
ఆసీస్ ఘన విజయం
బ్రిస్బేన్: ఇంగ్లండ్‌లో ఎదురైన పరాభవానికి ఆస్ట్రేలియా బదులు తీర్చుకుంటోంది. ప్రతీకార పోరుగా భావిస్తున్న యాషెస్ తొలి టెస్టులో 381 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది.
దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో క్లార్క్‌సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... ఆదివారం నాలుగో రోజు పేసర్ మిషెల్ జాన్సన్ (5/42) నిప్పులు చెరిగే బంతులతో కుక్‌సేనను వణికించాడు. దీంతో 561 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 81.1 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. కుక్ (65), బెల్ (32), పీటర్సన్ (26), రూట్ (26 నాటౌట్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు అడిలైడ్‌లో డిసెంబర్ 5న ప్రారంభమవుతుంది.
24/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. పీటర్సన్ తొందరగా అవుటైనా... కుక్ నిలకడగా ఆడాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించాక పీటర్సన్‌ను జాన్సన్ దెబ్బతీశాడు.
తర్వాత బెల్ సాయంతో కుక్ ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే నిలకడగా ఆడుతున్న ఈ ఇద్దరు వరుస విరామాల్లో అవుట్ కావడం ఇంగ్లండ్‌ను దెబ్బతీసింది. సిడిల్ బౌలింగ్‌లో బెల్; లియోన్ స్పిన్‌కు కుక్ వికెట్‌ను సమర్పించుకున్నారు. దీంతో ఇంగ్లండ్ 142 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. రూట్ క్రీజులో నిలబడ్డా... జాన్సన్ దెబ్బకు లోయర్ ఆర్డర్ పూర్తిగా చేతులెత్తేసింది. దీంతో ఇంగ్లండ్ 49 పరుగుల తేడాతో చివరి ఏడు వికెట్లు చేజార్చుకుంది.