న్యూఢిల్లీ: వచ్చే శాసనసభ ఎన్నికల్లో గ్రామీణ ఢిల్లీ ప్రజలను ఆకట్టుకునేందుకు ఆప్ యత్నిస్తోంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని గ్రామాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని, ఈ మేరకు ఢిల్లీ భూ సంస్కరణల చట్టంలో మార్పులు తీసుకువస్తామని హామీ ఇస్తోంది. ఈ సందర్భంగా శనివారం పార్టీ నేత ఆశిష్ ఖేతన్ మాట్లాడుతూ.. తమ పార్టీ ఢిల్లీలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. గతంలో తాము అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ర్టంలోని గ్రామీణ ప్రాంత ప్రజల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టేందుకు యోచించినప్పటికీ సమయాభావం వల్ల వాటిని అమలుచేయలేకపోయామన్నారు. ఇప్పుడు తమ పార్టీ అధికారంలోకి వస్తే మొదట గ్రామీణ రోడ్ల వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు.
అలాగే గ్రామాల్లో ప్రజలకు పైపుల ద్వారా మంచినీటిని అందించేందుకు కృషిచేస్తామన్నారు. అలాగే నాణ్యమైన విత్తనాలు, పశువుల ఆస్పత్రుల నిర్మాణంపై కూడా దృష్టిపెట్టనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత యువతకు తమ పార్టీ అధినేత కేజ్రీవాల్ తగిన ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగా వారికి మెరుగైన విద్యావకాశాలు అందజేసేందుకు స్థానికంగా కళాశాలలను నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు తగిన ప్రాచుర్యాన్ని కల్పించి యువతను క్రీడలవైపు ఆకర్షించేందుకు తగిన ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించారు. ఢిల్లీలో 362 గ్రామాలుండగా ఇప్పటికే 135 గ్రామాలు పట్టణీకరించబడ్డాయని ఖేతన్ చెప్పారు. మిగిలిన గ్రామాలను కూడా అభివృద్ధి పథంలో నడిపించేందుకు తమ పార్టీ కృషిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
గ్రామాలకు ప్రత్యేక హోదా: ఆప్ హామీ
Published Sat, Dec 27 2014 11:11 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement