breaking news
Asanna
-
మేం కోవర్టులం కాదు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కోవర్టులుగా తమను చిత్రీకరిస్తున్న వారు, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మాజీ మావోయిస్టు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న విజ్ఞప్తి చేశారు. తమలో విప్లవ తత్వం ఇంకా చనిపోలేదని, ప్రజాపోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈమేరకు తనతో పాటు లొంగిపోయిన 210 మంది మావోయిస్టులతో కలిసి ఛత్తీస్‌గఢ్ నుంచి మాట్లాడిన వీడియోను ఆయన శనివారం విడుదల చేశారు. అందులో ఆశన్న పేర్కొన్న ముఖ్యమైన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘కేంద్ర కమిటీ స్థాయి నాయకులు లొంగిపోతే విప్లవ ద్రోహులుగా పేర్కొనడం చాన్నాళ్లుగా జరుగుతూ వస్తోంది. మాపై కూడా అలాంటి నిందలు వస్తాయని ముందే ఊహించాం. కానీ, ఇటీవల మావోయిస్టు పార్టీకి జరిగిన భారీ నష్టాలకు మేమే కారణమని, మేం కోవర్టులుగా వ్యవహరించామంటూ ఆరోపణలు రావడంతో వివరణ ఇస్తున్నా. నాకు ఏ స్వార్థం లేదు. భయం కూడా లేదు. ప్రస్తుత పరిస్థితులు సాయుధ పోరాటానికి అనుకూలంగా లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికీ మాలో విప్లవ తత్వం చచ్చిపోలేదు. ప్రజల తరఫున పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. అయితే, కార్యాచరణ ప్రకటించేంత అనువైన పరిస్థితులు లేనందున.. పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవడం ముఖ్యం. హైదరాబాద్‌లో కూర్చుని ప్రకటనలా? ప్రజాస్వామిక వాదులు, పౌర హక్కుల సంఘాల నేతలు హైదరాబాద్‌లో కూర్చుని మాపై ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తున్నారు. మేము సైద్ధాంతికంగా మీ అంత బాగా మాట్లాడలేకపోవచ్చు. కానీ, క్షేత్రస్థాయిలో నిలబడి మాట్లాడుతున్నాం. మేము పోరాడుతున్న గడ్డ (దండకారణ్యం)కు వచ్చి నిజాలు తెలుసుకుని మాట్లాడండి. అప్పుడే మేము ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొన్నామో తెలుస్తుంది. అక్కడ (హైదరాబాద్) ఉండి సాయుధ పోరాటం చేయాల్సిందే అని చెబుతున్నారు. చేస్తే ఏమవుతుంది? మా శవాలు తెలంగాణకు వస్తే వాటిపై ఎర్రగుడ్డలు కప్పి ర్యాలీలు తీసి మమ్మల్ని హీరోలను చేస్తారు. కానీ ఇక్కడి(ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులు) వారి సంగతేంటి? ప్రాణత్యాగం వృధా సమీప భవిష్యత్‌లో మన లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంటే తెగించి పోరాటం చేయడంలో తప్పులేదు. అలాంటి పరిస్థితి లేనప్పుడు ప్రాణత్యాగం చేయడం వృధా. విజ్ఞతతో ఆలోచన చేయండి. అనుకూలమైన పరిస్థితుల్లో ఉండి పరిధి దాటి మాట్లాడం పౌరహక్కుల సంఘం నేతలకు సరికాదు. మేము లొంగిపోయినా గుండెకోట్ ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టులు సాయుధ పోరాటం చేయగలరని పౌరహక్కుల నేత గడ్డం లక్ష్మణ్ అంటున్నారు. కానీ, ఆ ఎన్కౌంటర్లో తప్పించుకున్న వారు కూడా ఇప్పుడు ఇక్కడ నా వెంటే ఉన్నారు. నేనో, సోనూనో చెబితే వచ్చేంత అమాయకులు కారు వారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలియకుండా వాఖ్యలు చేయడం సరికాదు. బీఆర్ దాదా ఉద్దేశం అది కాదు.. