సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రజా తీర్పు బీజేపీకి అనుకూలంగా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉంటుందని ముందే అనుకున్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు ఒక్కసీటుకూడా దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఆప్ అభ్యర్థులందరూ రెండోస్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ పనితీరు నిరాశాజనకంగా ఉందని పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా అంగీకరించారు. లోక్‌సభ ఎన్నికల ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికలపైనా ఉంటుందన్నది కాదనలేని అంశం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆశిస్తున్న ఆప్ నేతలకు ఈ ఫలితాలు చేదు మాత్రలా పరిణమించాయి.
నగరంలో నరేంద్ర మోడీ ప్రభంజనం ఏమీ లేదన్న ఆ పార్టీ నేతల మాటలు అవాస్తవాలని తేలాయి. 49 రోజుల పాలన అనంతరం హఠాత్తుగా గద్దె దిగడంతో ఈ పార్టీపై ప్రజలకు విముఖత పెరిగిందని నిర్ధారణ అయింది. అన్ని సీట్లూ ఓడిపోయిన తరువాత ఆప్ నేతలు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. తమ పొరపాట్లను సరిదిద్దుకుని ప్రజాదరణ పొందుతామని అంటున్నారు. ఆప్ నేతలు దేశమంతటా దృష్టి పెట్టకుండా ఢిల్లీపైనే శ్రద్ధ చూపించి ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవని ఆ పార్టీ అభిమానాలు అంటున్నారు. ప్రజలకు అరచేతిలో స్వర్గాన్ని చూపించి వాగ్ధానాలను నెరవేర్చకుండానే గద్దె దిగడం వల్ల ఆప్‌కు ఓటమి తప్పలేదని, ఇదంతా ఆప్ చేజేతులా చేసుకున్నదేనని విమర్శకులు అంటున్నారు.
అయితే అసెంబ్లీలో కేజ్రీవాల్‌కు, కేంద్రంలో నరేంద్ర మోడీకి ఓటేయాలని ఢిల్లీ వాసులు ముందునుంచే నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి అధికసీట్లు దక్కడం, ఆప్‌కు ఓటమి ఎదురుకావడంలో ఆశ్చర్యమేమీ లేదని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఆప్ బాగా కృషి చేయకతప్పదు.
నగరంలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది కాబట్టి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా ఆప్, బీజేపీ మధ్యనే ఉంటుందని అంతా భావించారు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ఆప్ సర్వశక్తులు ఒడ్డవలసి ఉంటుందని వారు అంటున్నారు. టికెట్ల కేటాయింపులో ఆప్ పొరపాట్లు చేసిందనే వాదనలూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్.కె. పురం నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన షాజియా ఇల్మీ ఢిల్లీ నుంచి పోటీ చేయాలనుకున్నప్పటికీ ఘజియాబాద్ టికెట్ ఇచ్చారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కల్నల్ దేవేంద్రసెహ్రావత్‌కు దక్షిణ ఢిల్లీ టికెట్ ఇచ్చారని కార్యకర్తలు విమర్శిస్తున్నారు.
ఫలితాలు నిరాశ కలిగించాయి: ‘ఆప్’
Published Fri, May 16 2014 10:29 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement