Ashish Khetan
-
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత ఆశుతోష్ పార్టీని వీడి వారం గడవక ముందే మరో నేత ఆశిష్ ఖేతన్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆగస్ట్ 15నే ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పంపినట్లు అశిష్ ఖేతన్ ప్రకటించారు. తాను లీగల్ ప్రాక్టీస్ చేసేందుకు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు క్రీయాశీల రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు బుధవారం సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ప్రభుత్వ సలహా మండలైన ఢిల్లీ డైలాగ్ డెవలప్మెంట్ కమిషన్ నుంచి గత ఏప్రీల్‌లోనే ఖేతన్ వైదొలిగిన విషయం తెలిసిందే. జర్నలిస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఖేతన్ ఆప్ ఏర్పడిన మొదటిలోనే పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి.. బీజేపీ అభ్యర్థి మీనాక్షీ లేఖీ చేతిలో ఓటమిపాలైయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్నారని, దానికి పార్టీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేసిందుకే ఆయన పార్టీకి రాజీనామా చేశారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ సీనియర్ నేతల రాజీనామాలు ఆప్‌ను కలవరపెడుతున్నాయి. -
మీ వల్లే ఆమె జైలులో ఉంది
ఆప్ నేత ఆశిష్ ఖేతన్‌కు బెదిరింపు లేఖ న్యూఢిల్లీ: కొన్ని హిందూ అనుంబంధ సంస్థలు తనను చంపుతామని బెదిరించినట్లు ఆప్ నాయకుడు ఆశిష్ ఖేతన్ శనివారం ఆరోపించారు. వాటిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజును డిమాండ్ చేశారు. హిందూ సాధువులపై పాపాలు చేయడంలో అన్ని పరిమితులు దాటారని పేర్కొంటూ మే 9న ఓ లేఖ ఆయనకు చేరింది. ‘మీ వల్లే.. సాధ్వి ప్రగ్యా(మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు), వీరేంద్ర సింగ్(హేతువాది దబోల్కర్ హత్య కేసులో నిందితుడు) జైలులో ఉన్నారు. మీలాంటి వాళ్లకు ఉరిశిక్షే సరి’ అని లేఖలో రాసి ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీనిపై స్పందిస్తూ... ఇది తనను షాక్‌కు గురిచేసిందని, హోం మంత్రి రాజ్‌నాథ్ చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ జర్నలిస్టు అయిన ఆశిష్ ఖేతన్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ నియోజక వర్గం పోటీ చేసి ఓడిపోయారు. గతేడాది కూడా ఆయనకు ఇదే విధంగా బెదిరింపు లేఖ వచ్చింది. జర్నలిస్టులు, రచయితలు, హక్కుల కార్యకర్తలకు అతివాదుల నుంచి ముప్పు పొంచివుందని ఖేతన్ ఆందోళన వ్యక్తం చేశారు. -
గ్రామాలకు ప్రత్యేక హోదా: ఆప్ హామీ
న్యూఢిల్లీ: వచ్చే శాసనసభ ఎన్నికల్లో గ్రామీణ ఢిల్లీ ప్రజలను ఆకట్టుకునేందుకు ఆప్ యత్నిస్తోంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని గ్రామాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని, ఈ మేరకు ఢిల్లీ భూ సంస్కరణల చట్టంలో మార్పులు తీసుకువస్తామని హామీ ఇస్తోంది. ఈ సందర్భంగా శనివారం పార్టీ నేత ఆశిష్ ఖేతన్ మాట్లాడుతూ.. తమ పార్టీ ఢిల్లీలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. గతంలో తాము అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ర్టంలోని గ్రామీణ ప్రాంత ప్రజల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టేందుకు యోచించినప్పటికీ సమయాభావం వల్ల వాటిని అమలుచేయలేకపోయామన్నారు. ఇప్పుడు తమ పార్టీ అధికారంలోకి వస్తే మొదట గ్రామీణ రోడ్ల వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. అలాగే గ్రామాల్లో ప్రజలకు పైపుల ద్వారా మంచినీటిని అందించేందుకు కృషిచేస్తామన్నారు. అలాగే నాణ్యమైన విత్తనాలు, పశువుల ఆస్పత్రుల నిర్మాణంపై కూడా దృష్టిపెట్టనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత యువతకు తమ పార్టీ అధినేత కేజ్రీవాల్ తగిన ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగా వారికి మెరుగైన విద్యావకాశాలు అందజేసేందుకు స్థానికంగా కళాశాలలను నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు తగిన ప్రాచుర్యాన్ని కల్పించి యువతను క్రీడలవైపు ఆకర్షించేందుకు తగిన ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించారు. ఢిల్లీలో 362 గ్రామాలుండగా ఇప్పటికే 135 గ్రామాలు పట్టణీకరించబడ్డాయని ఖేతన్ చెప్పారు. మిగిలిన గ్రామాలను కూడా అభివృద్ధి పథంలో నడిపించేందుకు తమ పార్టీ కృషిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. -
...అందుకే రాజకీయాల్లోకొచ్చా!
న్యూఢిల్లీ: పరిశోధనాత్మక జర్నలిస్టుగా కొనసాగుతున్న తాను రాజకీయాల్లోకి రావడానికి కారణం గుజరాత్ రాష్ట్రమేనన్నారు. గుజరాత్లో అభివృద్ధి జరిగిందంటూ దేశమంతా కమలనాథులు ప్రచారం చేసుకుంటుంటే అందులో నిజానిజాలను తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లిన తనకు ఎన్నో అంశాలు కదిలించాయన్నారు. గుజరాత్లో అవినీతి విలయ తాండవం చేస్తోందని, అభివృద్ధి కూడా అంతంతమాత్రంగానే ఉందని కేతన్ అన్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న కేతన్ తన రాజకీయ అరంగేట్రం గురించి ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ‘పరిశోధనాత్మక జర్నలిస్టుగా గులైల్ డాట్ కామ్ వెబ్ పోర్టల్‌ను నిర్వహిస్తున్న నేను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి గుజరాత్ పర్యటనకు వెళ్లాను. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ పాలనలో గుజరాత్ చాలా అభివృద్ధి చెందిందంటూ దేశమంతా ప్రచారం జరుగుతుంటే అందులో నిజానిజాలు తెలుసుకునేందుకు కేజ్రీవాల్ నేతృత్వంలోని బృందం గుజరాత్ వెళ్లింది. అందులో సభ్యుడినైన నేను గుజరాత్ రాష్ట్రంలోని ప్రతి విషయాన్ని చాలా దగ్గరగా పరిశీలించాను. నిజంగా అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటున్న నేతలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి అక్కడ ఉంది. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి విలయ తాండవం చేస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు పలు బృందాలను పంపాం. వారు ఇచ్చిన నివేదికలు నన్ను ఎంతగానో కదిలించాయి. ఇక ఆ రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా ఎంతో దయనీయంగా ఉంది. అక్కడ చూసిన తర్వాత నాకు ఢిల్లీ గుర్తుకొచ్చింది. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పాలనలో ఢిల్లీ కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితిలోనే ఉందనిపించింది. ఢిల్లీలో కూడా అభివృద్ధి జరిపోతోందంటూ షీలాదీక్షిత్ ప్రచారం చేసుకున్న రీతిలోనే గుజరాత్ గురించి నరేంద్ర మోడీ ప్రచారం చేసుకుంటున్నారు. ఢిల్లీలో జర్నలిస్టుగా ఉన్న నాకు ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసు. దీంతో పార్టీ సీనియర్ నాయకులు నన్ను న్యూఢిల్లీ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగమన్నారు. ముందు కొంత వెనుకాడినా గుజరాత్లో పరిస్థితి చూశాక తప్పకుండా రాజకీయాల్లోకి రావాలనిపించింది. అందుకే న్యూఢిల్లీ నుంచి బరిలోకి దిగాను. ఇక ప్రత్యర్థులెవరనే విషయాన్ని నేను ఆలోచించడం లేదు. ప్రజలకు న్యాయం జరగాలన్నదే నా ఆకాంక్ష’ అని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న జర్నలిస్టుల్లో కేతన్ రెండో అభ్యర్థి. ఐబీఎన్7 చానల్లో యాంకర్‌గా విధులు నిర్వర్తించిన అశుతోష్ కూడా రాజధానిలోని చాందినీ చౌక్ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్ వంటి ప్రత్యర్థులను అశుతోష్ ఢీకొంటుండగా కేతన్ కూడా రాజకీయాల్లో అరితేరిన కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్, బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖీ వంటి వారికి ప్రత్యర్థిగా నిలబడుతున్నారు. సామాన్యులమంటూ చెప్పుకునే ఆప్ అభ్యర్థులు గత డిసెంబర్లో జరిగిన ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో సీనియర్ కాంగ్రెస్ నేతలెందరినో ఓడించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా దేశ రాజధానిలో సీనియర్ రాజకీయ నాయకులకు పరాభవం తప్పదని ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక న్యూఢిల్లీలో ఆప్ విజయకేతనాన్ని ఎగురవేసేందుకు కేతన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. నగరం నడిబొడ్డులోని హనుమాన్ రోడ్లోగల పార్టీ కార్యాలయంలోనే రోజంతా గడుపుతున్న కేతన్ పార్టీ కార్యకర్తలను ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. దాదాపు పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉన్న షీలాదీక్షిత్ ప్రభుత్వం ఢిల్లీలో సామాన్యుడి కష్టాలను తీర్చలేకపోయిందని కేతన్ ఆరోపించారు. నేను ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైతే ఆమ్ ఆద్మీ పార్టీ లేవనెత్తిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. అదే తమ పార్టీ లక్ష్యమన్నారు. ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను దేశం దృష్టికి తీసుకెళ్తానని, వాటి పరిష్కారానికి ప్రాణమున్నంత వరకు పోరాడతానన్నారు. నా నియోజకవర్గంలో నీరు, విద్యుత్, రోడ్లు, అవినీతి ప్రధాన సమస్యలుగా గుర్తించానని చెప్పారు. ప్రత్యేకించి ఢిల్లీ అభివృద్ధి సంస్థ(డీడీఏ)లో విలయతాండవ ం చేస్తున్న అవినీతిని అంతమొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ రేసులో లేనట్టే..: ఆశిష్ న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్-బీజేపీల మధ్య మాత్రమే పోటీ జరగనుందని, కాంగ్రెస్ ఈ లోక్‌సభ ఎన్నికల రేసులో లేనట్టేనని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఆశిష్ కేతన్ అన్నారు. ఇక్కడి మాలవీయనగర్ మెయిన్ మార్కెట్లో నిర్వహించిన జన్ సభలో ఆయన మాట్లాడుతూ... ‘నా ప్రత్యర్థి బీజేపీ మాత్రమే. కాంగ్రెస్ రేసులో లేనట్టే. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఏడింటిని ఆప్ గెలుచుకుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో నా విజయం మరింత సులువైంద’న్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మాలవీయనగర్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడి ఓటర్లను ఆప్‌వైపు తిప్పుకునేందుకు ఆశిష్ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. -
ఆప్ తుది జాబితా విడుదల
సాక్షి, న్యూఢిల్లీ:ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాలుగో జాబితా విడుదలయింది. పాత్రికేయుడు ఆశిష్ ఖైతాన్ న్యూఢిల్లీ నుంచి, దేవేంద్ర సెహ్రావత్ దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ఈ పార్టీ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫరీదాబాద్ నుంచి పురుషోత్తం డాగర్, గౌతమబుద్ధనగర్ నుంచి కేపీ సింగ్ తమ అభ్యర్థులుగా పోటీచేస్తారని ఆప్ సోమవారం విడుదల చేసిన నాలుగవ జాబితా పేర్కొంది. తాజాగా న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో మొత్తం ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకూ ఆప్ అభ్యర్థులను ప్రకటించినట్టయింది. దీంతో ప్రత్యర్థి పార్టీల కన్నా ఇది ఎన్నికల ప్రచారంలో ముందు నిలిచింది. ఆశిష్: స్టింగ్ ఆపరేషన్ల నిపుణుడు న్యూఢిల్లీ నుంచి ఆప్ టికెట్ పొందిన ఆశిష్ ఖైతాన్ గులాలీ డాట్‌కామ్ న్యూపోర్టల్ వ్యవస్థాపకుడు. పలు స్టింగ్ ఆపరేషన్ల ద్వారా సంచలనాత్మక విషయాలను బయటపెట్టారు. గుజరాత్ మంత్రి అమిత్‌షా ఆదేశాల మేరకు అక్కడి పోలీసులు ఒక మహిళపై అక్రమంగా నిఘా పెట్టినట్టు ఆయన స్టింగ్ ఆపరేషన్ వెల్లడించింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమయింది. తెహల్కా పత్రికలో పనిచేసినప్పటి నుంచి ఆశిష్ స్టింగ్ ఆపరేషన్లతో పేరు తెచ్చుకున్నారు. గుజరాత్ అల్లర్ల కేసులో బాబుబజ్రంగీ ప్రమేయంపైనా ఆయన స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. మోడీ పాత్రపై పలు ఆరోపణలు గుప్పించారు. మహారాష్ట్రలో బాంబు పేలుళ్ల కేసుల్లో పోలీసులు ముస్లిం యువకులను చిత్రహింసలు పెట్టడాన్ని ఆయన వెల్లడిచేశారు. లోక్‌సభ టికెట్ దక్కడంపై స్పందిస్తూ ‘నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తనకు టికెట్ ఇచ్చిందని అనుకోవడం లేదు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా చాలాకాలంగా పోరాడుతున్నాను’ అని ఖైతాన్ చెప్పారు. సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్న దేవేంద్ర దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేయనున్న కల్నల్ దేవేంద్ర సెహ్రావత్ విధానసభ ఎన్నికల్లో బిజ్వాసన్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆయన రైతుల హక్కుల కోసం చాలా కాలంగా పోరాడుతున్నారు. భూములు కోల్పోయిన రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వాలంటూ సెహ్రావత్ పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు. ముగ్గురు పాత్రికేయులు ఆప్ తరఫున పోటీచేయనున్న ఏడుగురు అభ్యర్థుల్లో ముగ్గురు మీడియా రంగానికి చెందిన వారే కావడం విశేషం. చాందినీచౌక్ అభ్యర్థి ఆశుతోష్ టీవీ జర్నలిస్టు కాగా జర్నైల్ సింగ్ పత్రికారంగంలో పనిచేశారు. ఆశిష్ ఖైతాన్ వెబ్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.హిందీ వార్తాచానెల్ ఐబీఎన్ ద్వారా ఆశుతోష్ చాలా ఏళ్లుగా టీవీ ప్రేక్షకులకు సుపరిచితులు. జర్నైల్ సింగ్ దైనిక్ జాగరణ్ హిందీ దినపత్రికలో 15 ఏళ్ల పాటు పనిచేశారు. 2009 లోక్‌సభ ఎన్నికలకు ముందు అప్పటి హోంమంత్రి చిదంబరంపై విలేకరుల సమావేశంలో బూటు విసిరి సంచలనం సృష్టించారు. సిక్కుఅల్లర్ల కేసులో ప్రభుత్వ నిర్లిప్త వైఖరికి నిరసనగా హోంమంత్రిపై బూటు విసిరినట్టు ఆయన ప్రకటించారు. దరఖాస్తుల ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులను కాకుండా కొత్తగా పార్టీలో చేరినవారికి అవకాశాలు ఇవ్వడంపై వచ్చిన విమర్శలపై ఆప్ నేత మనీష్ సిసోడియా ప్రతిస్పందించారు. ‘జీవితకాలమంతా అవినీతి, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడినవాళ్లు దేశమంతటా ఉన్నారు. వీళ్లు మొదటి నుంచి ఆప్ ఉద్యమాల్లో పాల్గొననందుకు టికెట్ ఇవ్వకూడదనడం సరికాదు. కొత్తగా ఆవిర్భవించడం వల్ల పార్టీకి పలు చోట్ల కార్యకర్తల బలం లేదు. అందువల్ల దరఖాస్తులతోపాటు పరిశీలక బృందాలు సూచించిన పేర్లనూ పరిశీలించాం’ అని వివరణ ఇచ్చారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల నుంచి పోటీ కోసం ఆప్ ఇప్పటి వరకు 130 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, అంతర్గత కుమ్ములాటలు, భారీ పోటీ కారణంగా బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీలో అభ్యర్థులను ఇప్పటికీ ప్రకటి ంచలేదు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఆప్ అభ్యర్థులు: న్యూఢిల్లీ: ఆశిష్ ఖైతాన్ దక్షిణ ఢిల్లీ: కల్నల్ దేవేంద్ర సెహ్రావత్ ఈస్ట్ ఢిల్లీ: రాజ్‌మోహన్ గాంధీ వెస్ట్ ఢిల్లీ: జర్నైల్ సింగ్ నార్త్ ఈస్ట్ ఢిల్లీ: {పొఫెసర్ ఆనంద్‌కుమార్ నార్త్ వెస్ట్ ఢిల్లీ: మహేంద్ర సింగ్ చాందినీ చౌక్: ఆశుతోష్