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్‌లో మావోయిస్టులపై ప్రభుత్వం దాడి భీకరంగా ఉంటుందనే అంచనా ఉంది. అందుకే మార్చి 28న శాంతిచర్చల కోసం కేంద్ర కమిటీ తరఫున మన పార్టీ నాటి జనరల్ సెక్రటరీ బీఆర్ దాదా (నంబాల కేశవరావు) అనుమతితో లేఖ రాశాం. ఆ తర్వాత ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నేను లేఖలు, ఇంటర్వ్యూ ఇచ్చాను. కానీ, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో నేనేమైనా తొందరపడ్డానా అని తెలుసుకునేందుకు వ్యక్తిగతంగా బీఆర్ దాదాతో చర్చించాను. ఈ సందర్భంగా ‘మనం తప్పు చేయలేదు. సరైన దిశలోనే ఉన్నాం. కేంద్ర కమిటీ అంతా కూర్చుని నిర్ణయం తీసుకోవాల్సింది. అలాంటి పరిస్థితి లేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గం చూడాలి’అని కూడా అన్నారు. దీనికి సంబంధించి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఈ అంశంపై చివరిసారి మే 18న బీర్ దాదా నుంచి నాకు లేఖ వచ్చింది. ఈ లేఖ పంపిన రెండు గంటల తర్వాతే ‘గుండెకోట్ ఆపరేషన్’మొదలైంది. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది శాంతిచర్చల విషయంలో దండకారణ్యంలో అందుబాటులో ఉన్న కేంద్ర కమిటీ సభ్యుల మధ్య చర్చ జరిగింది. ఇందులో దక్షిణ బస్తర్‌లో ఉన్న కామ్రేడ్లకు సమాచారం అందకముందే శాంతి చర్చల ప్రకటన వచ్చినట్టుంది. ఇక్కడ మా మాధ్య గ్యాప్ ఏర్పడింది. శాంతిచర్చల ప్రకటన మా నుంచి వచ్చినా ప్రభుత్వం నుంచి దాడులు ఆగలేదు. దీంతో ఆత్మరక్షణ కోసం మనం ఆయుధం పట్టవచ్చు అంటూ మే 13న బీఆర్ దాదా మరో లేఖ పంపారు. ప్రస్తుతం ఈ లేఖను చూపించి బీఆర్ దాదా సాయుధ పోరాటానికి అనుకూలమనే వాదనను తెర మీదకు తెస్తున్నారు. ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పట్టుకోమనే బీఆర్ దాదా చెప్పారు తప్పితే అప్పటి వరకు శాంతి చర్చలు, కాల్పుల విరమణ, సాయుధ పోరాటంపై వంటి అంశాల్లో తన అభిప్రాయం మార్చుకున్నట్టు కాదు. ‘సాయుధ పోరాటం’విషయంపై నాతో పాటు మరో పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీ (తిప్పిరి తిరుపతి)కి కూడా బీఆర్ దాదా లేఖ రాశారు. అందులో విషయాలను ఎందుకు బయటపెట్టడం లేదు. మల్లోజులతో టచ్‌లో లేను సోను (మల్లోజుల వేణుగోపాల్)తో నేను టచ్‌లో లేను. ఆగస్టుతో పాటు అక్టోబర్ 7వ తేదీన కేవలం రెండు సార్లే ఆయనను కలిశాను. సాయుధ పోరాటం చేయాలనే ఎస్జెడ్సీ సభ్యుడి సమక్షంలోనే బహిరంగంగా ప్రజాస్వామ్యబద్దంగా నేను, సోను చర్చ జరిపాం. అందరి అభిప్రాయాల కోసం సెప్టెంబర్ 13 వరకు ఎదురు చూశాం. ఆ తర్వాత సాయుధ పోరాట విరమణ ప్రకటన వచ్చింది. ఈ విషయంలో సాధ్యమైనంత వరకు పార్టీ పద్దతులు పాటించేందుకు ప్రయత్నించాం అని వివరించారు. -
వారు కోవర్టులు.. విప్లవ ద్రోహులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్టీ విచ్ఛిన్నకులుగా..విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువులకు లొంగిపోయిన సోను, సతీశ్, వారి అనుచరులకు తగిన శిక్ష విధించాలని ప్రజలకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతిని«ధి అభయ్ పేరిట 16న రాసిన లేఖ ఆదివారం వెలుగుచూసింది. లేఖలోని ప్రధానాంశాలివి... సోను రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి 2011 నుంచి దండకారణ్యంలో పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా 2018 నాటికి తాత్కాలిక వెనుకంజకు గురైంది. అప్పటి నుంచే సోనులో రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి. 