...అందుకే రాజకీయాల్లోకొచ్చా!
Published Wed, Apr 2 2014 6:01 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ: పరిశోధనాత్మక జర్నలిస్టుగా కొనసాగుతున్న తాను రాజకీయాల్లోకి రావడానికి కారణం గుజరాత్ రాష్ట్రమేనన్నారు. గుజరాత్‌లో అభివృద్ధి జరిగిందంటూ దేశమంతా కమలనాథులు ప్రచారం చేసుకుంటుంటే అందులో నిజానిజాలను తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లిన తనకు ఎన్నో అంశాలు కదిలించాయన్నారు. గుజరాత్‌లో అవినీతి విలయ తాండవం చేస్తోందని, అభివృద్ధి కూడా అంతంతమాత్రంగానే ఉందని కేతన్ అన్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న కేతన్ తన రాజకీయ అరంగేట్రం గురించి ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ‘పరిశోధనాత్మక జర్నలిస్టుగా గులైల్ డాట్ కామ్ వెబ్ పోర్టల్‌ను నిర్వహిస్తున్న నేను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి గుజరాత్ పర్యటనకు వెళ్లాను. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ పాలనలో గుజరాత్ చాలా అభివృద్ధి చెందిందంటూ దేశమంతా ప్రచారం జరుగుతుంటే అందులో నిజానిజాలు తెలుసుకునేందుకు కేజ్రీవాల్ నేతృత్వంలోని బృందం గుజరాత్ వెళ్లింది. అందులో సభ్యుడినైన నేను గుజరాత్ రాష్ట్రంలోని ప్రతి విషయాన్ని చాలా దగ్గరగా పరిశీలించాను. నిజంగా అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటున్న నేతలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి అక్కడ ఉంది.
ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి విలయ తాండవం చేస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు పలు బృందాలను పంపాం. వారు ఇచ్చిన నివేదికలు నన్ను ఎంతగానో కదిలించాయి. ఇక ఆ రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా ఎంతో దయనీయంగా ఉంది. అక్కడ చూసిన తర్వాత నాకు ఢిల్లీ గుర్తుకొచ్చింది. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పాలనలో ఢిల్లీ కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితిలోనే ఉందనిపించింది. ఢిల్లీలో కూడా అభివృద్ధి జరిపోతోందంటూ షీలాదీక్షిత్ ప్రచారం చేసుకున్న రీతిలోనే గుజరాత్ గురించి నరేంద్ర మోడీ ప్రచారం చేసుకుంటున్నారు. ఢిల్లీలో జర్నలిస్టుగా ఉన్న నాకు ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసు. దీంతో పార్టీ సీనియర్ నాయకులు నన్ను న్యూఢిల్లీ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగమన్నారు. ముందు కొంత వెనుకాడినా గుజరాత్‌లో పరిస్థితి చూశాక తప్పకుండా రాజకీయాల్లోకి రావాలనిపించింది. అందుకే న్యూఢిల్లీ నుంచి బరిలోకి దిగాను. ఇక ప్రత్యర్థులెవరనే విషయాన్ని నేను ఆలోచించడం లేదు.
ప్రజలకు న్యాయం జరగాలన్నదే నా ఆకాంక్ష’ అని చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న జర్నలిస్టుల్లో కేతన్ రెండో అభ్యర్థి. ఐబీఎన్7 చానల్‌లో యాంకర్‌గా విధులు నిర్వర్తించిన అశుతోష్ కూడా రాజధానిలోని చాందినీ చౌక్ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్ వంటి ప్రత్యర్థులను అశుతోష్ ఢీకొంటుండగా కేతన్ కూడా రాజకీయాల్లో అరితేరిన కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్, బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖీ వంటి వారికి ప్రత్యర్థిగా నిలబడుతున్నారు. సామాన్యులమంటూ చెప్పుకునే ఆప్ అభ్యర్థులు గత డిసెంబర్‌లో జరిగిన ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో సీనియర్ కాంగ్రెస్ నేతలెందరినో ఓడించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా దేశ రాజధానిలో సీనియర్ రాజకీయ నాయకులకు పరాభవం తప్పదని ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక న్యూఢిల్లీలో ఆప్ విజయకేతనాన్ని ఎగురవేసేందుకు కేతన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. నగరం నడిబొడ్డులోని హనుమాన్ రోడ్‌లోగల పార్టీ కార్యాలయంలోనే రోజంతా గడుపుతున్న కేతన్ పార్టీ కార్యకర్తలను ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. దాదాపు పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉన్న షీలాదీక్షిత్ ప్రభుత్వం ఢిల్లీలో సామాన్యుడి కష్టాలను తీర్చలేకపోయిందని కేతన్ ఆరోపించారు. నేను ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైతే ఆమ్ ఆద్మీ పార్టీ లేవనెత్తిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. అదే తమ పార్టీ లక్ష్యమన్నారు. ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను దేశం దృష్టికి తీసుకెళ్తానని, వాటి పరిష్కారానికి ప్రాణమున్నంత వరకు పోరాడతానన్నారు. నా నియోజకవర్గంలో నీరు, విద్యుత్, రోడ్లు, అవినీతి ప్రధాన సమస్యలుగా గుర్తించానని చెప్పారు. ప్రత్యేకించి ఢిల్లీ అభివృద్ధి సంస్థ(డీడీఏ)లో విలయతాండవ ం చేస్తున్న అవినీతిని అంతమొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కాంగ్రెస్ రేసులో లేనట్టే..: ఆశిష్
న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్-బీజేపీల మధ్య మాత్రమే పోటీ జరగనుందని, కాంగ్రెస్ ఈ లోక్‌సభ ఎన్నికల రేసులో లేనట్టేనని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఆశిష్ కేతన్ అన్నారు. ఇక్కడి మాలవీయనగర్ మెయిన్ మార్కెట్‌లో నిర్వహించిన జన్ సభలో ఆయన మాట్లాడుతూ... ‘నా ప్రత్యర్థి బీజేపీ మాత్రమే. కాంగ్రెస్ రేసులో లేనట్టే. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఏడింటిని ఆప్ గెలుచుకుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో నా విజయం మరింత సులువైంద’న్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మాలవీయనగర్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడి ఓటర్లను ఆప్‌వైపు తిప్పుకునేందుకు ఆశిష్ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు.
Advertisement