సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ఫలితాల వరస చూస్తే త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. 15 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీకి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేతికందినట్టే అర ది చేజారింది. రాష్ట్రంలో గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 32 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకు రాలేకపోయింది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యర్థి పార్టీలను చీల్చిన అపఖ్యాతి రాకూడదనే ముందుజాగ్రత్తతో తీసుకున్న చర్య ఇప్పుడు ఆ పార్టీకి లాభాన్ని చేకూర్చింది.
నరేంద్ర మోడీ ప్రభంజనంతో పాటు ఆప్‌పై నగరవాసులకు తగ్గిన మోజు, కాంగ్రెస్ వ్యతిరేకత ఆ పార్టీకి అనుకూలంగా మారాయి. ఫలితంగా ఆ పార్టీ నగరంలో ఉన్న మొత్తం ఏడు ఎంపీ స్థానాలనూ కైవసం చేసుకోగలిగింది. తాజా ఎన్నికల్లో పార్టీ పక్షాన లభించిన ఏకపక్ష ప్రజాతీర్పుతో ఉత్సాహం రెట్టించిన బీజేపీ ఢిల్లీలో అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ఎన్నికలు జరిపించడానికి పావులు కదపవచ్చని రాజకీయపండితులు అబిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి వచ్చే మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిపించినట్లయితే బీజేపీకి సంపూర్ణ మెజారిటీ దక్కడం ఖాయంగా కనబడుతోంది.
ఢిల్లీ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు?
Published Fri, May 16 2014 10:19 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
Advertisement