2020 డిసెంబర్లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో దండకారణ్య విప్లవాచరణలో కొన్ని లోపాలపై సోను ప్రవేశపెట్టిన పత్రాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించింది. ఆ తర్వాత జరిగిన కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సమావేశాల్లో సోనులోని తప్పుడు రాజకీయ భావాలను విమర్శించి, సరిదిద్దడానికి పార్టీ కృషి చేసింది. ఆయనలో పొడసూపుతున్న వ్యక్తివాదం, అహంభావం, పెత్తందారీతనాన్ని సరిద్దుకోవాలని కోరింది. అయితే 2025 మేలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు మరణం తర్వాత సోనులో దీర్ఘకాలంగా పేరుకుపోయిన సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణాత్మక బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకొని శత్రువు ముందు మోకరిల్లేలా చేశాయి. నిజాలు దాచి .. నిందలు మోపుతూ.. ఆపరేషన్ కగార్తో ప్రతీరోజు ప్రాణాలు ఎదురొడ్డి విప్లవవోద్యమాన్ని ముందుకు నడిపించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే సోనులో పెరుగుతూ వచ్చిన సుఖలాలస, స్వార్థాలు త్యాగానికి సిద్ధపడని స్థితికి, ప్రాణభీతికి దారి తీశాయి. తన బలహీనత, ప్రాణభీతికి ముసుగు కప్పి, పార్టీ అనుసరిస్తున్న తప్పుడు రాజకీయ సైనిక పంథా (వ్యూహం) ఫలితంగానే భారత విప్లవోద్యమం ఓటమి పాలయ్యే స్థితికి దారితీసిందని, ఈ స్థితిలో ఆయుధాలను శత్రువుకు అప్పగించి, తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయడం మినహా మరో మార్గం లేదనే మితవాద అవకాశవాద, రివిజనిస్టు వైఖరితో కూడిన లొంగుబాటు ప్రకటన సెపె్టంబరు 15న సోను నుంచి వచ్చింది. తన అభిప్రాయాలపై నమ్మకముంటే సోను వాటిని పార్టీ ముందు పెట్టి చర్చించాల్సింది. కానీ శత్రువు ముందు లొంగిపోయాడు. బహిష్కరిస్తున్నాం సోను, అతని అనుచరులు ఆయుధాలు పారీ్టకి అప్పగించి లొంగిపోవాలని కేంద్ర కమిటీ సూచించినా, దాన్ని పాటించకుండా ఆయుధాల్ని శత్రువుకు అప్పగించారు. ఇదివిప్లవ ప్రతిఘాతుకత (కౌంటర్ రివల్యూషన్) అవుతుంది. విప్లవ ద్రోహిగా మారిన సోను, అతనితోపాటు లొంగిపోయిన డీకే ఎస్జెడ్సీ సభ్యుడు వివేక్, దీపలతో పాటు మరో పదిమందిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. ఈ విప్లవ ద్రోహులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నాం. గతేడాది నుంచి వారు కాంటాక్ట్‌లో ఉన్నారు.. గతేడాది చివర్లో తన జీవిత సహచరితోపాటు మరికొందరిని మహాæరాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్ సమక్షంలో పోలీసులకు లొంగిపోవడానికి పథకం రూపొందించినప్పటి నుంచే పోలీస్ ఉన్నతాధికారులతో సోను, ఆశన్న కాంటాక్ట్‌లో ఉన్నారు. ఆ తర్వాత కోవర్టుగా మారినట్టు ఈ మధ్య జరిగిన ఘటనల ద్వారా అర్థమవుతోంది. కోవర్టులుగా మారిన సోను, సతీశ్‌లకు నూతన పద్ధతుల్లో భారత విప్లవోద్యమాన్ని నిర్మిస్తాననే నైతిక అర్హత లేదు. ఇకనైనా పార్టీని చీల్చే పనులు మానుకోవాలని సోను, సతీశ్లను హెచ్చరిస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ భారీ లొంగుబాట్లు విప్లవోద్యమానికి నష్టమే అయినా ఇవి తాత్కాలిక నష్టాలే. వీటి ప్రభావం దీర్ఘకాలం ఉండొచ్చు. కానీ విప్లవోద్యమం శాశ్వత ఓటమికి గురికాదు. పీడన, సామాజిక అంతరాలు ఉన్నంత వరకు వర్గ పోరాటం ఉంటుంది. మారిన సామాజిక పరిస్థితులు, మారుతున్న విప్లవ స్వాభావిక లక్షణాలకు తగినట్టుగా మన రాజకీయ – సైనిక పంథాను సుసంపన్నం చేసుకొని భారత విప్లవోద్యమాన్ని కొనసాగిద్దామని యావత్ దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాం. -
లొంగిపోనున్న మరో కీలక దళం నేత! ఎవరంటే..
వరుస బెట్టి అన్నలు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. కేంద్ర హోం శాఖ ఆపరేషన్ కగార్ ప్రభావంతో.. కీలక నేతలు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. ఈ ఏడాది మే 21న సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ చత్తీస్‌గఢ్‌లోని అబుజ్మాద్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాల చేతిలో హతమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే పార్టీ అంతర్గతంగా గందరగోళానికి లోనవుతూ వస్తోంది. ఆపరేషన్ కగార్(Operation kagar)తో మావోయిస్టు శిబిరాల్లో భయాందోళనలు పెరిగిపోయాయి. బస్వరాజ్ మరణం తర్వాత CPI (మావోయిస్టు)లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ ఆంతర్గత విభేదాలు బయటపడడం, కీలక నేతల ఆరోగ్య సమస్యలు లొంగుబాటుకు కారణాలవుతున్నాయి. దీనికి తోడు భద్రతా దళాల ఒత్తిళ్ల కారణంగా అగ్రనేతలు వరుసగా లొంగిపోతున్నారు. తాజాగా కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న ఆశన్న ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట శుక్రవారం లొంగిపోయారు. జగదల్పూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో 208 మావోయిస్టులతో కలిసి ఆయన ఆయుధాలు అప్పగించారు. మొత్తం 153 తుపాకులు అగప్పించగా.. లొంగిపోయినవాళ్లలో 110 మంది మహిళా మావోయిస్టులు ఉండడం గమనార్హం. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత ఆశన్న(రెడ్ సర్కిల్లో)ఆశన్న అసలు పేరు తక్కపల్లి వాసుదేవరావు. ములుగు జిల్లా వెంకటాపురం ఆయన స్వస్థలం. బైరంగూడా అడవుల్లో దశాబ్దాలుగా అండర్‌గ్రౌండ్‌గా జీవనం కొనసాగిస్తూ వచ్చారు. 2003లో చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడి, మాజీ మంత్రి మాధవరెడ్డి, IPS అధికారి ఉమేశ్ చంద్ర హత్యలకు ప్రధాన సూత్రధారిగా ఆయనకు పేరుంది. అలాంటి కీలక నేత లొంగుబాటును మావోయిస్టులకు భారీ దెబ్బ అనే చెప్పొచ్చు. లొంగిపోవాలని నిర్ణయించుకున్న వాళ్లు తనను సంప్రదించవచ్చని తన చివరి ప్రసంగంలో ఆయన దళ సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..మల్లోజుల, ఆశన్న.. రేపు ఎవరా? అనే చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మావోయిస్ట్ పార్టీకి మరో ఝలక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్(Bandi Prakash) లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి ద్వారా లొంగుబాటు యత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్, అశోక్, క్రాంతి.. స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. ప్రకాశ్ తండ్రి సింగరేణి కార్మికుడు. 1982–84 మధ్య గో టు ద విలేజెస్ ఉద్యమం ద్వారా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) తరఫున పోరాడారు. ఆపై మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన లొంగిపోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేదా డీజీపీ లేకుంటే స్థానిక పోలీసుల ఎదుట బండి ప్రకాశ్ లొంగిపోయే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. 2026 మార్చి కల్లా మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ కగార్‌ను ఉధృతం చేశారు. గత రెండేళ్లలో దేశంలో వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల సంఖ్య 430 మంది. లొంగిపోయిన వాళ్లు 1,500 మంది. ప్రస్తుతం పార్టీలో కేవలం 12మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలి ఉండగా.. అందులో 8 మంది తెలంగాణ నుంచే ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: ఆ ఒక్కడి లెక్క తేలిస్తే మావోయిస్టు పార్టీ ఖతమైనట్లే! -
ఆ ఒక్కడి లెక్క తేలిస్తే కగార్ ముగిసినట్లే!
నిన్న మల్లోజుల, నేడు ఆశన్న.. రేపు ఎవరో?. వరుస పరిణామాలతో యాభై ఏళ్ల మావోయిస్టు పార్టీ ఉద్యమం చివరి అంకానికి చేరుకుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్(Operation Kagar)తో పార్టీ కేడర్ కకావికలం కాగా.. అదే సమయంలో కీలక నేతలు వరుసగా లొంగిపోతుండడమూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 2026 మార్చికల్లా మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అణచివేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. లెక్కలు చూస్తే.. ఆయన చెప్పినట్లు నిజంగానే గత పదేళ్లలో ఉద్యమం తీవ్రంగా క్షీణించింది కూడా. మరీ ముఖ్యంగా.. మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు( Nambala Keshava Rao) ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అయ్యింది.గత రెండేళ్లలో వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల సంఖ్య 430 మంది. లొంగిపోయిన వాళ్లు 1,500 మంది. ఈ మధ్యకాలంలో కేంద్ర కమిటీ సభ్యులే లొంగిపోతుండగా.. చేసేదేం లేక కింది స్థాయిలో కేడర్ కూడా పార్టీని వీడుతోంది. ప్రస్తుతం పార్టీలో కేవలం 12మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. ఇందులో మరో విశేషం ఒకటి ఉంది. ఆ పన్నెండు మందిలో.. 8 మంది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలే ఉన్నారు. హనుమంతు, గణపతి, తిరుపతి, చంద్రన్న, సంగం వీళ్లంతా ఇక్కడి వాళ్లే. ఇక కీలకంగా ఉన్న ఒకే ఒక్కడు మడావి హిడ్మా. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈయన పలు రాష్ట్రాలకు మోస్ట్‌వాంటెడ్. ఆయన కోసం స్పెషల్ ఆపరేషన్ ఏడాది కాలంగా ఉదృతంగా సాగుతోంది. ఆయన ‘లెక్క తేలిస్తే’.. మావోయిస్టు పార్టీ అధ్యాయం ముగిసినట్లేనని కేంద్ర హోం శాఖ బలంగా భావిస్తోంది. ఇదీ చదవండి: మడావి హిడ్మా ఎక్కడ?మావోయిస్టు ఉద్యమం 1967లో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరి గ్రామంలో ప్రారంభమైంది.మార్క్సిజం–లెనినిజం–మావోయిజం సిద్ధాంతాల ఆధారంగా ప్రభుత్వ వ్యవస్థను కూల్చి.. సమసమాజాన్ని స్థాపించాలనే లక్ష్యంతో ఇంతకాలం సాగింది.ఉద్యమం కాలక్రమంలో.. CPI (ML) పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్(MCC) విలీనంతో 2004లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ఏర్పడింది.ఉద్యమం ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని భావించింది. కానీ హింసా మార్గం వల్ల పోను పోను ప్రజల మద్దతు తగ్గుతూ వచ్చింది.ప్రస్తుతం ఈ ఉద్యమం తీవ్రంగా క్షీణించగా.. 2026 నాటికి పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంతో ఉంది. -
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
ముద్దనూరు: మండలంలోని చింతకుంట గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఏసన్న(32) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఏఎస్ఐ జయరాముడు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరం ఆర్కే నగర్లో నివసిస్తున్న ఏసన్న 10 సంవత్సరాల క్రితం చింతకుంట గ్రామానికి చెందిన రాణి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. ఏసన్న మద్యం సేవించి భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ గొడవ భరించలేక రాణి వారం రోజుల క్రితం పుట్టినిల్లు చింతకుంటకు వచ్చింది. భార్య రాణి కోసం ఏసన్న కడప నుంచి సోమవారం సాయంత్రం చింతకుంటకు చేరుకున్నాడు. అయితే మంగళవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో చింతకుంటలో ఇంటిబయట అరుగుపై పడిపోయి ఉన్న ఏసన్న మృతి చెందినట్లు బంధువులు గుర్తించారు. ఏసన్న తల్లిదండ్రులు, బంధువులు చింతకుంట చేరుకుని తమ కుమారుని మృతిపై అనుమానాలున్నాయని ఫిర్యాదు చేయడంతో, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. -
జోగురామన్నకు పితృవియోగం
తెలంగాణ అటవీశాఖా మంత్రి జోగురామన్న తండ్రి జోగు ఆశన్న(95) బుధవారం మధ్యాహ్నాం తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు కన్ను మూశారు. దీంతో మంత్రి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. స్వగ్రామం జైనత్ మండలం దీపాయిగూడలో గురువారం అంత్యక్రియలు జరగనున్నాయి. -
నాపరాళ్ల ఫ్యాక్టరీలో ఘోరం
కట్టుకున్న భర్తే.. ఓ ఇల్లాలి పాలిట కాల యముడిగా మారాడు. కత్తితో దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంట గ్రామంలోని నాపరాళ్ల ఫ్యాక్టరీలో ఈ ఘోరం జరిగింది. దేవకుమారి (37), ఏసన్నలు భార్యా భర్తులు. వీరు నాపరాళ్ల ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తూ అక్కడే ఓ గదిలో ఉంటున్నారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఏసన్న తన భార్య దేవకుమారిని కత్తితో నరికి బయట గొళ్లెం పెట్టి పరారయ్యాడు. లోపల రక్తపు మడుగులో దేవకుమారి మృతి చెంది ఉండగా మంగళవారం మధ్యాహ్నం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.


