Ashes first test
-
ఆదుకున్న స్మిత్, మార్ష్
బ్రిస్బేన్: యాషెస్ తొలి టెస్టుపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముందుగా 56 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బ తీసిన ఆస్ట్రేలియా... ఆ తర్వాత ప్రత్యర్థి బౌలర్ల జోరుకు 76 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ స్మిత్, షాన్ మార్‡్ష కీలక భాగస్వామ్యం కంగారు జట్టును కాపాడింది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (64 బ్యాటింగ్) అర్ధ సెంచరీ సాధించగా, షాన్ మార్‡్ష (44 బ్యాటింగ్) రాణించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అభేద్యంగా 89 పరుగులు జోడించారు. ఓపెనర్లు వార్నర్ (26), బెన్‌క్రాఫ్ట్ (5)లతో పాటు ఖాజా (11), హ్యాండ్స్కోంబ్ (14) విఫలమయ్యారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 196/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ మలాన్ (56) అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, మొయిన్ అలీ (38) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 83 పరుగులు జత చేయగా... స్టార్క్, కమిన్స్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం చేతిలో ఆరు వికెట్లతో ఆస్ట్రేలియా మరో 137 పరుగులు వెనుకబడి ఉంది. స్మిత్ ఇంకా క్రీజ్‌లో ఉండటంతో ఆసీస్‌కు ఆధిక్యం దక్కుతుందా లేదా చూడాలి. -
ఆసీస్ ఘన విజయం
బ్రిస్బేన్: ఇంగ్లండ్‌లో ఎదురైన పరాభవానికి ఆస్ట్రేలియా బదులు తీర్చుకుంటోంది. ప్రతీకార పోరుగా భావిస్తున్న యాషెస్ తొలి టెస్టులో 381 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో క్లార్క్‌సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... ఆదివారం నాలుగో రోజు పేసర్ మిషెల్ జాన్సన్ (5/42) నిప్పులు చెరిగే బంతులతో కుక్‌సేనను వణికించాడు. దీంతో 561 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 81.1 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. కుక్ (65), బెల్ (32), పీటర్సన్ (26), రూట్ (26 నాటౌట్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు అడిలైడ్‌లో డిసెంబర్ 5న ప్రారంభమవుతుంది. 24/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. పీటర్సన్ తొందరగా అవుటైనా... కుక్ నిలకడగా ఆడాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించాక పీటర్సన్‌ను జాన్సన్ దెబ్బతీశాడు. తర్వాత బెల్ సాయంతో కుక్ ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే నిలకడగా ఆడుతున్న ఈ ఇద్దరు వరుస విరామాల్లో అవుట్ కావడం ఇంగ్లండ్‌ను దెబ్బతీసింది. సిడిల్ బౌలింగ్‌లో బెల్; లియోన్ స్పిన్‌కు కుక్ వికెట్‌ను సమర్పించుకున్నారు. దీంతో ఇంగ్లండ్ 142 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. రూట్ క్రీజులో నిలబడ్డా... జాన్సన్ దెబ్బకు లోయర్ ఆర్డర్ పూర్తిగా చేతులెత్తేసింది. దీంతో ఇంగ్లండ్ 49 పరుగుల తేడాతో చివరి ఏడు వికెట్లు చేజార్చుకుంది. -
చెలరేగిన జాన్సన్
బ్రిస్బేన్: పేసర్ మిషెల్ జాన్సన్ బంతితో రాణించి యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు ఆధిక్యం అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 52.4 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ కార్బెర్రీ (113 బంతుల్లో 40; 4 ఫోర్లు)టాప్ స్కోరర్. జాన్సన్ నాలుగు, హారిస్ మూడు వికెట్లు తీశారు. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. బ్రాడ్ హాడిన్ (153 బంతుల్లో 94; 8 ఫోర్లు; 1 సిక్స్) సెంచరీని కోల్పోయాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఆసీస్ వికెట్ నష్టపోకుండా 22 ఓవర్లలో 65 పరుగులు చేసింది. క్రీజులో రోజర్స్ (15), వార్నర్ (45) ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 159 కలుపుకుని ఆసీస్ 224 పరుగుల ఆధిక్యంలో ఉంది.