలో అలాంటి పరిస్థితి లేదని తెలిపింది. సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న రోగులు సహజ మరణం పొందడమే సరైనదని, అర్ధాంతరంగా వారి ప్రాణాలు తీయడం హత్యేనన్నది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అనుసరిస్తున్న విధానం. స్విట్జర్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, బెల్జియం వంటి దేశాలు...అమెరికాలోని ఒరెగాన్, వాషింగ్టన్‌వంటి రాష్ట్రాలు ఇందుకు మినహాయింపు. అక్కడ పాక్షిక కారణ్యమరణానికి చట్టబద్ధత ఉంది. అలాంటి విధానానికి సుప్రీంకోర్టు అనుమతినిస్తూ అందుకు కొన్ని మార్గదర్శకాలను కూడా రూపొందించింది. పార్లమెంటు చట్టం చేసేవరకూ అవి అమలులో ఉంటాయని చెప్పింది. కారుణ్య మరణమనే భావనను వ్యతిరేకిస్తున్నవారంతా అది దుర్వినియోగమయ్యే ప్రమాదమున్నదని వాదిస్తున్నారు. ఆస్తి కోసం అయినవారిమధ్యే కక్షలు, కార్పణ్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ తరహా చట్టం ప్రమాదకర పర్యవసానాలకు దారితీయగలదని హెచ్చరిస్తున్నారు.
ఇంతటి కీలకమైన చర్చకు మూల కారణమైన అరుణా శాన్‌బాగ్ ఆరోగ్య స్థితిని కోమా అనడానికి వీల్లేదని సుప్రీంకోర్టు నియమించిన వైద్య నిపుణుల బృందం తేల్చిచెప్పింది. కాలూ, చేయీ కదపలేని స్థితి ఉండొచ్చుగానీ మెదడుకు మరణం సంభవించలేదని ఆ బృందం స్పష్టంచేసింది. తనకు ఇష్టమైన పదార్థాలను నోటికి అందించినప్పుడైనా, ఇష్టమైనవారు కనబడినా ముఖంలో సంతోషం కనబడటం... సంగీతాన్ని ఆస్వాదిస్తున్న భావనను వ్యక్తీకరించడం...తానున్న గదిలోకి ఎక్కువ మంది వచ్చినా, మాట్లాడుతున్నా కొన్ని రకాల ధ్వనులద్వారా అయిష్టతను కనబరచడంవంటివి అందుకు దృష్టాంతాలుగా చెప్పింది. అయితే, ఈ నలభెరైండేళ్లపాటూ ఆమెను కంటికి రెప్పలా చూసుకున్న కేఈఎం నర్సింగ్ సిబ్బంది గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎక్కడో కర్ణాటకనుంచి నర్సింగ్ శిక్షణ కోసం వచ్చి కొన్నాళ్లు తమకు సహచరిగా ఉండి అచేతన స్థితిలోకి వెళ్లిన అరుణకు వారు చేసిన సపర్యలు అపూర్వం. అన్నేళ్లపాటు మంచానికి పరిమితమైనా అరుణ ఒంటిపై పుండ్లు లేకపోవడాన్ని... ఆమె, ఆమెతోపాటు పరిసరాలు అత్యంత పరిశుభ్రంగా ఉండటాన్ని సుప్రీంకోర్టు నియమించిన వైద్య నిపుణుల బృందం ప్రత్యేకంగా ప్రస్తావించింది.
వేళకు మంచి పోషకాహారాన్నీ, మందులను సమకూర్చడంవల్లనే ఇది సాధ్యమైంది. నర్సింగ్ వృత్తిలో ఉండేవారి సేవల విలువేమిటో, వారి అంకితభావం ఏ స్థాయిలో ఉంటుందో అరుణ ఉదంతం వెల్లడించింది. ఒక్క కారుణ్య మరణం విషయంలో చర్చకు తెరలేపడం మాత్రమే కాదు...మహిళలపై సమాజంలో నెలకొన్న వివక్షను, నిర్లక్ష్యాన్ని కూడా ఎత్తిచూపుతూ అరుణా శాన్‌బాగ్ నిష్ర్కమించింది. ఆమెకు జరిగిన అన్యాయంపై అప్పట్లోనే సవివరమైన చర్చ జరిగి... అలాంటి నేరాలకు కఠిన శిక్ష పడేందుకూ, మొత్తంగా అసమానతలను పోగొట్టే దిశగా చర్యలు తీసుకునేందుకూ ప్రయత్నించి ఉంటే బహుశా నిర్భయ ఉదంతం వంటివి చోటుచేసుకునేవి కాదేమో! కనీసం ఇకముందైనా ఇలాంటివి జరగకుండా చూడటమే అరుణా శాన్‌బాగ్‌కు నిజమైన నివాళి అవుతుంది.
‘కారుణ్యంలేని’ లోకంనుంచి...
Published Tue, May 19 2015 1:22 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement