ఆప్ తుది జాబితా విడుదల
ఆప్ తుది జాబితా విడుదల
Published Mon, Mar 10 2014 10:45 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
సాక్షి, న్యూఢిల్లీ:ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాలుగో జాబితా విడుదలయింది. పాత్రికేయుడు ఆశిష్ ఖైతాన్ న్యూఢిల్లీ నుంచి, దేవేంద్ర సెహ్రావత్ దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ఈ పార్టీ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫరీదాబాద్ నుంచి పురుషోత్తం డాగర్, గౌతమబుద్ధనగర్ నుంచి కేపీ సింగ్ తమ అభ్యర్థులుగా పోటీచేస్తారని ఆప్ సోమవారం విడుదల చేసిన నాలుగవ జాబితా పేర్కొంది. తాజాగా న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో మొత్తం ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకూ ఆప్ అభ్యర్థులను ప్రకటించినట్టయింది. దీంతో ప్రత్యర్థి పార్టీల కన్నా ఇది ఎన్నికల ప్రచారంలో ముందు నిలిచింది.
ఆశిష్: స్టింగ్ ఆపరేషన్ల నిపుణుడు
న్యూఢిల్లీ నుంచి ఆప్ టికెట్ పొందిన ఆశిష్ ఖైతాన్ గులాలీ డాట్‌కామ్ న్యూపోర్టల్ వ్యవస్థాపకుడు. పలు స్టింగ్ ఆపరేషన్ల ద్వారా సంచలనాత్మక విషయాలను బయటపెట్టారు. గుజరాత్ మంత్రి అమిత్‌షా ఆదేశాల మేరకు అక్కడి పోలీసులు ఒక మహిళపై అక్రమంగా నిఘా పెట్టినట్టు ఆయన స్టింగ్ ఆపరేషన్ వెల్లడించింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమయింది. తెహల్కా పత్రికలో పనిచేసినప్పటి నుంచి ఆశిష్ స్టింగ్ ఆపరేషన్లతో పేరు తెచ్చుకున్నారు. గుజరాత్ అల్లర్ల కేసులో బాబుబజ్‌రంగీ ప్రమేయంపైనా ఆయన స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. మోడీ పాత్రపై పలు ఆరోపణలు గుప్పించారు. మహారాష్ట్రలో బాంబు పేలుళ్ల కేసుల్లో పోలీసులు ముస్లిం యువకులను చిత్రహింసలు పెట్టడాన్ని ఆయన వెల్లడిచేశారు. లోక్‌సభ టికెట్ దక్కడంపై స్పందిస్తూ ‘నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తనకు టికెట్ ఇచ్చిందని అనుకోవడం లేదు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా చాలాకాలంగా పోరాడుతున్నాను’ అని ఖైతాన్ చెప్పారు.
సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్న దేవేంద్ర
దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేయనున్న కల్నల్ దేవేంద్ర సెహ్రావత్ విధానసభ ఎన్నికల్లో బిజ్వాసన్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆయన రైతుల హక్కుల కోసం చాలా కాలంగా పోరాడుతున్నారు. భూములు కోల్పోయిన రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వాలంటూ సెహ్రావత్ పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు.
ముగ్గురు పాత్రికేయులు
ఆప్ తరఫున పోటీచేయనున్న ఏడుగురు అభ్యర్థుల్లో ముగ్గురు మీడియా రంగానికి చెందిన వారే కావడం విశేషం. చాందినీచౌక్ అభ్యర్థి ఆశుతోష్ టీవీ జర్నలిస్టు కాగా జర్నైల్ సింగ్ పత్రికారంగంలో పనిచేశారు. ఆశిష్ ఖైతాన్ వెబ్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.హిందీ వార్తాచానెల్ ఐబీఎన్ ద్వారా ఆశుతోష్ చాలా ఏళ్లుగా టీవీ ప్రేక్షకులకు సుపరిచితులు. జర్నైల్ సింగ్ దైనిక్ జాగరణ్ హిందీ దినపత్రికలో 15 ఏళ్ల పాటు పనిచేశారు. 2009 లోక్‌సభ ఎన్నికలకు ముందు అప్పటి హోంమంత్రి చిదంబరంపై విలేకరుల సమావేశంలో బూటు విసిరి సంచలనం సృష్టించారు. సిక్కుఅల్లర్ల కేసులో ప్రభుత్వ నిర్లిప్త వైఖరికి నిరసనగా హోంమంత్రిపై బూటు విసిరినట్టు ఆయన ప్రకటించారు.
దరఖాస్తుల ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులను కాకుండా కొత్తగా పార్టీలో చేరినవారికి అవకాశాలు ఇవ్వడంపై వచ్చిన విమర్శలపై ఆప్ నేత మనీష్ సిసోడియా ప్రతిస్పందించారు. ‘జీవితకాలమంతా అవినీతి, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడినవాళ్లు దేశమంతటా ఉన్నారు. వీళ్లు మొదటి నుంచి ఆప్ ఉద్యమాల్లో పాల్గొననందుకు టికెట్ ఇవ్వకూడదనడం సరికాదు. కొత్తగా ఆవిర్భవించడం వల్ల పార్టీకి పలు చోట్ల కార్యకర్తల బలం లేదు. అందువల్ల దరఖాస్తులతోపాటు పరిశీలక బృందాలు సూచించిన పేర్లనూ పరిశీలించాం’ అని వివరణ ఇచ్చారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల నుంచి పోటీ కోసం ఆప్ ఇప్పటి వరకు 130 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, అంతర్గత కుమ్ములాటలు, భారీ పోటీ కారణంగా బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీలో అభ్యర్థులను ఇప్పటికీ ప్రకటి ంచలేదు.
ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు
ఆప్ అభ్యర్థులు:
న్యూఢిల్లీ: ఆశిష్ ఖైతాన్
దక్షిణ ఢిల్లీ: కల్నల్ దేవేంద్ర సెహ్రావత్
ఈస్ట్ ఢిల్లీ: రాజ్‌మోహన్ గాంధీ
వెస్ట్ ఢిల్లీ: జర్నైల్ సింగ్
నార్త్ ఈస్ట్ ఢిల్లీ: {పొఫెసర్ ఆనంద్‌కుమార్
నార్త్ వెస్ట్ ఢిల్లీ: మహేంద్ర సింగ్
చాందినీ చౌక్: ఆశుతోష్
Advertisement